మైనర్‌‌‌‌‌‌‌‌ను రేప్ చేస్తే మరణశిక్ష.. లోక్‌‌‌‌సభలో అమిత్ షా

మైనర్‌‌‌‌‌‌‌‌ను రేప్ చేస్తే మరణశిక్ష.. లోక్‌‌‌‌సభలో అమిత్ షా

న్యూఢిల్లీ:  బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ చట్టాల్లో సమూల మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఐపీసీ, సీఆర్‌‌‌‌‌‌‌‌పీసీ, ఎవిడెన్స్ చట్టాల స్థానంలో కొత్త చట్టాలను తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన మూడు బిల్లులను కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం లోక్‌‌‌‌‌‌‌‌సభలో ప్రవేశపెట్టారు. ప్రతిపాదిత బిల్లుల్లో సంచలన ప్రొవిజన్స్‌‌‌‌‌‌‌‌ను కేంద్రం పొందుపరిచింది. దేశద్రోహ చట్టం పూర్తిగా రద్దు కానుందని పేర్కొంది. మైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అత్యాచారం చేసినా, మూకదాడికి పాల్పడినా గరిష్టంగా మరణశిక్ష విధించేలా నిబంధనలను పెట్టింది. టెర్రరిస్టుల ఆస్తులను అటాచ్​ చేసే ప్రొవిజన్​ను తీసుకొచ్చింది. కొత్త బిల్లులు క్రిమినల్ జస్టిస్‌‌‌‌‌‌‌‌ సిస్టమ్‌‌‌‌‌‌‌‌ను సమూలంగా మార్చివేస్తాయని అమిత్ షా అన్నారు. దేశ పౌరుల హక్కులను పరిరక్షిస్తాయని చెప్పారు. 


బిల్లులను హోం ఆఫైర్స్‌‌‌‌కు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలన కోసం సిఫార్సు చేయాలని స్పీకర్‌‌‌‌‌‌‌‌ ఓంబిర్లాను కోరారు. దీంతో ఈ మేరకు స్పీకర్ సిఫారసు చేశారు. మూడేండ్లలోనే న్యాయం అందుతది: అమిత్ షాప్రస్తుత అవసరాలు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా న్యాయ వ్యవస్థను రూపొందించేందుకు, బాధితులకు త్వరగా న్యాయం చేసేందుకు ఈ మార్పులు చేపట్టినట్లు అమిత్ షా తెలిపారు. ‘‘కొత్త బిల్లులు ఆమోదం పొందితే.. క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ మారిపోతుంది. ప్రతి ఒక్కరికీ మూడేండ్లలోనే న్యాయం అందుతుంది. కొత్త చట్టాలు.. మహిళలు, పిల్లల రక్షణపై దృష్టిపెడుతుంది. మూకదాడులపైనా ప్రొవిజన్స్ ఉన్నాయి. తొలిసారిగా టెర్రరిజానికి నిర్వచనం కూడా పేర్కొన్నాం” అని చెప్పారు. దేశద్రోహ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయనున్నామని, ఇది ప్రజాస్వామ్యమని, ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కు ఉందని అన్నారు.

టెర్రరిజానికి తొలిసారి నిర్వచనం

భారతీయ న్యాయ సంహిత బిల్లు ప్రకారం.. దేశ ఐక్యత, సమగ్రత, భద్రతకు ముప్పు కలిగించే ఉద్దేశంతో, సాధారణ ప్రజలను లేదా ఒక వర్గాన్ని భయపెట్టడానికి లేదా ప్రజలను అశాంతికి గురిచేసే ఉద్దేశంతో దేశంలో లేదా ఏదైనా విదేశంలో చర్యలకు పాల్పడే వ్యక్తిని టెర్రరిస్ట్‌‌‌‌ అని అంటారు. మరోవైపు టెర్రరిస్టుల ఆస్తులను అటాచ్ చేసేందుకు కూడా ప్రొవిజన్లు పొందుపరిచారు.

బిల్లులు ఇవే

ఇండియన్ పీనల్ కోడ్-1860 స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) బిల్-2023, క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్- 1898 స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌) బిల్-2023, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ - 1872 స్థానంలో భారతీయ సాక్ష్య (బీఎస్)-2023ను రిప్లేస్‌‌‌‌ చేసేందుకు సభలో ప్రవేశపెట్టారు. 

