
తెలంగాణ వ్యాప్తంగా గత పది రోజులుగా పడుతోన్న వర్షాలకు చెరువులు,కుంటలు నిండిపోయాయి. వాగులు వంకలు పొంగిపొర్లిపోతున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
హనుమకొండ జిల్లా కాజీపేటలోని సోమిడిలో ఓ ఇంటిపై ఇవాళ పిడుగు పడింది. పిడుగు దాటికి ఇంటి ప్రహరీ గోడకు పగుళ్లు వచ్చాయి. పిడుగు పడిన చోట కరెంట్ నిలిచిపోయింది, గోడ కూలిపోయింది. . కరెంట్ పైపులు,నీళ్ల పైపులు పగిలిపోయాయి. ఇంట్లో ఉన్న ఎలక్ట్రిక్ పరికరాలు కాలిపోయాయి. పిడుగు పడిన చోట ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇంట్లో ఉండగా ఒక్కసారిగా ఏదో పెద్ద శబ్దం వచ్చిందని..బటయకు వచ్చి చూడగానే గోడ ధ్వంసమై పోయిందని ఇంటి సభ్యులు చెప్పారు.
వాయువ్వ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో జులై 27, 28న రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ , 10 జిల్లాలకు ఆరెంజ్, మరో 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.