![జీవ వైవిధ్యాన్ని సంరక్షించే మార్గాలివే..](https://static.v6velugu.com/uploads/2025/02/how-can-you-protect-biodiversity_onCxFwVuZR.jpg)
జీవవైవిధ్యం పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ ఉంటుంది. అయితే, మానవుడి అనేక చర్యల వల్ల వాతావరణంలో వచ్చే పెను మార్పుల వల్ల జీవ వైవిధ్యం నిశ్చలతను కోల్పోతుంది. ఫలితంగా విపరీత పరిణామాలకు దారితీస్తుంది. గత శతాబ్దకాలంలో సగానికిపైగా అడవులు నరికివేతకు గురయ్యాయి. 70 శాతానికి పైగా మంచినీరు కలుషితమైంది. సుమారు 10 శాతం మాంగ్రూవ్ అడవులు నాశనమయ్యాయి. 1,35,000 జాతుల మొక్కలు, జంతువుల్లో కొన్ని నాశనం కావడం వల్ల గ్లోబల్‌వార్మింగ్ విపరీతంగా పెరిగింది.
భారతదేశంలోని 10 శాతం మొక్కలు, జంతువులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. ఒక జాతి అంతరిస్తే దానిలోని జన్యుసంపద అంతరించినట్లే జీవ వైవిధ్యపు నిజమైన విలువంతా జన్యువుల్లో నిక్షిప్తమైన సమాచారంలో ఉంటుంది. బ్యాక్టీరియా 1000 జన్యువులను కలిగి ఉంటే, పుష్పించే మొక్కలు, కొన్ని జంతువులు 4 లక్షల వరకు జన్యువులను కలిగి ఉంటాయి. జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం కోసం మానవ చర్యలను పర్యావరణ సంరక్షణకు అనుకూలంగా మలచుకోవాలి. మన దేశంలోని చాలా సంస్థలు జీవ వైవిధ్య సంరక్షణలోనూ దాన్ని ప్రతిభావవంతంగా వినియోగించడంలోనూ నిమగ్నమై ఉన్నాయి. ఈ సంస్థలన్నీ పర్యావరణ, అటవీశాఖ, వ్యవసాయ, విజ్ఞాన, సాంకేతిక మంత్రిత్వశాఖల పర్యవేక్షణలో పనిచేస్తున్నాయి. ఈ సంస్థలన్నీ వివిధ జీవావరణాలను, జాతీయ ఉద్యానవనాలను, అటవీ సంపదనూ సంరక్షణా కేంద్రాలను వివిధ జన్యు బ్యాంకులను సంరక్షించే పనిలో నిమగ్నమై ఉన్నాయి. జీవ వైవిధ్యాన్ని అనేక మార్గాల ద్వారా సంరక్షించుకోవచ్చు. వాటిలో ఇన్ సైటు సంరక్షణ, ఎక్స్ సైటు సంరక్షణ.
ఇన్ సైటు జీవ వైవిధ్య సంరక్షణ
మొక్కలను, జంతువులను అవి నివసించే సహజ ఆవరణ వ్యవస్థల్లోనూ లేదా మానవుడితో నిర్వహించే ఆవరణ వ్యవస్థల్లోనూ సంరక్షించడాన్ని ఇన్ సైటు సంరక్షణగా పేర్కొంటారు. ప్రకృతిలోని జీవరాశులను రక్షించుకోగలిగినట్లయితే జీవ వైవిధ్యం సంరక్షించబడుతుంది. సాధారణంగా ఈ రకమైన సంరక్షణా విధానం అటవీ మొక్కలు, అటవీ జంతువులకు మాత్రమే వర్తిస్తుంది. అటవీ ఆవరణ వ్యవస్థకు, బయట స్థానికంగా పెంచే జీవరాశులకు వర్తించదు.
ఉదాహరణకు జీవావరణ రిజర్వు, జాతీయ ఉద్యానవనాలు, సంరక్షణా కేంద్రాలు మొదలైనవి. జీవావరణ రిజర్వును అభివృద్ధి చేయడంలోని ప్రధాన లక్ష్యం జీవరాశుల్లోని వైవిధ్యాన్ని ప్రస్తుతం వచ్చే కాలంలో వినియోగం కోసం రక్షించడం, జాతులను, వాటి పరిమాణాన్ని శాసించే జన్యు వైవిధ్యాలను సంరక్షించుకోవడం వివిధ పంటల ఆవరణాలను, అటవీ జన్యు వనరులను సంరక్షించడానికి జాతీయ ఉద్యానవనాలు, సంరక్షణా కేంద్రాలు తోడ్పడతాయి. ఆధునిక కాలంలో 18 జీవావరణ రిజర్వులు స్థాపించారు. ప్రపంచంలో జీవ వైవిధ్యానికి అత్యంత ప్రమాదకరంగా పరిణమించిన 18 నుంచి 25 ప్రదేశాలను హాట్ స్పాట్స్‌గా గుర్తించారు. దీనివల్ల ఆయా ప్రదేశాల్లో సంరక్షణా విధానాలను ప్రభావవంతంగా చేపట్టే అవకాశం ఏర్పడింది.
ఎక్స్ సైటు జీవ వైవిధ్య సంరక్షణ
జీవ వైవిధ్య సహజ ఆవాసాలకు వెలుపల సంరక్షించినట్లయితే దాన్ని ఎక్స్ సైటు సంరక్షణ అంటారు. ఈ పద్ధతిలో ప్రమాదస్థితిలో ఉన్న మొక్కలను, జంతువులను సేకరించి, వాటిని వృద్ధి చేసేందుకు ఉద్యానవనాల్లోనూ జంతు ప్రదర్శనశాలల్లోనూ ఉంచి సంరక్షిస్తారు. ఈ రకంగా మానవుడి పర్యవేక్షణలో సంరక్షించడం వల్ల, జీవరాశులు వాటికి కావాల్సిన ప్రాథమిక అవసరాలను, రక్షణను పొంది ఎక్కువకాలం బతుకగలుగుతాయి. ఈ రకంగా జీవరాశులను వాటి సహజ ఆవాసాలకు వెలుపల రక్షించడం చాలా ఖర్చుతో కూడుకున్నది. ఈ సంరక్షణను కొన్ని ఎంపిక చేసిన జీవులకే వర్తింపజేయగలం. ఈ పద్ధతి వల్ల జీవుల్లో వాతావరణ అనుకూలత తగ్గిపోతుంది. కొత్త జీవరాశులు పరిణామం చెందే అవకాశం తగ్గిపోయి జన్యమూలకాలు స్తంభించిపోతాయి.
విత్తనం/ పిండం రూపంలో నిల్వ చేయడం చాలా జాతులకు చెందిన మొక్కల్లో విత్తనాలు లేదా పిండాల్లో జన్యుపరంగా తగినంత ఆహారం నిల్వ చేసి ఉంటుంది. సాధారణంగా జనాభా నుంచి నమూనాలను సేకరించి, వాటిని సున్నా డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద 20 డిగ్రీల నిల్వ చేయడం కోసం విత్తన బ్యాంకులకు తరలిస్తారు. 1850 సంవత్సరం నుంచి చాలా మొక్కలు జన్యుపదార్థాలు మిలీనియం విత్తన బ్యాంకుల్లో నిల్వ చేస్తున్నారు. మన దేశంలో వరి, అరటి, గోధుమ మొదలైన మొక్కల జన్యు పదార్థం విత్తన బ్యాంకుల్లో నిల్వ చేస్తున్నారు.
- వృక్ష/ జంతు ప్రదర్శన కేంద్రాలు: వృక్ష, జంతు ప్రదర్శన కేంద్రాల్లో ఒక ప్రత్యేక ప్రదేశాల నుంచి వివిధ వృక్ష, జంతు జాతులను సేకరించి, వాటిని సంరక్షిస్తూ ఉంటారు. పరస్థానిక సంరక్షణ: పరస్థానిక వర్ధనం ద్వారా మొక్కల్లోని ఏదైనా ఒక అవయవాన్ని లేదా పిల్ల మొక్కలను అభివృద్ధి చేయడానికి ఉపయోగించి మొక్కలోని ఏదైనా భాగాన్ని ఎక్స్ ప్లాంట్ అంటారు. జన్యు బ్యాంకులు: మొక్కల్లోని జన్యువుల సంరక్షణ కోసం 1974లో రోమ్ ముఖ్య కేంద్రంగా ఒక అంతర్జాతీయ బోర్డు స్థాపించారు. భారతదేశంలో కూడా అనేక జన్యు బ్యాంకులు స్థాపించారు.
దేశంలోని జన్యు బ్యాంకులు
పుప్పొడి/ శుక్రకణాలు/ అండం/ డి.ఎన్.ఎ సంరక్ష సరైన పరిస్థితుల్లో పుప్పొడి రేణువులను నిల్వ చేయడం వల్ల, అవసరమైనప్పుడు ఇతర మొక్కతో సంకరణం చెందించవచ్చు. నిల్వ చేసిన శుక్ర కణాలను ఉపయోగించి జంతువుల్లో కృత్రిమ గర్భధారణను కలిగించవచ్చు. జీవ సాంకేతిక శాస్త్రం అభివృద్ధి చెందడం వల్ల జన్యు సంపద సంరక్షణ, జీవుల అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ 850 పంట జాతులను స్థానికంగా సంరక్షిస్తోంది. బీజ ద్రవ్య సంపదను సంరక్షించుకోవడానికి ట్రాపికల్ బొటానికల్‌గార్డెన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(తిరువనంతపురం), నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రీసోర్సెస్(న్యూఢిల్లీ), సెంట్రల్ ఇన్స్టిట్యూట్ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమేటిక్ ప్లాంట్స్(లక్నో), రీజనల్ రీసెర్చ్ లాబొరేటరీ(జమ్మూ) స్థాపించారు.