చిన్న లాజిక్​తో.. లాటరీలో రూ. 200 కోట్లు కొట్టిన్రు

వాషింగ్టన్: లాటరీ కొట్టాలి, ఓవర్​నైట్​లో కోటీశ్వరులైపోవాలని చాలామందికి ఉంటుంది. కానీ, అదృష్టం కొందరినే వరిస్తుంది. అయితే, ఆ అదృష్టాన్ని నమ్ముకోకుండా లాటరీ టికెట్ నంబరింగ్​ లోని ఓ చిన్న లాజిక్​తో దాదాపు రూ.200 కోట్ల దాకా సంపాదించింది అమెరికాకు చెందిన ఓ వృద్ధ జంట. 

లాటరీ నంబరింగ్ లో లూప్​హోల్ పట్టేసి.. 

మిచిగాన్​లోని ఇవార్ట్ ప్రాంతానికి చెందిన జెర్రీ(80), మార్జ్ సెల్బీ(81) తమ జీవితకాలమంతా ఓ షాప్ నడిపి 60లలో రిటైర్ అయ్యారు. 2003లో సెల్బీ.. ‘విన్​ఫాల్’ అనే కొత్త లాటరీ గేమ్​కు సంబంధించిన బ్రౌచర్​ను చూసి.. ఎలాగైనా అందులో జాక్​పాట్ కొట్టాలనుకున్నాడు. చిన్నప్పటి నుంచే మ్యాథమెటిక్స్ లో మస్తు తోపు అయిన సెల్బీ.. అందులో రిస్క్ రివార్డ్ ను కౌంట్ చేసి విన్నింగ్ టికెట్ ఏదో కనిపెట్టాడు. అదేంటంటే.. విన్​ఫాల్ గేమ్​లో జాక్​పాట్ 5 మిలియన్ డాలర్లకు చేరుకుని ఎవ్వరూ గెలవకపోతే, మిగతా టికెట్లలో విన్నింగ్ నంబర్లు ఎక్కువగా మ్యాచ్ అయినోళ్లకే ఆ మొత్తం అమౌంట్ షేర్ అవుతుంది. ఈ లూప్​హోల్​ను గుర్తించిన సెల్బీ.. తాను ఎన్ని టికెట్లు కొంటే తనకు కలిసివస్తుందో లెక్కలేసిండు. 

1,100 టికెట్లపై 1100 డాలర్లు పెడితే.. వాటిలో వెయ్యి డాలర్లు గెలిచే 4 అంకెల విన్నింగ్ నంబర్ల టికెట్లలో ఒక్కటైనా తనకు తగిలే ప్రాబబులిటీ ఉంటుందని సెల్బీ అంచనా వేశాడు. అలాగే, 50 డాలర్ల లాటరీ టికెట్లలో 3 నంబర్లు మ్యాచ్ అయ్యే టికెట్లు కూడా 18 నుంచి 19 టికెట్లు తనకు రావొచ్చని ఎస్టిమేషన్ వేశాడు. మొత్తానికి 1,100 డాలర్లు పెట్టి 1,900 డాలర్లు గెలవచ్చని కన్ఫామ్ చేసుకున్నాడు. ఆ ప్రకారంగా కొనుగోలు చేయగా మొదటిసారి తాను పెట్టిన 3,600డాలర్లకు 6,300 డాలర్లు గెలిచాడు. అదే అంచనాలతో మరోసారి 8 వేల డాలర్లు పెట్టి 16 వేల డాలర్లు గెలిచాడు. 

సెల్బీ ఇక అక్కడితో ఆగలేదు.. 9 ఏండ్లలో 26 మిలియన్ డాలర్లు అంటే మన రూపాయల్లో 200 కోట్లు సంపాదించాడు. ఈ జంట స్టోరీతో ‘జెర్రీ అండ్ మార్జ్ .. గో లార్జ్’ పేరిట సినిమా కూడా వచ్చింది.