- కలెక్టర్, జడ్పీ సీఈవోను నిలదీసిన జడ్పీ చైర్మన్
- జిల్లా పరిషత్‌ను డమ్మీ చేయాలని చూస్తున్నరు
- పదవి పోయినా సామాన్య పౌరుడిలా పోరాడుతా
- రూల్స్ పాటించని అధికారులను జైలుకు పంపిస్తా
- జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి హెచ్చరిక
వనపర్తి, వెలుగు:వనపర్తి జిల్లా పరిషత్‌కు మంజూరైన నిధులను తీర్మానం లేకుండానే అభివృద్ధి పనులకు ఎలా కేటాయిస్తారని జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్ రెడ్డి కలెక్టర్, జడ్పీ సీఈవోను నిలదీశారు. తమను డమ్మీ చేయాలని చూస్తున్నారని, పదవి పోయినా సామాన్యుడిలా పోరాడుతానని స్పష్టం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సర్ది చెప్పినా వినలేదు. సోమవారం ఆయన అధ్యక్షతన వనపర్తి జడ్పీ కార్యాలయంలో జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించగా.. మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, జడ్పీ సీఈవో వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. వైద్యారోగ్య శాఖపై చర్చపై చైర్మన్ మాట్లాడుతూ హెల్త్ సబ్ సెంబర్లలో సౌకర్యాల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.84 లక్షలను తీర్మానం లేకుండానే కేటాయించడంపై కలెక్టర్‌పై మండిపడ్డారు. అలాగే జిల్లాలో స్కూళ్లలో సౌకర్యాల కోసం వచ్చిన రూ.2 కోట్ల నిధులను స్థానిక జడ్పీటీసీ , ఎంపీపీలకు చెప్పకుండానే ఆయా స్కూళ్లకు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీ ఖాతాలోని నిధులు తమ తీర్మానం లేకుండా కలెక్టర్ అకౌంట్‌కు ఎలా మళ్లిస్తారని జడ్పీ సీఈవోను ప్రశ్నించారు.
జడ్పీటీసీలు, ఎంపీపీలకు విలువ ఇస్తలేరు
జిల్లాలో జడ్పీటీసీలు, ఎంపీపీలకు విలువలేకుండా పోయిందని, ప్రజలు ఓటేసి నాలుగేళ్లు గడుస్తున్నా ఒక్క పని కూడా సొంతంగా చేయలేని దుస్థితిలో ఉన్నారని పరిషత్ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి వాపోయారు. తనను అధికారిక కార్యక్రమాలకు పిలవడం లేదని, మండల పరిషత్ సమావేశాలకూ ఆహ్వానం ఉండడం లేదన్నారు. అయినా అక్కడికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు. తనపైకి కొందరు జడ్పీటీసీలు, ఎంపీపీలను రెచ్చగొట్టి పంపిస్తున్నారని పరోక్షంగా మంత్రి నిరంజన్ రెడ్డిపై కామెంట్ చేశారు. ఈ చర్చ సాగుతుండగానే మంత్రి, కలెక్టర్ షేక్‌యాస్మిన్ బాషా మట్టి దినోత్సవంలో పాల్గొనాలని అక్కడి నుంచి వెళ్లిపోయారు. మంత్రితో పాటుగా కొందరు జడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా వెళ్లారు. అనంతరం కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కొల్లాపూర్ నియోజకవర్గంలోని వీపనగండ్ల, చిన్నంబావి మండలాల్లో జూరాల, భీమా చివరి ఆయకట్టుకు సరిగ్గా సాగు నీరు అందటం లేదన్నారు. ఎన్ని సార్లు చెప్పినా ఇరిగేషన్ అధికారుల తీరు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పింఛన్లను తొలగించటంపై దుమారం
ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన కొత్త పింఛన్లను అధికారులు ఇష్టారాజ్యంగా తొలగించడంపై జడ్పీటీసీలు మండిపడ్డారు. చిన్నంబావి జడ్పీటీసీ వెంకటరామమ్మ మాట్లాడుతూ తాము ప్రపోజల్ పంపిన వారి పేర్లు కూడా తొలగించారని వాపోయారు. శ్రీరంగాపురం జడ్పీటీసీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ జడ్పీ నిధుల్లో ఇతరులు కలుగ జేసుకోవడం సరైంది కాదన్నారు. శ్రీరంగాపూర్ మండలంలో అనేక గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లను సరఫరా చేయడం లేదన్నారు. విద్యాశాఖ, పంచాయతీరాజ్ శాఖ తీరుపై కూడా కొందరు జడ్పీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీలో మొత్తం 40కి పైగా అంశాలను చర్చించాల్సి ఉన్నా కేవలం మూడు, నాలుగు శాఖల్లోని అంశాలపై వివాదం చెలరేగడంతో మిగతావి మమ అనిపించారు. అంతకు ముందు మంత్రి మాట్లాడుతూ కంటి వెలుగు పథకాన్ని విజయవంతం చేసేందుకు జడ్పీటీసీలు సహకరించాలని కోరారు. సమస్యలు జిల్లా పరిషత్‌లో చర్చిస్తేనే పరిష్కారం అవుతాయని అనుకోవద్దని, తాను ఒక్కో శాఖపై సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. ఆ సమయంలో జడ్పీటీసీలు,ఎంపీపీలు వారి సమస్యలను లిఖిత పూర్వకంగా ఇస్తే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు కిచ్చారెడ్డి, మేఘారెడ్డి లతో జడ్పీటీసీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మంత్రి నిరంజన్ రెడ్డితో వాగ్వాదం
ఇష్యూ పెద్దది అవుతుండడంతో మధ్యలో కల్పించుకున్న మంత్రి నిరంజన్ రెడ్డి అన్ని జిల్లాల్లోనూ పీహెచ్‌సీల అభివృద్ధి కోసం నిధులను వాడుతున్నట్లు వివరించారు. దీంతో జడ్పీ చైర్మన్ మంత్రితో కొద్దిసేపు వాగ్వాదం చేశారు. రాజ్యాంగంలోని 73,74 సవరణల ప్రకారం జిల్లా పరిషత్‌లకు విశేష అధికారాలు ఉన్నాయని, వీటిని కాలరాస్తే సహించేది లేదన్నారు. అధికారులు రూల్స్ ప్రకారం తమ విధులు, బాధ్యతలు ఏంటో గుర్తించాలని, విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టప్రకారం జైలుకు పంపిస్తానని హెచ్చరించారు. అభివృద్ధి జరగాలన్న ఉద్దేశ్యంతో నిధులు ఖర్చు చేస్తున్నారని, ఎక్కడా ఎలాంటి అవినీతికి ఆస్కారం లేదని మంత్రి సర్ది చెప్పారు. అయినా ఆగని జడ్పీ చైర్మన్ త్వరలో ప్రభుత్వంలో మార్పులు వస్తాయని, ఎమ్మెల్యేలు, మంత్రుల అధికారాలను తగ్గించి స్థానిక సంస్థలకే ఎక్కువ నిధులు కేటాయించనున్నారని కామెంట్ చేశారు. తనకు పదవి, పార్టీ ముఖ్యం కాదని ప్రతి పైసా ప్రజలకు చేరాలన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు.