ఇజ్రాయెల్​పై హౌతీ మిలిటెంట్ల దాడి

ఇజ్రాయెల్​పై హౌతీ మిలిటెంట్ల దాడి

జెరూసలెం: ఇజ్రాయెల్​పై హౌతీ మిలిటెంట్లు మరోసారి దాడికి పాల్పడ్డారు. యెమెన్​ భూభాగం నుంచి క్షిపణిని ప్రయోగించగా.. సెంట్రల్ ​ఇజ్రాయెల్​లోని ఓ ప్రదేశంలోకి అది ఉత్తరం వైపునుంచి దూసుకొచ్చింది. దీంతో యుద్ధం మొదలైన ఏడాదిలో తొలిసారి ఇజ్రాయెల్​లోని ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్​లో ఎయిర్​రైడ్​ సిగ్నల్స్​ మార్మోగాయి.   ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకునేందుకు పరుగులు పెట్టారు. కాగా, కొద్దిసేపటికే విమాన సేవలను పునరుద్ధరించినట్టు ఎయిర్​పోర్ట్​ అధికారులు తెలిపారు. 

క్షిపణి దాడితో సెంట్రల్​ ఇజ్రాయెల్​లోని గ్రామీణ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. ఇంటర్ ​సెప్టార్ల నుంచి భారీ శబ్దాలు వచ్చాయని ఇజ్రాయెల్​ మిలిటరీ తెలిపింది. క్షిపణిని సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, ఈ దాడిలో ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొంది. దీనికి సైనికపరంగా బదులిస్తామని ఇజ్రాయెల్​ హెచ్చరించింది. ఆదివారం జరిగిన కేబినెట్ మీటింగ్​లో ఇజ్రాయెల్​ ప్రధాని బెంజమిన్ ​నెతన్యాహు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఇజ్రాయెల్​కు హాని కలిగిస్తే  ఏంజరుగుతుందో ఇప్పటికే హౌతీలకు అర్థమై ఉండాలని అన్నారు. ఒకవేళ ఏంజరుగుతుందో తెలుసుకోవాలంటే యెమెన్​లోని హౌదైరా​​పోర్ట్​ను సందర్శించాలన్నారు. కాగా, టెల్​అవీవ్​లో భాగమైన జాఫాలో సైనిక లక్ష్యంగా బాలిస్టిక్​ క్షిపణి ప్రయోగించినట్టు హౌతీ మిలిటెంట్​ ప్రతినిధి జనరల్​ యాహ్యా సారీ ప్రకటించారు.