గురువు ఒక గీత గీసి తన శిష్యులతో ఆ గీతను ఏ విధంగానూ తగ్గించకుండా చిన్నది చేయాలని సూచించాడట. అది ఎట్లా సాధ్యమని అందరూ ఆలోచిస్తుండగా ఒక తెలివైన శిష్యుడు లేచి ఆ గీత పక్కన మరో పెద్దగీత గీశాడట. దాంతో గురువు గీసిన గీత చిన్నదైపోయింది. అలాగే ఒక సమస్య ఏర్పడినపుడు దాన్ని పరిష్కరించకుండా దాని తీవ్రతను తగ్గించాలంటే దాని ముందు మరొక సమస్య ఏర్పడితే అంతకు ముందున్న సమస్య చిన్నదైపోయి కాలక్రమంలో మరుగున పడిపోతుంది. తెలంగాణ విద్యాశాఖ ఈ గీతా సారాంశాన్ని బాగా వంటబట్టించుకున్నట్లున్నది. విద్యారంగంలో దశాబ్దాలుగా పరిష్కారం కాని అనేక సమస్యలపై టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ఉపాధ్యాయ సంఘాలు నిరసన ప్రదర్శనలు చేపడుతుండగా సమస్యల పరిష్కారానికి చొరవచూపని విద్యాశాఖ, అకస్మాత్తుగా తెరమీదకు మరొక అంశాన్ని తెచ్చి అందరి దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నది.
తొలిమెట్టు ఎక్కేదెలా..
రాష్ట్ర విద్యాశాఖ ఈ విద్యా సంవత్సరంలో 1 నుంచి 5 తరగతుల వరకు విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు సాధించే దిశగా తొలిమెట్టు(ఎఫ్ఎల్ఎన్) ను ప్రారంభించింది. ప్రాథమిక పాఠశాలల్లో ఎక్కడా సరిపడా టీచర్లు లేరు. దీంతో క్షేత్ర స్థాయిలో టీచర్లు తొలిమెట్టు కార్యక్రమాన్ని నిర్వహించలేక తలలు పట్టుకుంటున్నారు. అలాగే 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఇంగ్లీషు మీడియం ప్రారంభం కావడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే వారికి విద్యాబోధన చేయడానికి సరిపడా టీచర్లు లేరు. సరిపడా సౌలత్లు లేవు. హైస్కూల్స్ లో సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా ఉన్నది.
దాంతో పాటు హెడ్మాస్టర్ల కొరతా వేధిస్తున్నది. పాఠశాలకు నాయకత్వం వహించి మార్గదర్శకునిగా, పాఠశాలకు సమాజానికి అనుసంధానకర్తగా వ్యవహరించే హెడ్ మాస్టర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో ఆ పాఠశాలలు చుక్కాని లేని నావ లాగ కొనసాగుతున్నాయి. స్కూల్ అసిస్టెంట్లకు హెడ్మాస్టర్ బాధ్యతలు ఇవ్వడం ద్వారా వారిని బోధనకు దూరం చేశారు. ఒక పాఠశాల సక్రమంగా నడవాలంటే పరిపుష్టమైన బోధనా వ్యవస్థ ఉండాలి. అప్పుడే పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుంది.
