రామ మందిరం డిజైన్ 1989లోనే రూపుదిద్దుకుంది. దేవాలయాలను నిర్మించడంలో నిష్ణాతులైన సోంపుర కుటుంబానికి చెందిన వారసుడు చంద్రకాంత్ సోంపుర రామ మందిరం డిజైన్ ఇచ్చాడు. అప్పటి వీహెచ్‌పీ అధిపతి అశోక్ సింఘాల్ విజ్ఞప్తి మేరకు, చంద్రకాంత్ సోంపుర అయోధ్యకు వెళ్లి ఆ ప్రదేశాన్ని పరిశీలించాలి అనుకున్నారు.
కానీ, అక్కడి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల వల్ల అది కుదరలేదు. మరి ఆ ప్రాంతంలోపలికి వెళ్లి చూడకపోతే మందిర నిర్మాణానికి డిజైన్ వేయడం కుదరదు. అందుకే చంద్రకాంత్ భక్తుడి వేషధారణలో అక్కడికి వెళ్లాడు. కాలి అడుగులతో ఆ ప్రాంగణాన్ని కొలిచి, ఆలయ డిజైన్ రూపొందించారు.
రామ మందిరం నిర్మాణం చేయాలనే ఆలోచన 1980లో వచ్చింది. తమ ఆలోచనకు రూపం ఇచ్చే శిల్పి గురించి వెతికాడు అశోక్ సింఘాల్. అప్పుడు పారిశ్రామిక వేత్త ఘన్‌శ్యామ్ దాస్ బిర్లా ‘‘ఆర్కిటెక్ట్ చంద్రకాంత్ బి సోంపుర అయితే ఆ పనికి బెటర్’’ అని చెప్పాడు. చంద్రకాంత్ అప్పటికే బిర్లాల కోసం ఎన్నో దేవాలయాలు నిర్మించి ఇచ్చాడు. సోంపుర కుటుంబం కొన్ని తరాలుగా టెంపుల్ డిజైనింగ్‌లో నిష్ణాతులు.
భక్తుడి వేషంలో వెళ్లి...
అహ్మదాబాద్‌కి చెందిన చంద్రకాంత్ సోంపుర ఆ కుటుంబంలో 15వ తరం. రామ మందిర నిర్మాణ పనులు ఎలా మొదలయ్యాయో చెప్తూ ‘‘వీహెచ్‌పీకి చెందిన అశోక్ సింఘాల్ నా దగ్గరకు వచ్చి ‘రామ మందిరం నిర్మాణానికి డిజైన్ తయారుచేయాలి’ అన్నారు. ఇది 32 ఏండ్ల క్రితం నాటి మాట. అయోధ్యకి నేను వెళ్లి చూసినప్పుడు అక్కడ ఏమీ లేదు. ఆ ప్రదేశానికి వెళ్లి కొలతలు తీసుకునేందుకు అనుమతి కూడా లేదు. దాంతో భక్తుడి వేషంలో వెళ్లి కాలి అడుగులతో కొలతలను తీసుకున్నా. ఆ తరువాత గేట్లు తెరిచాక చాక్‌తో దేవాలయం ఎలా కట్టాలనే ప్లాన్ గీశా అక్కడ.
ఆర్కిటెక్చర్ విషయంలో నేను ప్రత్యేకంగా చదువుకోలేదు. మాకు ఈ కళ వారసత్వంగా వచ్చింది. ఇండియా, విదేశాల్లో కలిపి మొత్తం 200 దేవాలయాలు నిర్మించాను. మా తాత సీఓ సోంపురా1949లో గుజరాత్లో సోమనాథ్ మందిరాన్ని కట్టాడు. నేను కట్టిన వాటిలో గుజరాత్‌లోని అక్షరధామ్, ముంబయిలోని స్వామి నారాయణ్ మందిర్, కోల్‌కతాలోని బిర్లా మందిర్ ఉన్నాయి.
మూడు దశాబ్దాల నాటి కల
రామ మందిర నిర్మాణం పనులు మొదలుపెట్టి 32 ఏళ్లకు పైనే అయ్యింది. నేను మా టీం కలిసి మందిరం డిజైన్‌ను తయారు చేశాం. నా టీంలో నాతో పాటు నా కొడుకులు ఆశిష్, నిఖిల్ ఉన్నారు. మన దగ్గర ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. కానీ ఇది రామ జన్మభూమి. రాముడి జన్మభూమిలో దేవాలయం నిర్మాణం చేయడం అనేది చాలా ప్రత్యేకం.
అయోధ్యకు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న అహ్మదాబాద్‌లో కూర్చుని నేను అయోధ్య రామ మందిరం డిజైన్ చేయడంలో రోజంతా నిమగ్నమయ్యా. మా అబ్బాయిలు నిఖిల్, ఆశిష్‌లతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ పనిని సూపర్వైజ్ చేస్తున్నా. మూడు దశాబ్దాల క్రితం కన్న కలకు వాస్తవరూపం ఇప్పుడు నా 81 ఏండ్ల వయసులో రావడం అనేది నాకెంతో ఆనందాన్ని ఇస్తోంది” అని చెప్పాడు చంద్రకాంత్.
నాన్న, అన్నల అడుగు జాడల్లో...
