సెక్రటేరియేట్‌‌లో హౌస్ కీపింగ్ స్టాఫ్​ కష్టాలు

సెక్రటేరియేట్‌‌లో హౌస్ కీపింగ్ స్టాఫ్​ కష్టాలు
  • టైంకు జీతాలివ్వని కాంట్రాక్టర్​
  •  పీఎఫ్​, ఈఎస్​ఐ కూడా లేదు
  •  పండుగల వేళ సెలవుల్లేవ్
  •  ఇటీవల ​ప్రజావాణిలో ఫిర్యాదు 

ఖైరతాబాద్, వెలుగు: సెక్రటేరియేట్‌‌లో తాము చెప్పరాని కష్టాలు పడుతున్నామని హౌస్​కీపింగ్ స్టాఫ్​ ఇటీవల పూలే భవన్​లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్​సమయానికి జీతాలు ఇవ్వడం లేదని, ఈఎస్ఐ, పీఎఫ్​ నెంబర్లు చెప్పడం లేదన్నారు. జీతాలు ఇవ్వకపోవడంతో గురువారం డ్యూటీలకు వెళ్లేది లేదని స్పష్టం చేశామని, దీంతో సూపర్​ వైజర్​  సర్ధి  చెప్పి డ్యూటీ చేయించారన్నారు. పండుగల వేళ కూడా సెలవులు ఇవ్వడం లేదన్నారు.  ఏడు ఫ్లోర్లలో ఒక్కో అంతస్తులో  ఆరుగురం డ్యూటీ చేస్తుంటామని,  తమ సమస్యలపై కాంట్రాక్టర్‌‌‌‌ను ప్రశ్నిస్తే  ఐడీ కార్డు తీసుకుని ఇంటికి పంపిస్తారని ఆరోపించారు. 

ఉదయం 7 గంటలకు కొంచెం ఆలస్యమైనా  ఆరోజు పని లేనట్టేనన్నారు. ఒక్కోసారి తమను ఆఫీసర్ల ఇండ్లలో  పనికి పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముందు 150 మంది ఉండేవారని, ఇప్పుడు 70  మంది మాత్రమే పని చేస్తున్నారన్నారు. కొత్త సచివాలయం కట్టిన తర్వాత  కొత్త కాంట్రాక్టర్​ వచ్చారని, అప్పటి నుంచి తమకు జీతాలు టైంకు  ఇవ్వడం లేదన్నారు.