
- పీఎం ఆవాస్‌లో ఇండ్ల మంజూరుపై కీలక భేటీ
- 9 లక్షల ఇండ్లు ఇవ్వాలని ఇప్పటికే రాష్ట్రం ప్రపోజల్స్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు పీఎం ఆవాస్ యోజన స్కీమ్‌లో ఎక్కువ ఇండ్లు కేటాయించాలని కేంద్ర అర్బన్ హౌసింగ్ అధికారులను రాష్ట్రం కోరనుంది. ఇందులో భాగంగా బుధవారం హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్, సీఈ, ఎస్ఈల బృందం ఢిల్లీ వెళ్లనుంది. బుధవారం గ్రామీణ, గురువారం పట్టణ ఇండ్ల కేటాయింపుపై కేంద్ర హౌసింగ్ అర్బన్ జాయింట్ సెక్రటరీ, పీఎం ఆవాస్ యోజన స్కీమ్ డైరెక్టర్ కులదీప్ నారాయణ్‌తో అధికారులు భేటీ కానున్నారు.
పీఎం ఆవాస్ యోజన స్కీమ్‌లో భాగంగా అర్బన్‌లో 6.5 లక్షల ఇండ్లు, రూరల్‌లో 2.5 లక్షల ఇండ్లు కేటాయించాలని ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి కోరింది. అర్బన్‌లో ఒక్క ఇంటి నిర్మాణానికి రూ.1.5 లక్షలు, రూరల్‌లో ఒక్క ఇంటి నిర్మాణానికి రూ.72 వేలు పీఎం ఆవాస్ కింద కేంద్రం మంజూరు చేస్తున్నది.
ఇటీవల కేంద్ర హౌసింగ్ మంత్రి మనోహార్ లాల్ ఖట్టర్ హైదరాబాద్ వచ్చిన సమయంలో సీఎం, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిసి ఎక్కువ ఇండ్లు కేటాయించాలని కోరారు. పీఎం ఆవాస్ స్కీమ్ లో ఉన్న రూల్స్ కు అనుగుణంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని, కేంద్ర స్కీమ్‌ల నుంచి వచ్చే నిధులను వదులుకోబోమని చెబుతున్నారు. అదే విధంగా ఇందిరమ్మ ఇంటిపై పీఎం ఆవాస్ యోజన లోగో కూడా ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది.