ఆర్మీ దెబ్బ అదుర్స్.. మరో ముగ్గురు ఉగ్రవాదుల ఇండ్లు కూల్చివేత

ఆర్మీ  దెబ్బ అదుర్స్.. మరో ముగ్గురు ఉగ్రవాదుల ఇండ్లు కూల్చివేత

శ్రీనగర్: పహల్గాంలో అమాయక ప్రజల ప్రాణాలు పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు, వారి అనుచరులపై ఇండియన్ ఆర్మీ ఉక్కుపాదం మోపుతోంది. నరమేధం సృష్టించిన ఉగ్రమూకలను దెబ్బకు దెబ్బ కొడుతోంది. పహల్గాం ఉగ్రదాడి నిందితుల కోసం జమ్మూ కాశ్మీర్‎లో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టిన భారత సైన్యం.. తీవ్ర వాదుల నివాసాలు, వారికి సంబంధించిన స్థావరాలను గుర్తించి ఎక్కడికక్కడ నేలమట్టం చేస్తోంది. 

పహల్గాం ఉగ్రదాడితో సంబంధంమున్న ఇద్దరు ఉగ్రవాదులు ఆసిఫ్‌ షేక్‌, అదిల్ మహమ్మద్‌ ఇళ్లను శుక్రవారం (ఏప్రిల్ 25) కూల్చివేసిన భద్రతా దళాలు.. శనివారం (ఏప్రిల్ 26) మరో ముగ్గురు ముష్కరుల ఇండ్లను నేలమట్టం చేశారు. పుల్వామాలో ఎసాన్‌ ఉల్ హక్‌, షోపియాన్‌లో షబీర్‌ అహ్మద్‌ కుట్టే, కుల్గాంలో జకీర్‌ గని ఇళ్లు కూల్చివేత ఇండ్లను కూల్చివేశారు. 

లష్కరే తోయిబా కమాండర్ షాహిద్ అహ్మద్ కుట్టే గత మూడు, నాలుగు సంవత్సరాలుగా ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలలో పాల్గొని దేశ వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించాడని అధికారులు తెలిపారు. 2018లో పాకిస్తాన్‌లో ఉగ్రవాద శిక్షణ పొందిన అహ్సాన్ ఇటీవలే కాశ్మీర్ లోయలోకి తిరిగి ప్రవేశించి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు.

జమ్ము కాశ్మీర్ వ్యాప్తంగా ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ కొనసాగుతోందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. నిఘా వర్గాల సమాచారం మేరకు ఉగ్రవాదులు నక్కి ఉన్న ప్రాంతాలను చుట్టుముడుతున్నాయి భద్రతా దళాలు. ఈ క్రమంలోనే శనివారం (ఏప్రిల్ 26) కుల్గాం జిల్లాలోని కైమా ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదుల అనుచరులను అరెస్ట్ చేశారు. పలు ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 

కాగా, ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం ఏరియా బైసారన్ మైదాన ప్రాంతంలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. ఉగ్రమూకలు కురిపించిన తుటాల వర్షానికి 28 మంది పర్యాటకులు బలయ్యారు. పహల్గాంలో రక్తపుటేరులు పారించిన ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి భారత సైన్యం ఆపరేషన్ చేపట్టింది.