40 శాతం ఖాళీలుంటే పాలన ఎలా..?

తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన జరిగింది. కానీ, సొంత రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లు గడుస్తున్నా ఇప్పటికీ నియామకాల అంశం ముందుకు కదలడం లేదు. 50 వేల పోస్టులను భర్తీ చేస్తామని ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల ముందు టీఆర్ఎస్​ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆ తర్వాత దాని ఊసే మరిచిపోయింది. ఉద్యోగాల భర్తీ నత్తనడకన సాగడం వల్ల నిరుద్యోగుల్లో నైరాశ్యం ఆవరించింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అది కూడా అమలుకు నోచుకో లేదు. ఈ విషయంపై అసెంబ్లీ సాక్షిగా సీఎం హామీ ఇచ్చారు. నిరుద్యోగులుగా ఎవరిని గుర్తించాలి? ఎలా భృతి ఇవ్వాలి? ఎంత ఇవ్వాలి? అనే విషయాలపై అధ్యయనం చేసి అమలు చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకూ అది అమలు కాలేదు. 
ఐదు శాఖల్లోనే ఎక్కువ మంది ఉద్యోగులు
రాష్ట్రం మొత్తం 1,91,126 ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నాయని పీఆర్సీ రిపోర్ట్​ వెల్లడించింది. రాష్ట్రం మొత్తం 4,91,304 పోస్టులకుగానూ ప్రస్తుతం 3,00,178(61 శాతం) మందే పనిచేస్తున్నారు. అంటే మొత్తం పోస్టుల్లో 39 శాతం ఖాళీలే ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. రాష్ట్రంలో 32 ప్రభుత్వ శాఖలు ఉండగా 5 శాఖల్లో మాత్రమే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. స్కూల్​ ఎడ్యుకేషన్, హోం, రెవెన్యూ, హెల్త్, పంచాయతీ రాజ్ శాఖల్లో మాత్రమే ఎక్కువ మంది ఉన్నారు. ఈ ఐదు శాఖల్లోనే 3,42,938(69.80%) మంజూరైన ఉద్యోగాలుండగా, పనిచేస్తున్న ఉద్యోగుల్లో 2,30,799(79.89%) మంది వీటిలోనే ఉన్నారు. ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకపోవడంతో ప్రభుత్వ శాఖల్లో 50,400 మంది కాంట్రాక్ట్,​58,128 మంది ఔట్​సోర్సింగ్​ ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరు 16.81 శాతంగా ఉన్నారు.
ప్రతి వెయ్యి మందికి 8.5 మంది ఉద్యోగులేనా?
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ ప్రాంత జనాభా 3.52 కోట్లు. మంజూరైన ఉద్యోగాలను పరిగణనలోకి తీసుకుంటే.. ప్రతి వెయ్యి మందికి 14 మంది ఉద్యోగులు ఉండాలి. అయితే ఖాళీలను భర్తీ చేయకపోవడంతో 8.5 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఉద్యోగ ఖాళీలు ఇలాగే ఉంటే పాలనలో వేగం ఎలా సాధ్యమవుతుంది. నిరుద్యోగుల ఆవేదనను అర్థం చేసుకోవలసినది పాలకులే. పరిశ్రమల స్థాపనతో ఉద్యోగాలు సృష్టిస్తూ, ఉపాధి మార్గాలను వెతుకుతూ, నిరుద్యోగ నిర్మూలన చేస్తూ, పారదర్శక పాలన అందించాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఖాళీల భర్తీలో ఉదాసీనత వైఖరిని వీడాలి. 