హెడ్మాస్టర్ల కొరత
టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా హైస్కూళ్లలో హెడ్మాస్టర్లు, సబ్జెక్టు టీచర్ల కొరతను నివారించవచ్చు. ప్రమోషన్ల ద్వారా ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయవచ్చు. ఇవేవీ పట్టని రాష్ట్ర విద్యాశాఖ మాత్రం కొత్త కార్యక్రమాలను రూపొందించి వాటిని అమలు చేయాలంటూ టీచర్లను ఆదేశించడం హాస్యాస్పదం. బదిలీలు, ప్రమోషన్లపై స్వయంగా ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను పట్టించుకోని విద్యాశాఖ, టీచర్ల ఆస్తుల ప్రకటన, బయో మెట్రిక్ హాజరు, టీఎల్ఎం మేళాలు అంటూ ఏదో ఒక అంశాన్ని తెరపైకి తెచ్చి అందరినీ వాటి చుట్టూ తిప్పుతూ ప్రమోషన్లు, బదిలీల అంశాన్ని వెనక్కి నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నది. ప్రభుత్వం కూడా ఈ అంశంపై సరైన నిర్ణయం తీసుకోకుండా అలసత్వం వహిస్తున్నది. జీతాలు, జీపీఫ్, మెడికల్ తదితర బిల్లుల్లో తీవ్ర జాప్యం చేస్తూ టీచర్లందరూ బదిలీలు, ప్రమోషన్ల ను గురించి ఆలోచించకుండా, ఆందోళనలు, నిరసనలు తెలుపకుండా జీతాలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూసేలా చేసింది. ఇలా ప్రభుత్వం, రాష్ట్ర విద్యాశాఖ చిన్నగీత పక్కన పెద్ద గీత అన్నట్లు కొత్త అంశాన్ని సృష్టిస్తూ పోతున్నారే తప్ప టీచర్లు, విద్యారంగ సమస్యలు పరిష్కరించడం లేదు.
టీచర్లు లేకుండా బోధన ఎలా?
మరోవైపు పదో తరగతి ఫలితాలపైనా టార్గెట్లు విధిస్తున్నారు, టాస్క్ ఫోర్స్ పేరుతో పర్యవేక్షణల పేర్లతో పత్రికల ముందు, మీడియా ముందు ఉపాధ్యాయులను దోషులుగా నిలబెడుతున్నారు. పిల్లలకు చదువు చెప్పని టీచర్లంటూ ఉండరు. వారి స్థాయిలో వారు బోధన చేస్తుంటారు. ఏ టీచరు కూడా విద్యాశాఖ రూపొందించిన అకడమిక్ కార్యక్రమాలను వ్యతిరేకించరు. తాము బోధించే పిల్లలు ఉత్తీర్ణులు కావాలని, తమ పాఠశాలకు మంచి ఉత్తీర్ణతా శాతం లభించాలని కోరుకుంటారు. దాని కోసం వారు కృషిచేస్తారు కూడా. అయితే హైస్కూళ్లలో సబ్జెక్టు టీచర్ల కొరత ఉన్నది. టీచర్లు లేకుండా ఫలితాలు ఎలా వస్తాయి. ఎఫ్ఎల్ఎన్ వంటి కార్యక్రమాలు ఎలా విజయవంతమవుతాయి. అసలే ప్రైమరీ స్కూళ్లలో సరిపడా టీచర్లు లేరని ఆందోళన చెందుతుంటే విద్యాశాఖ మాత్రం వర్కు అడ్జెస్ట్ మెంట్ల పేరుతో ప్రైమరీ టీచర్లను హైస్కూళ్లకు డిప్యుటేషన్లు వేస్తున్నది. సాధారణ టీచర్లకు బదిలీలు జరపడం చేతకాని విద్యాశాఖ, ప్రభుత్వ పెద్దల ఆశీస్సులున్న కొందరు టీచర్ల సంఘ నాయకులకు, టీచర్లకు బహిరంగంగా ఉత్తర్వులిస్తూ అక్రమ బదిలీలు చేస్తుండటం విచారకరం. సబ్జెక్టు టీచర్ల కొరతను వర్క్ అడ్జెస్ట్ మెంట్ పేరుతో డిప్యుటేషన్లు ఇవ్వడమో, విద్యా వాలంటీర్లను నియమించడమో పరిష్కారం కాదు. ఏడేండ్లుగా నిలిచిపోయిన ప్రమోషన్లు, 5 ఏండ్లుగా నిలిచిపోయిన బదిలీలను తక్షణం చేపట్టాలి. ఈ విషయమై ప్రభుత్వం చొరవ తీసుకుంటే బోధనావ్యవస్థ బలోపేతం అవుతుంది. పిల్లలకు నాణ్యమైన విద్య లభిస్తుంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
- ఏ.వి. సుధాకర్,
అసోసియేట్ అధ్యక్షుడు, ఎస్టీయూటీఎస్