తీర్పు ఆలస్యమైతే న్యాయం జరిగేదెలా?

రాజ్యాంగం ప్రకారం దిగువ కోర్టులను పర్యవేక్షించే అధికారం హైకోర్టుకు ఉంది. పరిపాలనా అధికారాలను ఉపయోగించి దిగువ కోర్టు న్యాయమూర్తులపై హైకోర్టు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. హైకోర్టు న్యాయమూర్తులు తీర్పులు చెప్పడంలో ఆలస్యం చేస్తే ఏమైనా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందా ?, వాదనలు విన్న నెలల తర్వాత కూడా తీర్పు చెప్పకపోతే ఏం చేయాలన్న ప్రశ్న సహజంగానే కలుగుతుంది. రాజ్యాంగం ఈ విషయంలో మౌనంగానే ఉంది. హైకోర్టు న్యాయమూర్తులు తీర్పులు చెప్పడంలో జాప్యం చేస్తారని రాజ్యాంగ నిర్మాతలు ఊహించి ఉండరు. అది వాళ్ల విశ్వాసం కావొచ్చు కానీ ఇప్పడది సన్నగిల్లి పోయింది. వాదనలు విన్న తర్వాత కూడా తీర్పు రాకుండా ఎన్నో కేసులు పెండింగ్ లో ఉంటున్నాయి. ఈ విషయం సుప్రీంకోర్టే చెప్పింది. కింది కోర్టులకే నిబంధనలు
తీర్పులు సత్వరం ప్రకటించాలని సుప్రీం కోర్టు భావిస్తోంది. రాజ్యాంగం నిర్దేశిస్తున్నది కూడా అదే. సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం సివిల్ కేసుల్లో తీర్పులను రెండు మాసాల్లో ప్రకటించాలి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్​ప్రకారం క్రిమినల్ కేసుల్లో తీర్పులను వెంటనే ప్రకటించాల్సి ఉంటుంది. ఈ రెండు నిబంధనలు కింది కోర్టులకు మాత్రమే పనికొస్తాయి. పైకోర్టులకు వర్తించవు. హైకోర్టులు తీర్పులను ప్రకటించడానికి శాసనం కాలపరిమితిని విధించలేదు. ఈ విషయంలో న్యాయవాదులు ఏమీ అనలేరు. వారికి ఆ కేసు ఒక్కటే కాదు. ఇంకా చాలా కేసులు ఉంటాయి. గట్టిగా మాట్లాడితే మిగతా కేసుల్లో ఫలితం తారుమారయ్యే ప్రమాదం ఉందన్న అనుమానం వాళ్లకి ఉంటుంది.


అనిల్ రాయి వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్
వాదనలు విన్న తర్వాత తీర్పులు చెప్పడంలో ఆలస్యం జరిగితే దాని పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. న్యాయవాదులు చెప్పిన ముఖ్యమైన అంశాలను న్యాయమూర్తులు మరిచిపోయే అవకాశం ఉంది. అవి తీర్పుల్లో ప్రతిబింబించే అవకాశాలు తగ్గిపోతాయి. ఇలా చెప్పడానికి అసౌకర్యంగా ఉన్నప్పటికీ ఇది వాస్తవం. తీర్పులు చెప్పే విషయం గురించి రాజ్యాంగం మౌనంగా ఉన్నా.. సుప్రీంకోర్టు 2001లో ఒక ప్రధాన తీర్పు వెలువరించింది. సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్​ఆర్ పీ సేథి, జస్టిస్​ కేటీ తామస్ లు 2001 ఆగస్టు 6న అనిల్ రాయి వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో కీలక తీర్పు వెలువరించారు. జస్టిస్ సేథీ వెలువరించిన తీర్పుతో జస్టిస్​ కేటీ థామస్ ఏకీభవిస్తూనే మరికొన్ని విషయాలను జతచేశారు. ఈ కేసులో తొమ్మిది మంది ముద్దాయిలకు సెషన్స్ కోర్టు వివిధ నేరాలకు శిక్షలు విధించింది. 
అందులో హత్య నేరం కూడా ఉంది.సెషన్స్ కోర్టు ఆ తీర్పును  1991 మే 4న ప్రకటించింది. ఆ తర్వాత జైలులో ఉన్న ముద్దాయిలు పాట్నా హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నారు. వాళ్ల వాదనలు విన్న పాట్నా హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును 1995 ఆగస్టు23న రిజర్వ్ చేసింది. ఆ తర్వాత కొంత కాలానికి వారిలో ఒక ముద్దాయి చనిపోయాడు.1997 ఆగస్టు14న హైకోర్టు డివిజన్​బెంచ్​ఈ కేసులో తీర్పు ప్రకటించింది. 


