యెమెన్‌‌ జైలుపై అమెరికా ఎయిర్‌‌స్ట్రైక్‌‌.. 68 మంది ఆఫ్రికన్ వలసదారులు మృతి

యెమెన్‌‌ జైలుపై అమెరికా ఎయిర్‌‌స్ట్రైక్‌‌.. 68 మంది ఆఫ్రికన్ వలసదారులు మృతి
  • మరో 47 మందికి గాయాలు: హౌతీలు

సనా: యెమెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సాదా గవర్నరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న వలసదారులను ఉంచే జైలుపై అమెరికా వైమానిక దాడి జరిపిందని హౌతీలు సోమవారం వెల్లడించారు. ఈ ఘటనలో 68 మంది మరణించారని.. మరో 47 మంది గాయపడ్డారని తెలిపారు. దాడికి గురైన జైలులో దాదాపు115 మంది ఎథియోపియా, ఆఫ్రికన్ వలసదారులు ఉన్నారని వివరించారు. అమెరికా జరిపిన ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్ట్రైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కారణంగా డిటెన్షన్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తిగా ధ్వంసం అయిందని..శిథిలాల కింద కొందరు చిక్కుకుపోయారని చెప్పారు. 

మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ కేంద్రం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐవోఎమ్), రెడ్ క్రాస్ పర్యవేక్షణలో ఉందని హౌతీలు పేర్కొన్నారు.దానిపై అమెరికా జరిపిన తాజా దాడిని “ఘోరమైన యుద్ధ నేరం” అని హౌతీలు అభివర్ణించారు. 

మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు, గాయపడినవారిని ఆస్పత్రులకు తరలిస్తున్నట్లు  అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ దాడిపై అమెరికా ఇంకా స్పందించలేదు. అటాక్ కు సంబంధించిన వార్తలు వెలువడటానికి ముందే.. తమ వైమానిక దాడుల మిషన్ 'ఆపరేషన్ రఫ్ రైడర్' గురించి ఎటువంటి సమాచారాన్ని పంచుకోబోమని యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ (సెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కామ్) -ఓ ప్రకటన విడుదల చేసింది. 

సముద్ర మార్గాలను హౌతీ తిరుగుబాటుదారులు అడ్డుకున్నన్ని రోజులు..వారిపై దాడులు చేస్తామని స్పష్టం చేసింది. 'ఆపరేషన్ రఫ్ రైడర్' ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా అమెరికా దళాలు.. 800కి పైగా హౌతీ స్థావరాలపై దాడి చేశాయని సెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కామ్ పేర్కొంది.