- ప్రాణ వాయువును కణాలు ఎలా గుర్తిస్తాయి?
- ఆక్సిజన్ లెవల్ తగ్గినప్పుడు ఏం చేస్తాయి?
- ఆ పరిస్థితి తట్టుకునేందుకు.. శరీరంలో జరిగేదేంటి?
- పరిశోధించిన ముగ్గురు సైంటిస్టులకు వైద్య శాస్త్రంలో నోబెల్
ఆక్సిజన్.. సకల జీవులకు ప్రాణాధారం. కొద్దిసేపు ఆక్సిజన్ అందకపోయినా అంతే సంగతులు. అలాంటి ప్రాణ వాయువును మన శరీరంలోని కణాలు ఎలా గుర్తిస్తాయి? పరిగెత్తేటప్పుడు, మంచు కొండలు ఎక్కేటప్పుడు, భారీ ఎత్తుకు వెళ్లినప్పడు ఇలా కొన్ని సమయాల్లో తగినంత ఆక్సిజన్ అందదు.. అలాంటప్పుడు కణాలు ఏం చేస్తాయి?
ఆ పరిస్థితికి తట్టుకునేలా క్షణాల్లో ఏలా మార్పులు జరుగుతాయి? అనేది మనిషి జీవం నిలపడంలో చాలా కీలకం. ఈ విషయాలపై పరిశోధన చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలు ఉమ్మడిగా ఈ ఏడాది వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు.
ఆ ముగ్గరు సైంటిస్టులు:
నోబెల్ బహుమతుల్ని అందించే స్వీడిస్ అకాడమీ సర్ పీటర్ రాట్ క్లిఫ్, విలియం కెలిన్, గ్రెగ్ సెమెంజాలను వైద్య శాస్త్రంలో నోబెల్ కు ఎంపిక చేసింది. వీరిలో పీటర్ యూకేలోని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన వారు. విలియం.. యూఎస్ లోని హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్, ఇక గ్రెగ్.. యూఎస్ లోని జాన్స్ హాప్కిన్స్ వర్సిటీకి చెందినవారు. డిసెంబరు 10న స్వీడన్ లో జరిగే నోబెల్ ప్రైజ్ అందుకుంటారు.
ఇన్నాళ్లు ఆక్సిజన్ అవసరమే తెలుసు..
ఇన్నాళ్లుగా మనిషి బతకాలంటే ఆక్సిజన్ అవసరమనే తెలుసు. కానీ, ఆక్సిజన్ అందడంలో మార్పులు జరిగితే శరీరంలో ఏం జరుగుతుంది? కణాలు ఆ పరిస్థితిని ఎలా మేనేజ్ చేస్తాయి? అనే విషయాలు తెలియవు. ఇప్పుడు అమ్మ కడుపులో పిండంగా ఉన్న క్షణం నుంచి రోజు వారీ జీవితంలో ఆక్సిజన్ ఏ స్థాయిలో అందితే కణాలు ఎలా రియాక్ట్ అవుతాయో తెలిసింది. ఈ పరిశోధన ఫలితంగా రక్త హీనత నుంచి కేన్సర్ వరకు, గుండె పోటు నుంచి ఊపిరితిత్తుల వ్యాధుల వరకు నయం చేసేందుకు బాటలు పడుతాయి.
ఆక్సిజన్ ఆగిందంటే..
మనం తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చాలంటే ఆక్సిజన్ తప్పనిసరి. శ్వాస ఆగిందంటే శక్తి నశించి.. ప్రాణం పోతుంది. కానీ, పూర్తిగా ఆగకుండా కొన్నిసార్లు కొంత లెవల్ వరకు తగ్గుతుంది. అప్పుడు శరీరంలోని కణాలు తక్షణం వాటి క్రియలు జరిగే తీరును మార్చుకోవాల్సి వస్తుంది. వెంటనే ఎర్ర రక్త కణాల ఉత్పత్తి భారీగా పెరిగిపోతోంది. సరిగ్గా ఈ మార్పు ఎలా జరగుతుందనేది శాస్త్రవేత్తలు కనిపెట్టారు.
అదీ కుదరకపోతే మరణమే..
ఆక్సిజన్ లెవల్ తగ్గగానే ఎరిత్రోపొయిటిన్ (ఈపీవో) అనే హార్మోన్ లెవల్ పెరిగిపోతుంది. దాని వల్లే ఎర్ర రక్త కణాలు ప్రొడక్షన్ పెరుగుతుంది. అయితే హైపోక్సియా ఇండ్యూసిబుల్ ఫ్యాక్టర్ (హెచ్ఐఎఫ్) అనే ప్రొటీన్ క్లస్టర్ డీఎన్ఏ నే బంధించి, దాని క్రియల్లో మార్పు చేస్తుంది. దీని ద్వారా ఈపీవో పెరగడానికి వీలు పడుతుంది. హెచ్ఐఎఫ్ క్లస్టర్ ను ఏర్పడేలా కణాలు నిరంతరం పనిచేస్తాయి. అయితే ఆక్సిజన్ లెవల్ నార్మల్ అయిన వెంటనే ఈ ప్రక్రియని కిల్ చేస్తాయి. ఈ ప్రాసెస్ ని ఆపేందుకు వీహెచ్ఎల్ అనే ప్రొటీన్ పని చేస్తుంది.
అయితే శరీరానికి అందే ఆ తక్కువ ఆక్సిజన్ లో నుంచి ముందు హెచ్ఐఎఫ్, వీహెచ్ఎల్ తమకు కావాల్సినంత తీసుకుని పని చేస్తాయి. ఒక వేళ వాటికి కావాల్సిన మొత్తంలో కూడా ఆక్సిజన్ అందలేదంటే మనిషి ప్రాణం పోయినట్లే.