సుప్రీం కీలక సూచనలు
తీర్పులో జరిగిన జాప్యానికి సంబంధించి అనిల్ రాయి వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ‘‘ఎలాంటి కారణాలు లేకుండా, నిర్లక్ష్యంగా తీర్పులు ప్రకటించడంలో జాప్యం ఉంటే అది శిక్షపడిన వ్యక్తులు పైకోర్టుకు అప్పీలు చేసుకోవడానికి ఆటంకం కలిగించినట్లే. అప్పీలు చేసుకోకుండా అది వారిని నిరోధించినట్లు అవుతుంది. అప్పీలు చేసుకోవడమనేది నాగరిక న్యాయశాస్త్రం ఇచ్చిన హక్కు. ఏ కారణం లేకుండా ఈ హక్కుకు భంగం కలిగించడం సహించరాని విషయం. ఆ నెపాన్ని వాద ప్రతివాదుల మీదకు, రాజ్యం మీదికి తోసేయడానికి అవకాశం కూడా లేదు. తీర్పులు ప్రకటించడంలో జాప్యం క్షమించడానికి వీలులేని విషయం. మరీ ముఖ్యంగా ఇది రాజ్యాంగంలోని మూడో భాగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉంది. ఇలాంటి పరిస్థితి మన దేశంలోని చాలా హైకోర్టుల్లో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈ జాప్యాన్ని నిరోధించడానికి సూచనలు చేయడం అవసరం. దీనివల్ల వివాదాల్లో ఇరుక్కున్న ప్రజలకు ఉపశమనం లభించే అవకాశం ఉంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 353(1)ని పరిశీలిస్తే శాసనకర్తల ఉద్దేశం అర్థమవుతుంది. ఈ నిబంధన ప్రకారం విచారణ పూర్తి కాగానే కోర్టు తీర్పును బహిరంగ కోర్టులో ప్రకటించాలి. ఆ తర్వాత కూడా తీర్పు ప్రకటించవచ్చు. అయితే తీర్పు ప్రకటించే తేదీని పార్టీలకు తెలియజేయాలి. తరువాత ప్రకటించేందుకు శాసనం వీలు కల్పించింది. అయితే ఇక్కడ తర్వాత ప్రకటించడం అంటే ఎలాంటి జాప్యం లేకుండా ప్రకటించడం అని శాసనకర్తల ఉద్దేశం. తీర్పు చెప్పడంలో జాప్యం శాసనానికి విరుద్ధం. క్రిమినల్ కేసులో తీర్పు ఆరు వారాల్లోగా ప్రకటించాలి. ఈ విషయాన్ని ఇంతకుమించి అర్థం చేసుకోవడానికి వీల్లేదు. సివిల్ కేసులో వాదనలు పూర్తయిన రెండు నెలల్లోగా కోర్టు తీర్పును ప్రకటించాలి”అని సుప్రీం అభిప్రాయపడింది.


మార్గదర్శక సూత్రాలు
 అనిల్ రాయి వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో సుప్రీం కొన్ని మార్గదర్శక సూత్రాలను వెలువరించింది.  తీర్పును రిజర్వు చేసి తర్వాత ప్రకటించినప్పుడు తీర్పు ప్రతిలోని మొదటి పేజీలో రెండు కాలమ్స్ ఏర్పరిచి, తీర్పును రిజర్వు చేసిన తేదీ, ప్రకటించిన తేదీలను సంబంధిత కోర్టు అధికారి పేర్కొనేలా రిజిస్ట్రీని దేశంలోని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు ఆదేశించాలి.  తుది వాదనలు విన్న రెండు మాసాల్లో తీర్పును ప్రకటించనప్పుడు ఆ బెంచ్ దృష్టి వాటి వైపు మరల్చేలా ప్రధాన న్యాయమూర్తులు చూడాలి. అలాగే వాదనలు విన్న ఆరు మాసాల్లో తీర్పును ప్రకటించని కేసుల వివరాలను తయారుచేసిన పట్టికను హైకోర్టు న్యాయమూర్తులకు పంపిణీ చేయాలి.ఈ సమాచారం రహస్యంగా సీల్డ్ కవర్ లో తెలియజేయాలి. తీర్పు రిజర్వ్ చేసిన మూడు మాసాల్లో ఏదైనా కేసులో తీర్పును ప్రకటించనప్పుడు ఆ కేసులోని పార్టీలలో ఎవరైనా త్వరగా ప్రకటించాలని హైకోర్టులో దరఖాస్తులు దాఖలు చేయవచ్చు. ఆ  దరఖాస్తులను రెండు రోజుల్లోగా ఆ సంబంధిత బెంచ్ ముందు ఉంచాలి. ఒకవేళ ఏదైనా కారణం వల్ల తీర్పును ఆరు మాసాల్లో ప్రకటించకపోతే ఆ కేసులోని పార్టీలు ఆ కేసును ఆ బెంచ్ నుంచి ఉపసంహరించి వేరే బెంచ్ కు పంపించమని దరఖాస్తు ద్వారా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరవచ్చు. ప్రధాన న్యాయమూర్తి ఆ కోరికను మన్నించవచ్చు లేదా వేరే ఏదైనా తగిన ఉత్తర్వులు జారీ చేయవచ్చు.

