సత్తుపల్లి ఓపెన్​కాస్ట్​ బ్లాస్టింగ్​లతో దెబ్బతింటున్న ఇండ్లు

  • 16 ఏళ్లుగా పరిహారం కోసం పోరాటం 
  • రూ.10 లక్షలు పరిహారం అడుగుతున్న బాధితులు
  • పట్టించుకోని సింగరేణి ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు 

ఖమ్మం/సత్తుపల్లి, వెలుగు: సత్తుపల్లిలో సింగరేణి ఓపెన్​కాస్ట్ గనుల్లో బ్లాస్టింగ్ కారణంగా పదహారేళ్ల నుంచి చుట్టుపక్కన కాలనీల్లో నివసించే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పేలుళ్లతో దెబ్బతిన్న తమ ఇండ్లకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలంటూ బాధితులు ఆందోళనలు చేస్తున్నారు. కొంతమంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్​ ను ఆశ్రయించగా, హైకోర్టులో కూడా పిటిషన్లు వేశారు. ఇటీవల కాలంలో ఈ ఆందోళనలకు రాజకీయ రంగు పులుముకోవడంతో అధికారులపైనా ఒత్తిడి పెరిగింది. దీంతో తమకు ఇప్పటికైనా న్యాయం జరుగుతుందని బాధితులు ఆశించారు. అయితే పరిహారం కాకుండా కేవలం నష్టపోయిన ఇండ్ల రిపేర్లు చేయించేందుకు సింగరేణి ఆధ్వర్యంలో సర్వే జరుగుతుండడంపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్లుగా పరిహారం ఇప్పిస్తామంటూ చెప్పి, హామీ ఇచ్చిన అధికార పక్షం నాయకులు ఇప్పుడు స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అన్నీ సమస్యలే..

2005లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో సీఎం వైఎస్సార్​ సత్తుపల్లిలో జలగం వెంగళరావు ఓపెన్​ కాస్ట్ (జేవీఆర్​ ఓసీ)ని ప్రారంభించారు. దీని వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడడం, అనారోగ్య సమస్యలతో పాటు బొగ్గు వెలికి తీసేందుకు చేసే బ్లాస్టింగ్ ల కారణంగా ఇండ్లు దెబ్బతింటున్నాయి. శ్లాబు, గోడలకు పగుళ్లు ఏర్పడడం, పాతబడిన ఇండ్లు కూలిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. దీంతో తమ ఇండ్లకు పరిహారం ఇవ్వాలంటూ పట్టణంలోని వెంగళరావునగర్, ఎన్టీఆర్ నగర్, జలగం నగర్, విరాట్ నగర్​తో పాటు కిష్టారం బీసీ కాలనీ, ఎస్సీ కాలనీవాసులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ కాలనీలన్నింటిలో కలిపి దాదాపు 2 వేల వరకు ఇండ్లున్నాయి. ఈ కాలనీల్లో ఉండే వారంతా రోజు వారి కూలీ పనులు చేసుకునే నిరుపేదలే. ఈ బాధితులు స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో పాటు అధికారులకు కూడా తమ సమస్యను చెప్పుకున్నారు. దీనిపై ఎమ్మెల్యే కూడా సింగరేణి సీఎండీ, ఇతర అధికారులతో మాట్లాడి, పరిహారం కోసం ఆఫీసర్లను రిక్వెస్ట్ చేశారు.

రాజకీయ రంగు..

ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కోటూరి మానవతారాయ్ ఈ అంశంపై ఆమరణ దీక్ష చేపట్టారు. దెబ్బతిన్న ప్రతి ఇంటికీ రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలంటూ ఆమరణ దీక్షకు కూర్చోవడంతో వెంగళరావునగర్ బాధితులు ఆయనకు బాసటగా నిలిచారు. దీంతో సింగరేణి అధికారుల స్వరం మారింది. నష్టపరిహారం అనే మాటకు బదులుగా దెబ్బతిన్న ఇండ్ల మరమ్మతులు చేయిస్తామని మాటమార్చారు. ఆగమేఘాలపై సర్వేలు సైతం పూర్తి చేశారు. మరమ్మతులు మాకొద్దు, నష్టపరిహారమే కావాలంటూ సర్వేలను సైతం బాధితులు అడ్డుకున్నారు. ఇంతలో సింగరేణి ఆఫీసర్లు మరో ట్విస్టు ఇచ్చారు. ప్రభావిత ప్రాంతాల జాబితాలో జలగంనగర్, విరాట్ నగర్  పేర్లు లేవని చెప్పడంపై విమర్శలు వస్తున్నాయి. ఓపెన్ కాస్ట్ ప్రారంభమై 16 ఏళ్లు గడుస్తుండగా ఇప్పటివరకు దెబ్బతిన్న ఇళ్లను అనేకసార్లు ప్రజాప్రతినిధులు పరిశీలించి హామీలు ఇచ్చారే తప్ప వాటిని అమలు చేయలేదని అంటున్నారు. పరిహారం ఇవ్వకుండా మరమ్మతులు చేస్తామని చెప్పడం బాధాకరమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

నష్ట పరిహారం ఇప్పిస్తానని చెప్పిన్రు

దెబ్బతిన్న ఇళ్లకు నష్టపరిహారం ఇప్పిస్తానని చాలా సార్లు లీడర్లు చెప్పారు. కొత్తగూడెం జీఎం ఆఫీసులో డైరెక్టర్ల సమావేశానికి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తీసుకెళ్లారు. ఇప్పుడేమో సింగరేణి ఆఫీసర్లు రిపేర్లే చేస్తామని చెబుతున్నారు. ఇల్లు కట్టుకొనేందుకు అవసరమైన పరిహారం చెల్లించాలి.

- మహేంద్ర బాషా, బాధితుడు, వెంగళరావు నగర్

మరమ్మతుల కోసం సర్వే పూర్తైంది

బ్లాస్టింగ్ కారణంగా దెబ్బతిన్న ఇండ్లకు మరమ్మతులు చేయిస్తాం. ఇప్పటికే వెంగళరావు నగర్, ఎన్టీఆర్ నగర్, కిష్టారం బీసీ కాలనీ, ఎస్సీ కాలనీలో సర్వే పూర్తి చేశాం. బాధితుల ఇండ్లకు రిపేర్లు చేయిస్తాం. జలగం నగర్, విరాట్ నగర్ ప్రాంతాలు బ్లాస్టింగ్ ప్రభావిత ప్రాంత జాబితాలో లేవు.

-వెంకటాచారి, ప్రాజెక్టు ఆఫీసర్​, సత్తుపల్లి