బిల్లుల్లోని కీలక అంశాలు

  •     ఈ చట్టాల ప్రకారం 90 రోజుల్లోనే చార్జిషీట్‌‌‌‌ దాఖలు చేయాలి. పరిస్థితిని బట్టి మరో 90 రోజుల గడువును కోర్టు ఇవ్వొచ్చు. 180 రోజుల్లో దర్యాప్తును పూర్తి చేసి.. విచారణకు పంపాలి. ట్రయల్ తర్వాత 30 రోజుల్లో తీర్పు ఇవ్వాలి. 
  •     వివాహం, ఉద్యోగం, ప్రమోషన్ల సాకుతో లేదా గుర్తింపును దాచిపెట్టి మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడితే నేరంగా పరిగణిస్తారు.
  •     సామూహిక అత్యాచారానికి పాల్పడితే 20 ఏళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు విధిస్తారు. మైనర్‌‌‌‌పై అత్యాచారం చేస్తే గరిష్టంగా మరణశిక్ష.
  •     మూక దాడులకు పాల్పడితే ఏడేండ్ల జైలు శిక్ష విధిస్తారు. జీవిత ఖైదు, గరిష్టంగా మరణ శిక్షలు కూడా విధించేలా నిబంధనలు పెట్టారు. 
  •     ఖైదీలకు క్షమాభిక్ష అంశాన్ని రాజకీయంగా ఉపయోగించడాన్ని ఆపేందుకు కొన్ని నిబంధనలు పెట్టారు. మరణశిక్షలను జీవిత ఖైదుగా మాత్రమే మార్చగలరు. జీవిత ఖైదును ఏడేళ్ల వరకు మాత్రమే తగ్గించేలా  ప్రొవిజన్స్ పెట్టారు. 
  •     తీర్పుల రేటును 90 శాతానికి తీసుకెళ్లడమే లక్ష్యం.
  •     ఎఫ్‌‌‌‌ఐఆర్ నమోదు నుంచి కేసు డైరీ, చార్జిషీట్, జడ్జిమెంట్‌‌‌‌ దాకా ప్రొసీజర్ మొత్తాన్ని డిజిటలైజ్ చేస్తారు.
  •     ఏడేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడే కేసుల్లో క్రైమ్‌‌‌‌ సీన్‌‌‌‌కు ఫోరెన్సిక్ టీమ్ వెళ్లి పరిశీలించడం తప్పనిసరి. 
  •     2027 నాటికల్లా దేశంలోని అన్ని కోర్టులు కంప్యూటరైజ్. త్వరలో ఈఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌లకు అవకాశం.
  •     ఏ పోలీస్ స్టేషన్‌‌‌‌లోనైనా జీరో ఎఫ్‌‌‌‌ఐఆర్ నమోదు చేయవచ్చు. 15 రోజుల్లో సంబంధిత పోలీస్ స్టేషన్‌‌‌‌కు ఫిర్యాదు వెళ్తుంది. 
  •     అరెస్టు అయిన వ్యక్తి బాధ్యత తమదేనని చెబుతూ.. సంబంధిత కుటుంబానికి సర్టిఫికెట్ ఇచ్చేందుకు ప్రతి జిల్లాలో ఓ పోలీసు అధికారి ఏర్పాటు. 
  • వారికి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో, వ్యక్తిగతంగా సమాచారం ఇవ్వాలి.
  •     లైంగిక హింస కేసులో.. బాధితుల స్టేట్‌‌‌‌మెంట్, వీడియో రికార్డింగ్ తప్పనిసరి. 
  •     ఏదైనా కేసు స్టేటస్‌‌‌‌ను 90 రోజుల్లోగా పోలీసులు ఇవ్వాలి
  •     ఏడేళ్లు లేదా అంతకంటే ఎక్కువ రోజులు శిక్ష పడే కేసులను వెనక్కి తీసుకునేందుకు ఏ ప్రభుత్వానికీ అవకాశం ఉండదు. 
  •     సివిల్ సర్వెంట్లపై ఫిర్యాదు చేసేందుకు పర్మిషన్ ఇవ్వాలా వద్దా అనేది సంబంధిత అధికారులు 120 రోజుల్లోగా వెల్లడించాలి. ఒకవేళ ఆ లోగా స్పందన లేకపోతే పర్మిషన్ ఇచ్చినట్లుగానే భావించాలి.
  •     నేరస్థుడిగా తేలిన వ్యక్తి ఆస్తుల నుంచి బాధితులకు పరిహారం ఇచ్చేలా నిబంధన.
  •     చిన్నారులపై జరిగే నేరాల్లో 10 ఏండ్ల జైలు శిక్ష విధించవచ్చు. విధించాల్సిన జరిమానా మొత్తం కూడా పెంపు.
  •     దేశద్రోహం చట్టం పూర్తిగా రద్దు. 
  •     క్రిమినల్స్‌‌‌‌ పరారీలో ఉన్నప్పటికీ విచారణను కొనసాగించవచ్చు. తద్వారా దావూద్ ఇబ్రహీం వంటి నేరస్థులపై విచారణ చేపట్టేందుకు అవకాశం కలుగుతుంది.

కొత్త బిల్లుల లక్ష్యం శిక్షించడం మాత్రమే కాదు.. న్యాయం అందించడం కూడా. నేరాలను అరికట్టాలనే సెంటిమెంట్‌‌‌‌ను సృష్టించేందుకు శిక్షలు పడ్తాయి. అప్పట్లో బ్రిటిషర్లు చేసిన చట్టాలు.. వాళ్ల పాలనను ఎదిరించే వాళ్లను శిక్షించేందుకు ఉద్దేశించినవే.  తమ పాలనను కాపాడుకునేందుకు బ్రిటిషర్లు చేసుకున్న చట్టాలవి... వాటి ఉద్దేశం శిక్షించడమే.. న్యాయం చేయడం కాదు.

- కేంద్ర హోంమంత్రి అమిత్​ షా