ఖమ్మం టౌన్, వెలుగు: త్వరలోనే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపు జరుగుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. అలాగే, మీడియా ప్రతినిధుల భద్రత కోసం చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం కృషి చేస్తానని అన్నారు. గురువారం ఖమ్మంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర మహాసభల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యాజమాన్యాల తీరు ఎలా ఉన్నా .. జర్నలిస్టులు ఉన్నత ఆలోచనలతో నిజాలు రాయాలని సూచించారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని, ప్రజలకు మేలు కలుగుతుందని అందరూ భావించారని.. గత ప్రభుత్వ విధానాలవల్ల ఆ ఆశ నెరవేరలేదన్నారు. ప్రజలకు, మీడియాకు స్వేచ్ఛ లేకుండాపోయిందని, ప్రజాస్వామ్యానికి ప్రమాదం జరిగిందన్నారు. తమ ప్రభుత్వంలో భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలగదని, నిర్మాణాత్మకమైన విమర్శలను స్వాగతిస్తామని భట్టి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అభిమతానికి అనుగుణంగా పని చేస్తుందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామన్నారు.
జర్నలిస్టులు దారి తప్పితే సమాజానికే ప్రమాదం: మంత్రి తుమ్మల
జర్నలిస్టులు దారి తప్పితే సమాజానికే ప్రమాదమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మార్నింగ్ సెషన్ లో ఆయన జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడారు. జర్నలిజం కత్తిమీద సాము లాంటిదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో సానుకూలంగా ఉన్నారని చెప్పారు. ఈ సభలో మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ప్రభుత్వ గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యం తదితరులు పాల్గొన్నారు.
కొత్త రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక..
టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర కొత్త కార్యవర్గాన్ని కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శితో పాటు ముగ్గురు ఉపాధ్యక్షులు, ముగ్గురు కార్యదర్శులు, 16 మంది ఎగ్జిక్యూటివ్ సభ్యులను ఎన్నుకున్నారు.
- అధ్యక్షుడు: కె.విరాహత్ అలీ
- ఉపాధ్యక్షులు: గాడిపల్లి మధు, ఎంఏకె ఫైసల్, బి.సంపత్‌కుమార్
- ప్రధాన కార్యదర్శి: కె.రాంనారాయణ
- కార్యదర్శులు: కె.శ్రీకాంత్‌రెడ్డి, జి.మధుగౌడ్, వి.యాదగిరి
- కోశాధికారి: ఎం.వెంకట్‌రెడ్డి
- కార్యవర్గసభ్యులు: ఎం.వేణుగోపాలరావు, పి.వేణుమాధవరావు, ఆర్.ప్రకాశ్‌రెడ్డి, ఎం.కర్ణయ్య, జి.శ్రీనివాస్‌శర్మ, పి.ప్రభాకర్‌రెడ్డి, సయ్యద్ అబ్దుల్ లతీఫ్, జె.సురేందర్‌కుమార్, ఏ.రవీందర్, ఏ.రాజేశ్, కె.రాజిరెడ్డి, సయ్యద్ గౌస్ మోహియుద్దీన్, కె.అనిల్‌కుమార్, చలసాని శ్రీనివాసరావు, కంకనాల సంతోష్ , గుడిపెల్లి శ్రీనివాస్.