వెయ్యి కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని సర్కారు ప్లాన్
3,700 ఫ్లాట్లలో మిగిలినవి 2,200
దరఖాస్తుదారులకు మరో చాన్స్ ఇచ్చిన ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు : రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు పూర్తి స్థాయిలో అమ్ముడుపోకపోవడం, హడ్కో లోన్ రూ.2 వేల కోట్లు రాకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై హౌసింగ్, హెచ్ఎండీఏ ఫోకస్ పెట్టాయి. 10 జిల్లాల్లో 19 ఓపెన్ ఫ్లాట్లు, ప్లాట్లు, బిల్డింగ్ లను గుర్తించి, వచ్చే నెల 14న వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా రూ.1000 కోట్ల రెవెన్యూ వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఈ వేలం ప్రక్రియకు హెచ్ఎండీఏ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. వేలంలో పాల్గొనే వాళ్లు అప్లికేషన్ ఫీజు రూ.1180 ( నాన్ రిఫండబుల్ ) చెల్లించాలని పేర్కొంది. ఒక్కో ఫ్లాట్ కు కట్టాల్సిన డిపాజిట్ ను కూడా నోటిఫికేషన్ లో వెల్లడించింది.
జంట నగరాల పరిధిలో హెచ్ఎండీఏ, టీఎస్ ఐఐసీ ఆధ్వర్యంలో జరిగే వేలానికి సంబంధించి ఫ్రీబిడ్ మీటింగ్ లను వచ్చే నెల 3 నుంచి 10 వరకు నిర్వహిస్తామని తెలిపింది. రాజీవ్ స్వగృహ అపార్ట్ మెంట్ల అమ్మకం ద్వారా రూ.800 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఈ ఫ్లాట్లు మొత్తం 3,700 ఉండగా 1500 ఫ్లాట్లనే పబ్లిక్ కొన్నారు. వాటిని పూర్తి స్థాయిలో అమ్మేందుకు అప్లికేషన్లు పెట్టుకున్న వారికి ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది.
కాంట్రాక్టర్లకు 800 కోట్ల బకాయిలు
రాష్ర్టంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.800 కోట్ల బిల్లులు ఏడాది కాలంగా పెండింగ్ లో ఉన్నాయి. వాటిని నిధుల కొరతతో చెల్లించలేకపోతున్నారు. దీంతో కాంట్రాక్టర్లు చాలా జిల్లాల్లో డబుల్ ఇండ్ల పనులు నిలిపేశారు. హడ్కో లోన్ వస్తే బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం భావించింది. లోన్ రాకపోవడంతో బిల్లులు పెరుగుతున్నాయి. కొంత మంది కాంట్రాక్టర్లు మంత్రులతో ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ ఉన్నతాధికారులకు చెప్పించి బిల్లులు క్లియర్ చేయించుకున్నారని హౌసింగ్ అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
బిల్లులు క్లియర్ చేయడానికి ఆస్తుల అమ్మకం!
సొంత జాగా ఉన్న వారికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం చేస్తామని 2018 ఎన్నికల నుంచి ప్రభుత్వం చెబుతోంది. కరోనా, నిధుల కొరతతో ఈ స్కీమ్ అమలును ప్రభుత్వం ఆపింది. ఈ స్కీమ్ ను అమలు చేస్తామంటూ ఈ ఏడాది బడ్జెట్ లో రూ.12 వేల కోట్లు కేటాయించింది. ఇటీవల పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం నిర్వహించిన మీటింగ్ లో నియోజకవర్గానికి వెయ్యి ఇండ్లకు ఈ డిసెంబర్ లోగా సహాయం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ స్కీమ్ అమలుకు ప్రతి నెలా రూ.250 కోట్లు విడుదల చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే నిధులు కొరత వల్ల ఇంతవరకు హౌసింగ్, మున్సిపల్ అధికారులు ఇచ్చిన ప్రతిపాదనలను సీఎం సమీక్షించలేదని, హడ్కో లోన్ వచ్చుంటే ఈ స్కీమ్ ను ప్రారంభించే వాళ్లమని అధికారులు చెబుతున్నారు. ఈ స్కీమ్ అమలుకు, డబుల్ బెడ్రూం బిల్లులు క్లియర్ చేయడానికి జిల్లాల్లో ఫ్లాట్లు, ఓపెన్ ల్యాండ్ లు అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
హడ్కో లోన్ రాకపోవడంతో వేలం
రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్‌కు హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ) నుంచి రూ.2 వేల కోట్ల అప్పు రావాల్సి ఉంది. ఈ ఏడాది జూన్ లో అధికారులు లోన్ కోసం హడ్కోతో సంప్రదింపులు జరిపారు. కనీసం రూ.వెయి కోట్ల లోన్ ఇవ్వాలని కోరారు. నాలుగు నెలలు గడుస్తున్నా ఇంత వరకు లోన్ సాంక్షన్ కాలేదు. రుణం కోసం హౌసింగ్ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ ఢిల్లీ వెళ్లి హడ్కో డైరెక్టర్లను కలిశారు. గతంలో తీసుకున్న హడ్కో లోన్లపై అసలు, వడ్డీ కరెక్ట్ గా కడుతున్న రికార్డు తెలంగాణ కు ఉందని గతంలో హడ్కో తెలిపింది. కాగ్ విడుదల చేసిన రిపోర్టు ప్రకారం... తెలంగాణకు 4.13 శాతం నికర అప్పులు ఉన్నాయంటూ హడ్కో రుణాన్ని కేంద్ర ప్రభుత్వం ఆపిన విషయం విదితమే. కార్పొరేషన్లు తీసుకున్న రుణాలను ప్రభుత్వ లోన్లుగా పరిగణిస్తామని ఆర్ బీఐ, కేంద్రం ప్రకటించగా ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. దీంతో లోన్ కు బ్రేక్ పడింది.