![క్రిమినల్ కేసులు ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎలా కొనసాగుతారు? : సుప్రీం కోర్టు](https://static.v6velugu.com/uploads/2025/02/how-can-convicted-politicians-come-back-supreme-court-seeks-union-eci-stand-on-lifetime-bar-for-mps-and-mlas-after-conviction_hE89DSnvXF.jpg)
నేర చరిత ఉంటే ప్రభుత్వ ఉద్యోగానికే అర్హత లేనపుడు .. ప్రజా ప్రతినిధులు ఎలా అర్హులవుతారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. క్రిమినల్ కేసులు ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎలా కొనసాగుతారని ప్రశ్నించింది. ప్రజా ప్రతినిధుల కేసుల వేగవంతంపై విచారణలో భాగంగా సోమవారం (ఫిబ్రవరి 10) సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన నేతలపై జీవిత కాల నిషేధాన్ని విధించాలని 2016లో దాఖలైన పిటిషన్ పై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్ బెంచ్ విచారణ చేపట్టింది. ప్రజా ప్రాతినిథ్య చట్టం (Representation of People Act) ప్రకారం క్రిమినల్ కేసులు రుజువైతే సదరు నేతలపై ఆరేండ్ల నిషేధం ఉందని, కానీ జీవిత కాల నిషేధం విధించాలని అడ్వకేట్ అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ వేసిన పిల్ ను విచారించింది సుప్రీం ధర్మాసనం. ఈ చట్టంలోని సెక్షన్ 8, సెక్షన్ 9 లకు రాజ్యాంగ క్రమబద్ధతపై స్పందన ఏంటో చెప్పాలని ఈసీని, కేంద్రాన్ని ఆదేశించింది.
Also Read :- ఇన్ఫోసిస్లో ఇంత ఘోరమా
దీనిపై ప్రస్తుతం అమికస్ క్యూరీగా వ్యవహరిస్తున్న సీనియర్ అడ్వకేట్ విజయ హన్సారియా స్పందిస్తూ.. పిల్ దాఖలైనప్పటి నుంచీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన దాదాపు 5 వేల కేసులు పెండింగ్ లో ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో సుప్రీం ఆదేశాలు జారీ చేసినప్పటికీ దాదాపు 40 శాతం ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉండటం దారుణమని, 30 ఏళ్లుగా కేసులు పెండింగ్ లోనే ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.
క్రిమినల్ కేసులు ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల విచారణ వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఈ కేసులపై ఎలా వ్యవహరించాలో అభిప్రాయం చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 4కు వాయిదా వేసింది.