ఎల్ఆర్ఎస్​స్కీం.. దరఖాస్తుదారులు స్టేటస్​ చెక్​ చేసుకోండిలా..

ఎల్ఆర్ఎస్​స్కీం.. దరఖాస్తుదారులు స్టేటస్​ చెక్​ చేసుకోండిలా..

ఎల్ఆర్ఎస్ ​స్కీం దరఖాస్తుదారులు హెచ్ఎండీఏ వెబ్సైట్లో తమ దరఖాస్తు స్టేటస్​తెలుసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు అధికారులు తెలిపారు. లేకపోతే హెచ్ఎండీఏ కాల్​ సెంటర్ 18005998838కు ఫోన్​ చేయవచ్చన్నారు. అర్హులైన దరఖాస్తుదారులు ఈనెల 31లోపు ఫీజు చెల్లిస్తే పది రోజుల్లోనే దరఖాస్తులను ప్రాసెస్​చేస్తామని తెలిపారు. ఎల్​ఆర్​ఎస్​ స్కీంలో భాగంగా అక్రమ లే అవుట్లను రెగ్యులరైజ్​ చేయడం ద్వారా భారీగా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని భావించిన గత ప్రభుత్వం ప్రకటన చేసింది.

దీంతో హెచ్ఎండీఏ పరిధిలోని ఏడు జిల్లాల్లో 1,337 అక్రమ లేఅవుట్లు క్రమబద్ధీకరించాలంటూ లక్షల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ మొత్తం లేఅవుట్లలో 3.20 లక్షల ప్లాట్లు ఉన్నాయి. శంకర్​పల్లి జోన్​-1లో 52,048, జోన్​-2 పరిధిలో 52, 046 శంషాబాద్​పరిధిలో 87,040, ఘట్​కేసర్​లో 1,18,542 , మేడ్చల్–1లో 2,073, మేడ్చల్-–2లో 9,678 దరఖాస్తులు వచ్చాయి.

వీటిలో లక్ష దరఖాస్తుల పరిశీలన పూర్తిచేసిన అధికారులు అనుమతులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. దరఖాస్తుదారులంతా రూ.వెయ్యి ఫీజు చెల్లించి ఆన్​లైన్​ ద్వారా దరఖాస్తు చేసుకోగా, ఆ డబ్బులే రూ.32 కోట్లు వచ్చాయి. 25 శాతం రాయితీతో వీటిని రెగ్యులరైజ్​చేయడం ద్వారా మరో రూ.వెయ్యి కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుందని హెచ్ఎండీఏ భావిస్తోంది.  

ఈ నిబంధనలు పాటిస్తేనే..
ప్రభుత్వం ప్రకటించిన గైడ్​లైన్స్​ప్రకారమే లే అవుట్లను క్రమబద్ధీకరిస్తామని అధికారులు చెబుతున్నారు. 2020 ఆగస్టు 26వ తేదీకి ముందు వేసిన అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొని ఉండి, దరఖాస్తు చేసుకున్నవారే అర్హులంటున్నారు. అలాగే ప్రతి అనధికార లేఅవుట్​లో 10 శాతం ప్లాట్లు విక్రయించి ఉంటేనే మిగిలిన ప్లాట్లను రెగ్యులరైజ్​చేస్తామంటున్నారు. ఎఫ్టీఎల్, బఫర్​జోన్​, ప్రభుత్వ భూములు, పట్టణ భూగరిష్ట చట్టం ప్రకారం మిగులు భూములు, దేవాదాయ భూముల్లో లేఅవుట్స్​రెగ్యులరైజ్​చేసేది లేదని స్పష్టం చేస్తున్నారు.

అలాంటి వాటికి గతంలో రిజిస్ట్రేషన్​ చేసినా ఇప్పుడు తాము అనుమతించేది లేదంటున్నారు. దరఖాస్తు చేసుకున్న ప్లాట్​చెరువులకు 200 మీటర్ల దూరంలో ఉండాలని, దీనికి రెవెన్యూ, ఇరిగేషన్​ ఆఫీసర్ల ఆమోదం ఉండాలన్నారు. ఈ నిబంధనలు అన్ని పక్కాగా ఫాలో అయిన వారు మార్చి 31వ తేదీ లోపు 25 శాతం డిస్కౌంట్​తో ఫీజు చెల్లించాలని, ఒకవేళ ఎల్ఆర్ఎస్​దరఖాస్తు రిజెక్ట్​ అయితే 90 శాతం ఫీజు తిరిగి చెల్లిస్తామన్నారు.