టెల్ అవీవ్: యెమెన్ సమీపంలోని ఎర్ర సముద్ర గర్భంలో ఇంటర్ నెట్ కేబుల్స్‌పై టెర్రరిస్టులు దాడి చేశారు. మొత్తం నాలుగు కేబుల్స్ ఈ అటాక్ లో ధ్వంసం అయ్యాయి. డ్యామేజ్ అయిన వాటిలో ఏఏఈ1, సీకామ్, యూరోప్–ఇండియా గేట్ వే (ఈఐజీ), టీజీఎన్ సిస్టమ్స్ కంపెనీలకు చెందిన కేబుల్స్ ఉన్నాయని ఇజ్రాయెల్ కు చెందిన జెరూసలెం పోస్ట్ అండ్ గ్లోబ్స్ పబ్లికేషన్స్ తెలిపింది.
యెమెన్, ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ టెర్రరిస్టులే ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని ఆ పబ్లికేషన్స్ పేర్కొంది. డ్యామేజ్ అయిన కేబుల్స్ ను రిపేర్ చేయడానికి ఎనిమిది వారాల సమయం పడుతుందని వెల్లడించింది. ధ్వంసమైన కేబుల్స్ ఆసియా, యూరోప్, ఆఫ్రికా దేశాల సంస్థలకు చెందినవని తెలిపింది. ఈ అటాక్ తో ఆఫ్రికా దేశం జిబౌతీలోని ఇంటర్ నెట్ సేవలు స్తంభించిపోయాని ఇంటర్ నెట్ మానిటరింగ్ సంస్థ నెట్ బ్లాక్స్ వెల్లడించింది.
జిబౌతీ డేటా సెంటర్ లో నెట్ వర్క్ కనెక్టివిటీలో ఇంటర్ నెట్ సేవలు ఆగిపోయాయి. దేశంలోని ల్యాండింగ్ స్టేషన్లను ఈ డేటా సెంటర్ అనుసంధానం చేస్తుంది” అని నెట్ బ్లాక్స్ ట్విటర్ లో తెలిపింది. జిబౌతీలో నెట్ సేవలు స్తంభించిపోయాయని మరో సంస్థ సీకామ్ కూడా స్పష్టం చేసింది. మొంబాసా (కెన్యా) నుంచి జఫరానా (ఈజిప్ట్) వరకు వేసిన కేబుల్స్ సెగ్మెంట్ పనితీరుపై ప్రభావం పడిందని సీకామ్ పేర్కొంది.
డ్యామేజ్ అయిన కేబుల్స్ ను రిపేర్ చేసేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని వెల్లడించింది. ప్రపంచ కమ్యూనికేషన్స్ కు ఈ ఇంటర్ నెట్ కేబుల్స్ చాలా కీలకమైనవి. యూరోప్, ఇతర దేశాల్లో ఇంటర్ నెట్ సేవలకు విఘాతం కలగకుండా ఐపీ బేస్ట్ సేవలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రీరూట్ చేశాం” అని సీకామ్ వెల్లడించింది.