ఎర్ర సముద్రంలో టెన్షన్.. కార్గో షిప్​లపై హౌతీ రెబెల్స్​ దాడులు

ఎర్ర సముద్రంలో టెన్షన్.. కార్గో షిప్​లపై హౌతీ రెబెల్స్​ దాడులు
  • ఎర్ర సముద్రంలో టెన్షన్ 
  • కార్గో షిప్​లపై హౌతీ రెబెల్స్​ వరుస దాడులు
  • శనివారం అరేబియా సముద్రం లో ఎంవీ కెమ్ ప్లూటోపై దాడి 
  • గంటల వ్యవధిలో రెడ్ సీలో ఎంవీ సాయిబాబాపై అటాక్ 
  • ఆ డ్రోన్​లు ఇరాన్, యెమెన్​ల నుంచే వచ్చాయన్న అమెరికా  
  • హమాస్​పై యుద్ధం నేపథ్యంలోనే రెచ్చిపోతున్న హౌతీ రెబెల్స్ 
  • ఇజ్రాయెల్​తో లింకు ఉన్న నౌకలపై వరుస దాడులు

న్యూఢిల్లీ: ఎర్ర సముద్రం, అరేబియా సముద్రంలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న వరుస డ్రోన్ దాడులు ఉద్రిక్తత రేపుతున్నాయి. హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ రెబెల్స్ వాణిజ్య నౌకలపై వరుస దాడులకు పాల్పడుతున్నారు. హమాస్ కు మద్దతుగా.. ఇజ్రాయెల్ తో సంబంధం ఉన్న షిప్ లను టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తున్నారు. ఇరాన్ సపోర్ట్ తోనే హౌతీ రెబెల్స్ రెచ్చిపోతున్నారని అమెరికా ఆరోపించింది. 

సౌదీ అరేబియా నుంచి న్యూ మంగళూరు పోర్టుకు ఆయిల్​ను తీసుకువస్తున్న ఎంవీ కెమ్ ప్లూటో షిప్​పై శనివారం ఉదయం 10 గంటలకు అరేబియా సముద్రంలో డ్రోన్ దాడి జరిగింది. ఆ తర్వాత రాత్రి 10 గంటలకు గల్ఫ్ ప్రాంతంలోని ఎర్ర సముద్రం గుండా ఇండియాకు వస్తున్న ఎంవీ సాయిబాబా షిప్ పైనా డ్రోన్ అటాక్ చోటుచేసుకోవడం ఉద్రిక్తతను మరింత పెంచింది. ఈ రెండు షిప్పుల్లోనూ సిబ్బంది అంతా ఇండియన్లే ఉండగా.. వారికి ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. 

ఎర్రసముద్రంలో రెండు షిప్పులపై అటాక్ 

గాబన్ జెండాతో కూడిన కమర్షియల్ ఆయిల్ ట్యాంకర్ ఎంవీ సాయిబాబా షిప్​లో 25 మంది భారతీయులు సిబ్బందిగా ఉన్నారు. ఈ నౌక రెడ్ సీ గుండా ఇండియాకు వస్తుండగా యెమెన్ నుంచి హౌతీ రెబెల్స్ డ్రోన్ అటాక్ చేశారు. ఈ దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అమెరికా మిలిటరీ, ఇండియన్ నేవీ అధికారులు ఆదివారం వెల్లడించారు. ఎంవీ సాయిబాబా షిప్ ఇండియన్ ఫ్లాగ్​తో ప్రయాణిస్తోందని తొలుత యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్ కామ్) వెల్లడించింది. అయితే, ఇది ఇండియన్ షిప్ కాదని మన నేవీ ఆదివారం ప్రకటించింది. 

ఎర్రసముద్రంలో నార్వే ఫ్లాగ్​తో కూడిన ఎంవీ బ్లామనెన్ అనే మరో ఆయిల్ ట్యాంకర్ షిప్పుపైనా డ్రోన్ అటాక్ జరిగిందని, కానీ ఆ దాడి నుంచి షిప్ తృటిలో తప్పించుకుందని సెంట్ కామ్ వెల్లడించింది. ఎంవీ సాయిబాబా, ఎంవీ బ్లామనెన్ షిప్పుల నుంచి వచ్చిన డిస్ట్రెస్ కాల్స్ ను అక్కడికి సమీపంలో ఉన్న యూఎస్ వార్ షిప్ లాబూన్ రిసీవ్ చేసుకున్నట్లు తెలిపింది. ఈ షిప్​లపై దాడికి కొన్ని గంటల ముందుగా యెమెన్ నుంచి హౌతీ రెబెల్స్ ప్రయోగించిన నాలుగు డ్రోన్​లను యూఎస్ వార్ షిప్ లాబూన్ కూల్చేసినట్లు సెంట్ కామ్ వెల్లడించింది. 

