
- త్వరలో సపరేట్ చేస్తూ ఉత్తర్వులు
- ఇతర శాఖల్లో ఉన్న హౌసింగ్ అధికారులు మాతృశాఖకు బదిలీ
- హౌసింగ్ ను ఆర్ అండ్ బీలో విలీనం చేసిన గత సర్కారు
- లీగల్ ఇబ్బందులతో పూర్తి కాని విలీన పక్రియ
హైదరాబాద్, వెలుగు: రోడ్లు భవనాల శాఖలో ఉన్న హౌసింగ్ శాఖను సపరేట్గా చేసేందుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫైల్ జనరల్ అడ్మినిస్ర్టేటివ్ డిపార్ట్ మెంట్ ( జీఏడీ ) నుంచి సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు చేరిందని తెలుస్తోంది. నేడో రేపో దీనిని ఆమోదిస్తారని, ఉత్తర్వులు రిలీజ్చేస్తారని అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఈ పక్రియకు కేబినెట్ ఆమోదం కూడా అవసరం లేదని సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఆర్ అండ్ బీలో ఉన్న హౌసింగ్ డిపార్ట్ మెంట్‌ను సపరేట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా హౌసింగ్‌కు చెందిన అధికారులు, ఉద్యోగులు, జీహెచ్ ఎంసీ, వాటర్ బోర్డు, పంచాయతీ రాజ్, బేవరేజెస్ కార్పోరేషన్‌తో పాటు మొత్తం 13 డిపార్ట్ మెంట్లు 15 కార్పోరేషన్లలో పనిచేస్తున్న 242 అధికారులు మాతృ శాఖకు హౌసింగ్‌కు బదిలీ చేశారు. వీరిని అన్ని జిల్లాల్లో ప్రాజెక్టు డైరెక్టర్లు, నియోజకవర్గాలు, మండలాల్లో ఇంజనీర్లుగా, వర్క్ ఇన్స్ పెక్టర్లుగా ప్రభుత్వం నియమించింది.
ఆర్ అండ్ బీలో విలీనం
ఉమ్మడి రాష్ర్టంలో ఘన చరిత్ర ఉన్న హౌసింగ్ డిపార్ట్ మెంట్‌ను గత ప్రభుత్వంలో విలీనం చేసేందుకు 2020లో స్టార్ట్ చేయగా 2023 జనవరిలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. హౌసింగ్ డిపార్ట్ మెంట్‌ను సీఎం కేసీఆర్ ఆర్ అండ్ బీలో కలిపారు. శాఖలోని గృహనిర్మాణ సంస్థ, రాజీవ్ స్వగృహ, దక్కన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమాలు లేని నేపథ్యంలో సర్కార్ ఈ నిర్ణయం తీసుకొంది. శాఖలో మిగిలిన అంశాలు, ఉద్యోగులు, సిబ్బంది, ఆస్తులు, అప్పులను ఆర్ అండ్ బీ శాఖకు బదిలీ చేశారు.
అందుకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవాలని గృహనిర్మాణ, ఆర్ అండ్ బీ, సాధారణ పరిపాలనాశాఖలను గత ప్రభుత్వంలో సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. లక్షల మంది పేద, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కోట్ల మంది ప్రజలకు వీకర్ సెక్షన్ హౌసింగ్ స్కీమ్ కింద, హడ్కో లోన్లతో ఇందిరమ్మ ఇళ్లను కాలనీలుగా నిర్మించారు. ఇందుకు కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాల తో పాటు అప్పుల నుంచి వేల కోట్ల ను లోన్లను తీసుకొని ఈ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. శాఖకు అనుబంధంగా ఉన్న హౌసింగ్ కార్పోరేషన్, హౌసింగ్ బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులను ఇతర శాఖలు, కార్పోరేషన్లలో డిప్యూటేషన్ గా పంపించింది.
లీగల్ ఇబ్బందులతో పూర్తి కానీ విలీనం
ఆర్ అండ్ బీలో హౌసింగ్‌ను గత ప్రభుత్వం విలీనం చేసినా లీగల్ ఇబ్బందులతో ఈ పక్రియ ముందుకు సాగలేదు. హౌసింగ్ బోర్డు 9, 10 వ షెడ్యూల్లో ఉండటం, ఉమ్మడి రాష్ర్ట విభజన సమయంలో కార్పోరేషన్ల ఆస్తులు, అప్పులు విభజనకు రిటైర్డ్ ఐఏఎస్ షీలాబేడి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసింది. మొత్తం 90కి పైగా కార్పోరేషన్ల విభజించాల్సి ఉండగా చాలా కార్పోరేషన్ల ఆస్తుల అప్పులు విషయంలో ఏపీ ప్రభుత్వం పేచీ పెట్టడం, కోర్టుల్లో కేసులు ఉండటంతో 65 కార్పోరేషన్ల విభజన మాత్రమే పూర్తి కాగా మిగతావి కాలేదు.
విభజన కాని కార్పోరేషన్లలో హౌసింగ్ కార్పోరేషన్ కూడా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో విలీన పక్రియ పూర్తి కాలేదు. హౌసింగ్ బోర్డుకు రాష్ర్ట వ్యాప్తంగా రూ. 50 వేల కోట్లు ఆస్తులు ఉండటం, ఈబోర్డును రద్దు చేయాలంటే అసెంబ్లీలో బిల్ చేయాల్సి ఉండటం, ఇదే జరిగితే కోర్టుకు వెళితే లీగల్ ఇబ్బందులు ఎదురవుతాయని అప్పటి ప్రభుత్వం ముందుకు వెళ్లలేదు.
ఇందిరమ్మ స్కీమ్ స్పీడప్
రాష్ర్టంలో నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను సాంక్షన్ చేసింది. లబ్దిదారుల ఎంపిక పూర్తి కాగా ఈ ఏడాది జనవరి 26న సుమారు 71వేల మందికి లబ్దిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలను అందచేసింది. వీటిలో చాలా మంది లబ్దిదారులు బేస్ మెంట్ నిర్మాణంలో నిమగ్నమయ్యారు.