బీఆర్ఎస్ ప్రభుత్వం 8 ఏండ్లలో కట్టింది.. లక్షన్నర ఇండ్లే

బీఆర్ఎస్ ప్రభుత్వం 8 ఏండ్లలో కట్టింది.. లక్షన్నర ఇండ్లే
  • డబుల్ బెడ్ రూమ్ స్కీమ్​పై ప్రభుత్వానికి హౌసింగ్ డిపార్ట్ మెంట్ స్టేటస్ రిపోర్టు 
  • మొత్తం 2.73 లక్షల ఇండ్లు మంజూరు  
  • 40 వేల నిర్మాణాలకు టెండర్లే పిల్వలేదు  
  • పూర్తయిన వాటిలో 30 వేల ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయలేదు 

హైదరాబాద్, వెలుగు: గత ప్రభుత్వం 8 ఏండ్లలో 2.73 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేసి, 1.60 లక్షల ఇండ్లు మాత్రమే పూర్తి చేసింది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకం 2015లో అప్పటి ప్రభుత్వం ప్రారంభించగా, 2024 వరకు జరిగిన పనులపై ప్రభుత్వానికి హౌసింగ్ డిపార్ట్ మెంట్ స్టేటస్ రిపోర్టు అందజేసింది. ఈ రిపోర్టును చూసి సీఎం రేవంత్ రెడ్డి, హౌసింగ్ మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. 

మంజూరు చేసిన 2.73 లక్షల ఇండ్లలో దాదాపు 40 వేల ఇండ్లకు గత ప్రభుత్వం టెండర్లే పిలవలేదని హౌసింగ్ డిపార్ట్ మెంట్ రిపోర్టులో పేర్కొంది. 1.60 లక్షల ఇండ్లు పూర్తి చేయగా, దాదాపు 35 వేల ఇండ్ల నిర్మాణం చివరి దశకు చేరుకుందని తెలిపింది. ఇంకో 35 వేల ఇండ్ల  నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పింది. కాగా, పూర్తయిన ఇండ్లకు సైతం గత ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపిక చేయలేదు. దాదాపు 30 వేల ఇండ్లకు లబ్ధిదారుల ఎంపిక జరగలేదు. దీంతో పూర్తయిన ఇండ్లలోని తలుపులు, కిటికీలు, ఇతరత్రా వస్తువులు చోరీకి గురయ్యాయని.. ఆ ఇండ్లు కూడా కొంత డ్యామేజ్ అయ్యాయని అధికారులు చెబుతున్నారు. 

8 జిల్లాల్లో 30 శాతం లోపే పూర్తి.. 

8 జిల్లాల్లో మంజూరైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో 30 శాతం లోపే పూర్తయినట్టు రిపోర్టులో హౌసింగ్ డిపార్ట్ మెంట్ పేర్కొంది. నారాయణపేట జిల్లాలో 900 ఇండ్లను మంజూరు చేయగా, ఇంత వరకు ఒక్కటి కూడా పూర్తి కాలేదు. 44 ఇండ్ల నిర్మాణం చివరి దశకు చేరుకున్నది. ఆసిఫాబాద్ జిల్లాలో కేవలం 8 ఇండ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇక వికారాబాద్, నిజామాబాద్, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో 26 శాతం ఇండ్లు పూర్తయ్యాయి. 

పెండింగ్ ఇండ్ల పూర్తికి 1,800 కోట్లు అవసరం.. 

మంజూరు చేసిన 2.73 లక్షల ఇండ్లకు మొత్తం రూ.12 వేల కోట్లు అవసరమవుతాయని గత ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో 2.30 లక్షల ఇండ్ల నిర్మాణం ప్రారంభించగా, ఇప్పటి వరకు రూ.9 వేల కోట్ల ఖర్చు చేశారు. వీటిలో లక్షా 60 వేల ఇండ్లు మాత్రమే పూర్తయ్యాయి. మిగతా ఇండ్లను పూర్తి చేయాలంటే ఇంకా రూ.1,833 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. పీఎం ఆవాస్ యోజన స్కీమ్ కింద కేంద్రం నుంచి రూ. 2,178 కోట్లు రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.1,605 కోట్లు వచ్చాయి. ఇంకా కేంద్రం నుంచి రూ.573 కోట్లు రావాల్సి ఉందని అధికారులు తమ రిపోర్ట్ లో ప్రస్తావించారు.