నాగర్కర్నూల్ జిల్లా చారగొండలో ఉద్రిక్తత
వంగూరు, వెలుగు: నాగర్కర్నూల్ జిల్లా చారగొండలో హైవే బైపాస్ నిర్మాణానికి అడ్డుగా ఉన్న ఇండ్లను మంగళవారం పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేశారు. తమ ఇండ్లను కూల్చవద్దంటూ బాధితులు అడ్డుకొనే ప్రయత్నం చేయగా, పోలీసులు వారిని పక్కకు తప్పించారు.
ఇండ్లు కోల్పోతున్న వారి ప్రతిఘటన, రోదనలతో ఉద్రిక్తత నెలకొంది. జడ్చర్ల–కోదాడ హైవేపై చారగొండలో బైపాస్ నిర్మాణానికి అడ్డుగా ఉన్న 29 ఇండ్లను గుర్తించి, పరిహారం కింద రూ.12లక్షల చొప్పున ప్రకటించారు.23 ఇండ్ల యజమానులు పరిహారం తీసుకోగా, ఆరుగురు మార్కెట్ రేట్ ప్రకారం పరిహారం చెల్లిస్తేనే అంగీకరిస్తామని తెలిపారు. దీంతో మంగళవారం రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు, సిబ్బంది ఆరు ఇండ్లలో సామాన్లను బయటకు తీయించి కూల్చివేశారు. బాధితులను పోలీస్ స్టేషన్కు తరలించారు.