బోర్డుల్లో ఖాళీలను భర్తీ చేయాలె
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ)కి చైర్మన్​తో కలుపుకుని 10 మంది సభ్యులుండాలి. కానీ ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. కొత్తగా 50 వేల ఉద్యోగాల భర్తీ చేస్తామని చెబుతున్న ప్రభుత్వం.. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 ఖాళీల భర్తీ ప్రకటన, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి పూర్తి చేయటానికి ముందు టీఎస్పీఎస్సీలో ఖాళీలను భర్తీ చేయాలి. అలాగే యూనివర్సిటీ వైస్​ చాన్స్​లర్లు, పోలీస్ రిక్రూట్​మెంట్​ బోర్డులు, గురుకుల బోర్డులతో పాటు ఇంకా మిగిలిన కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించాల్సి ఉంది. త్వరలో చేపట్టే ఉద్యోగాల భర్తీకి ముందే ఈ ప్రక్రియ పూర్తిచేస్తేనే సాఫీగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. 
ఉద్యోగులపై పని ఒత్తిడి.. ప్రజలకు ఇక్కట్లు
మంజూరైన ఉద్యోగాల్లో 39% భర్తీ కాకుండా ఉండటంతో ఇటు ప్రజలు, అటు ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖాళీల వల్ల ఉద్యోగులపై పనిభారం పెరిగి ఒత్తిడికి లోనవుతున్నారు. ప్రజలకు సేవలను సంపూర్ణంగా అందించలేక పోవడం వలన అక్కడక్కడ ప్రజలకు, ఉద్యోగులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతోంది. అధికార వికేంద్రీకరణలో భాగంగా జిల్లాల విస్తరణ జరిగినప్పటికీ, వాటిలో ఖాళీల వల్ల ప్రజలు అనేక ఇక్కట్లు పడుతున్నారు. ఇదే విషయాన్ని పీఆర్సీ కమిషన్​ తన నివేదికలో ప్రభుత్వానికి సూచించింది. అందువల్ల ప్రభుత్వం ప్రజల ఇక్కట్లు, ఉద్యోగులపై పనిభారం తగ్గించడానికి కొత్త ఉద్యోగాలను సృష్టిస్తూ ఉపాధి అవకాశాలను పెంచి నిరుద్యోగుల్లో వెలుగులు నింపాలి. రాష్ట్రంలో ఉన్న మొత్తం ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలి.

యువతలో ఆత్మవిశ్వాసం నింపాలె
ఆత్మగౌరవ పాలన కోసం పరితపించిన తెలంగాణ ప్రజలకు, ఇంకోవైపు నిరుద్యోగులకు మేలు జరిగే చర్యలకు పూనుకోవాలి. అలాగే ఎన్నికల హామీ మేరకు ఈ నియామకాలతో పాటు నిరుద్యోగ భృతిని కూడా ఇచ్చే విధంగా కార్యాచరణ రూపొందించాలి. అలాగే కొన్ని వృత్తి శిక్షణలు ఇచ్చి స్వయం ఉపాధికి రుణాలు ఇస్తూ నిరుద్యోగాన్ని తగ్గించాలి. కోర్టు చిక్కులను అధిగమిస్తూ టైమ్ బౌండ్ ప్రోగ్రాంలో నియామకాలను చేపట్టాలి. తెలంగాణ ఉద్యమంలో అమరులైన యువత త్యాగం వెలకట్టలేనిది. ఆత్మగౌరవ పాలనలో కూడా యువత నిరాశ నిస్పృహలకు లోనుకావడానికి ఇన్నాళ్ల కాలయాపనే కారణమని గమనించాలి. పోరాడాల్సిన నిరుద్యోగులు ప్రాణాలు అర్పించడం మానాలి. స్వరాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ నిరుద్యోగుల్లో ఉద్యోగాల భర్తీతో పాటు మిగిలిన నిరుద్యోగులకు భృతిని ఇస్తూ వారి జీవితాల్లో ఆనందాలను నింపాలి. నిరుద్యోగ యువతలో ఆత్మ విశ్వాసం నింపే చర్యలను తక్షణమే చేపట్టాలి. -రక్కిరెడ్డి ఆదిరెడ్డి, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, కాకతీయ యూనివర్సిటీ.