జస్టిస్ కేటీ థామస్ సూచనలు
అనిల్ రాయి వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో జస్టిస్​ కేటీ థామస్​ కూడా కొన్ని సూచనలు చేశారు. దేశంలోని ఉన్నత న్యాయస్థానాల్లోని న్యాయమూర్తుల్లో ఇటీవలి కాలంలో మందకొడితనం కనిపిస్తోందని, ఫలితంగా కొన్ని కేసుల్లో తీర్పులు అలాగే ఉండిపోతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. దాని వల్ల ఆ కేసులోని విషయాలను  వాదనలను సహజంగానే న్యాయమూర్తులు మరిచిపోయే అవకాశం ఉందని జస్టిస్ ​థామస్​ పేర్కొన్నారు. ఈ ఆదేశాలు జారీ చేసి సంవత్సరాలు గడుస్తున్నా ఫలితం మాత్రం అంతగా కనిపించడం లేదు. న్యాయం అందించడంలో జాప్యం.. న్యాయం నిరాకరించిన కిందే లెక్క. సత్వర న్యాయం పొందడం పౌరుల రాజ్యాంగ హక్కు. కానీ దేశంలో కింది కోర్టులు మొదలు పైకోర్టుల వరకు తీర్పులు వెలువరించడంలో జాప్యం చేస్తున్నాయి. ఫలితంగా న్యాయం కోసం పైకోర్టుకు అప్పీలుకు వెళ్లాలనుకుంటున్న వారికి అన్యాయం జరుగుతోంది. కింది కోర్టుల్లో జాప్యం ఉంటే హైకోర్టు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. హైకోర్టులో జాప్యానికి ఎవరికీ అధికారం లేకపోయినప్పటికీ.. సుప్రీంకోర్టు కొన్ని కీలక సూచనలు చేసింది. 


న్యాయ వ్యవస్థపై విశ్వాసం కలిగేలా..
హైకోర్టు ఏ కాలపరిమితిలో తీర్పులను ప్రకటించాలో సివిల్ ప్రొసీజర్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నిర్దేశించ లేదని, తీర్పులు ప్రకటించడమనేది న్యాయం చెప్పే వ్యవస్థలోని ఒక భాగంమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కాబట్టి జాప్యం లేకుండా తీర్పులను ప్రకటించాల్సిన  బాధ్యత కోర్టుల మీద ఉంది. తీర్పులు ప్రకటించడంలో జాప్యం వల్ల ప్రజలు అసహనానికి గురవుతారని, దాన్ని గమనించకపోతే న్యాయవ్యవస్థ మీద విశ్వాసం తొలగిపోయే అవకాశం ఉందని సుప్రీం పేర్కొంది. ఏవో కొన్ని తప్పిదాల వల్ల మొత్తం న్యాయవ్యవస్థనే తక్కువగా చూసే పరిస్థితి  ఏర్పడకూడదని, కళంకం లేని, కలుషితం కాని న్యాయాన్ని ప్రజలకు అందించడానికి న్యాయవ్యవస్థ తన శక్తియుక్తుల్ని వాడాలని సుప్రీం చెప్పింది.

- మంగారి రాజేందర్, 
జ్యుడీషియల్​ అకాడమీ 
మాజీ డైరెక్టర్