ఇందిరమ్మ ఇళ్ల సర్వే పారదర్శకంగా చేపట్టాలి : వీపీ గౌతమ్

ఇందిరమ్మ ఇళ్ల సర్వే పారదర్శకంగా చేపట్టాలి : వీపీ గౌతమ్
  • హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్

సంగారెడ్డి టౌన్, వెలుగు: ఇందిరమ్మ ఇళ్ల సర్వే పారదర్శకంగా చేపట్టాలని  రాష్ట్ర హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్, కలెక్టర్ క్రాంతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సంగారెడ్డిలోని దోబీగల్లి, శివాజీ నగర్ కాలనీలలో పర్యటించి సర్వే తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిజమైన లబ్ధిదారులను గుర్తించడమే ఈ సర్వే ఉద్దేశం అన్నారు. దరఖాస్తుదారుల నివాస ప్రాంతాలను సందర్శించి వారి ఆర్థిక పరిస్థితి నేరుగా అడిగి తెలుసుకున్నారు.

సర్వేయర్లు ప్రభుత్వ నియమాలను పాటించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఆన్​లైన్​లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఏమైనా సందేహాలు ఉంటే మున్సిపాలిటీ పరిధిలో వార్డు అధికారిని, గ్రామాల్లో జీపీ సెక్రటరీని సంప్రదించవచ్చన్నారు. సర్వే ప్రక్రియలో అడిషనల్​కలెక్టర్ చంద్రశేఖర్, ట్రైనీ కలెక్టర్ మనోజ్, గృహ నిర్మాణ సంస్థ జిల్లా మేనేజర్ పుష్పలత, తహసీల్దార్ దేవదాస్, గృహ నిర్మాణ సంస్థ డీఈలు పాల్గొన్నారు.

 గ్రూప్​2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

ఈ నెల 15,16న జరిగే గ్రూప్​2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ క్రాంతి అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 15,218 అభ్యర్థులు టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు రాస్తున్నారని ఇందుకోసం 41 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణ సజావుగా జరగాలని సూచించారు. పరీక్ష నిర్వహణలో పోలీస్ రెవెన్యూ, విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేసి సహకరించాలన్నారు.

 డబుల్​ బెడ్​రూం ఇళ్లకు అన్ని వసతులు కల్పిస్తాం

రామచంద్రాపురం: ప్రభుత్వం పేదల కోసం నిర్మించిన డబుల్​ బెడ్​రూం ఇళ్లకు అన్ని రకాల వసతులు కల్పిస్తామని తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ ఎండీ వీపీ గౌతమ్​ అన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్​ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్​లో డబుల్​ బెడ్​రూం సముదాయాలను ఆయన పరిశీలించారు. అక్కడ ఇళ్లల్లో నివసిస్తున్న లబ్ధిదారులతో మాట్లాడారు. తాగునీరు, ఇతర సమస్యలను అక్కడి యజమానులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా గౌతమ్​ మాట్లాడుతూ లబ్ధిదారులు ఏ సమస్యలున్నా స్థానిక మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. త్వరలోనే మరి కొంతమంది లబ్ధిదారులకు ఇళ్ల అలాట్​మెంట్ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్​ కమిషనర్​ సంగారెడ్డి, డీఈఈ సత్యనారాయణ, ఆర్ వో వెంకటరామయ్య, మేనేజర్​అఖిల్, నవోద్​రెడ్డి, అశోక్​, పవన్, హౌసింగ్ బోర్డు అధికారులు పాల్గొన్నారు.