ఇయ్యాల ముంబైకి ఎంవీ కెమ్ ప్లూటో 

ఎంవీ కెమ్ ప్లూటోపై 20 మంది ఇండియన్లు సిబ్బందిగా ఉన్నారు. డ్రోన్ దాడితో షిప్​పై మంటలు చెలరేగగా, వెంటనే ఆర్పేశారు. అటాక్ సమాచారం అందిన వెంటనే ఇండియన్ నేవీ యుద్ధనౌక ఐఎన్ఎస్ మార్ముగావ్, ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ఐసీజీ విక్రమ్ అక్కడికి చేరుకున్నాయి. లైబీరియన్ ఫ్లాగ్​తో కూడిన ఈ షిప్ సౌదీ అరేబియాలోని అల్ జుబైల్ పోర్టు నుంచి న్యూ మంగళూరు పోర్టుకు ఆయిల్​ను తీసుకువస్తోంది. ఇది సోమవారం (ఈ నెల 25) ముంబై తీరానికి చేరుకోనుంది. జపాన్ కు చెందిన ఈ షిప్​పై నెదర్లాండ్స్ నిర్వహిస్తున్న కెమికల్ ట్యాంకర్ ఉన్నట్లు అమెరికా రక్షణ శాఖ తెలిపింది.

దీనిపై అటాక్ చేసిన డ్రోన్ ఇరాన్ నుంచి వచ్చినట్లు ప్రకటించింది. 2021 నుంచి వాణిజ్య నౌకలపై ఇరాన్ నుంచి దాడి జరగడం ఇది 7వ సారి అని వెల్లడించింది. శనివారం జరిగిన దాడులతో అక్టోబర్ 17వ తేదీ నుంచి హౌతీ రెబెల్స్ వాణిజ్య నౌకలపై చేసిన దాడులు 15కు చేరాయని తెలిపింది. అయితే, ఎంవీ కెమ్ ప్లూటోపై దాడి చేసిన డ్రోన్ ఇరాన్ నుంచి వచ్చిందన్న అమెరికా ఆరోపణలను ఇరాన్ డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ అలీ బఘేరీ ఖండించారు. హౌతీ రెబెల్స్​కు తాము సాయం చేయడంలేదని, వారు సొంతంగానే ఈ దాడులు చేస్తున్నారని చెప్పారు.

వందలాది షిప్పులు.. ఆఫ్రికా చుట్టూ తిరిగొస్తున్నయ్ 

హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో యూరప్ నుంచి ఆసియాకు రాకపోకలు సాగించే వాణిజ్య నౌకలపై ఇరాన్ సపోర్ట్ ఉన్న హౌతీ రెబెల్స్ డ్రోన్, మిసైల్ అటాక్స్ చేస్తుండటంతో వందలాది కార్గో షిప్పులను దారి మళ్లిస్తున్నారు. ప్రస్తుతం యూరప్ నుంచి ఇండియా సహా ఆసియా దేశాలకు వెళ్లే షిప్పులకు ఎర్రసముద్రం ద్వారానే షార్ట్ కట్ రూట్ ఉన్నది. యూరప్ నుంచి మధ్యధరా సముద్రం గుండా ఈజిప్టులోని సూయజ్ కెనాల్​ను దాటి.. గల్ఫ్​లోని ఎర్ర సముద్రం గుండా అరేబియా సముద్రం, ఇండియన్ ఓషియన్ మీదుగా ఆసియాకు షిప్పులు వెళ్తున్నాయి. 

కానీ ఎర్రసముద్రం ద్వారా వెళ్లే షిప్పులపై యెమెన్ నుంచి.. అరేబియా సముద్రం ద్వారా వెళ్లే షిప్పులపై ఇరాన్ నుంచి హౌతీ రెబెల్స్ డ్రోన్, మిసైల్ దాడులు చేస్తున్నారు. హౌతీలకు ఇరాన్ పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందజేస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తర్వాత హమాస్ మిలిటెంట్లకు మద్దతుగా హౌతీలు దాడులు పెంచారు. దీంతో అనేక షిప్పింగ్ కంపెనీలు తమ కార్గో షిప్పులను యూరప్ నుంచి ఆఫ్రికా చుట్టూ తిరిగి ఇండియన్ ఓషన్ మీదుగా ఇండియాకు, ఇతర ఆసియా దేశాలకు పంపుతున్నాయి. దీంతో సరుకు రవాణాకు సమయం, ఖర్చు భారీగా పెరగనున్నాయి.

 ఫలితంగా ఆసియా దేశాల్లో చమురు ధరలు కూడా భారీగా పెరిగే ప్రమాదం నెలకొంది. ఆఫ్రికా చుట్టూ తిరిగి రావడం వల్ల కార్గో ధరలు రెట్టింపు కానున్నాయి. ఉదాహరణకు సూయజ్ కెనాల్ రూట్​లో ఒక టీఈయూ(20 అడుగుల కంటైనర్) సరుకుల రవాణాకు రూ. 83 వేలు అవుతుందనుకుంటే.. ఆఫ్రికా చుట్టూ ఉన్న రూట్లో అయితే రూ. 1.66 లక్షలకుపైనే ఖర్చు కానుంది.