రామ మందిరం నిర్మాణంలో ఆశిష్ అన్ని పనులు ముందుండి చూస్తున్నాడు. నాన్న, అన్న సలహాలు తీసుకుంటూ రామ మందిరం నిర్మాణం దగ్గర ఉండి పనులను చూసుకుంటున్నాడు. ‘‘మా ముత్తాత ప్రభాకర్ జీ సోంపుర గుజరాత్‌లోని సోమనాథ్ టెంపుల్ ఆర్కిటెక్ట్. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కట్టిన మొట్టమొదటి దేవాలయం అది. శిల్ప శాస్త్రం గురించి దాదాపు154 పుస్తకాలు రాశారు ఆయన.
విశ్వకర్మ నుంచి మా కుటుంబానికి ఆర్కిటెక్చర్ అనేది బహుమతిగా అందిందని నమ్ముతాం” అన్నాడు ఆశిష్. భారతదేశంలో దేవాలయాల డిజైనింగ్‌లో మొత్తం16 శైలులు ఉన్నాయి. వాటిలో మూడు శైలులు ముఖ్యం. నగర శైలి– ఉత్తర భారతంలో గుజరాత్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో కనిపిస్తుంది. ఒరిస్సా, మధ్య భారతం అంతటా వెసర శైలి ఉంటుంది. దక్షిణాదిన ద్రవిడ శైలి ఉంటుంది. సోమనాథ్, స్వామి నారాయణ్, అంబాజీ దేవాలయాల్లో నగర శైలి కనిపిస్తుంది.
ఇలా మొదలైంది
రామ మందిరం గురించి చంద్రకాంత్‌ను వీహెచ్‌పి సభ్యులు సంప్రదించిన టైంలో ఆశిష్ తన కుటుంబ వారసత్వాన్ని కొనసాగించేందుకు ఆర్కిటెక్చర్, సివిల్ స్టడీస్ చదువుతున్నాడు. ‘‘ఆ మీటింగ్ తర్వాత మా నాన్న టెంపుల్ సైట్‌కు వెళ్లారు. అప్పుడు అక్కడ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. ఆ ప్రాంతంలోకి చిన్న సూదిని కూడా లోపలికి తీసుకెళ్లనిచ్చేవాళ్లు కాదు. అలాంటి టైంలో నాన్న అక్కడికి వెళ్లి ఆయన పాదాల అడుగుల ద్వారా టెంపుల్ కట్టేందుకు ఎంత భూమి అవసరం పడుతుందో లెక్క కట్టారు.
దాన్ని బట్టి నాన్న మూడు డిజైన్లు తయారు చేశారు. 1992లో అలహాబాద్ (ప్రయాగరాజ్ ఒకప్పుడు)లో కుంభ మేళా జరుగుతున్నప్పుడు అక్కడ సాధువులకి చూపించారు. ఒక డిజైన్ వాళ్లకు చాలా బాగా నచ్చింది. సాధువుల సమితి ఓకే చేసిన డిజైన్‌లో మందిరం రూపుదిద్దుకుంటోంది. అష్టభుజి ఆకారంలో గర్భ గుడి, శిఖరం, రెండు మండపాలు అన్నీ పక్కాగా శిల్ప శాస్త్రం ప్రకారం డిజైన్ చేశారు. హిందువుల గుడిలో గర్భ గుడి, దానికి ఆనుకుని మండపాలు ఉంటాయి. అలాగే ఎంట్రన్స్ హాల్ భక్తుల కోసం, వేడుకలు చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. గర్భగుడి మీద శిఖరం ఉంటుంది.
విష్ణువుకి గుర్తుగా గర్భగుడిని అష్టభుజి ఆకారంలో నిర్మించేందుకు ప్లాన్ చేశారు. అష్టభుజి ఆకారం అనేది చాలా అరుదుగా కనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే కొన్ని ప్రాచీన దేవాలయాల్లో మాత్రమే అది కనిపిస్తుంది. దేవాలయం ఒరిజినల్ డిజైన్ మారకుండానే కొన్ని మార్పులు చేసి తూర్పు ముఖంగా విగ్రహాన్ని ఉంచారు. తెలుపు రంగు మక్రాన మార్బుల్‌తో ఫినిషింగ్ చేశారు.
ఒకసారి టెంపుల్ బ్లూ ప్రింట్ రెడీ అయ్యాక కమిటీ ఒక్క రూపాయి నుంచి నిధుల సేకరణ మొదలుపెట్టింది. నిధుల సేకరణలో డబ్బు ఒక్కటే కాదు రాళ్లు, కార్వింగ్ మెటీరియల్స్, బన్సీ పహార్పూర్ నుంచి గులాబీ రంగు రాళ్ల వంటివి పలు ప్రాంతాల నుంచి అయోధ్యకు రావడం మొదలైంది. 1992 – 1998 మధ్య రామ మందిరం నిర్మాణానికి సంబంధించిన పనులు కొనసాగుతూనే ఉన్నాయి” అని రామ మందిరం నిర్మాణంలో ఒక్కో దశ గురించి వివరించాడు.
దేవాలయానికి జీవ కళ
ఇదే టైంలో నిఖిల్ రాజస్తాన్‌కు మొదట సింఘాల్‌ను, తరువాత వీహెచ్‌పీకి చెందిన రవిని వెంటపెట్టుకుని వెళ్లాడు. ఆ విషయాల గురించి మాట్లాడుతూ ‘‘అక్కడ మైనింగ్ లాట్స్ నుంచి దేవాలయానికి ఉపయోగపడే రాళ్లను సెలక్ట్ చేసే పని మాది. ఇవన్నీ దాదాపు 20 ఏండ్ల క్రితం నాటి విషయాలు. అయినప్పటికీ రాజస్తాన్‌లో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తున్నట్టే అనిపిస్తుంది. దేవాలయం కోసం మంచి మెటీరియల్ తెప్పించేందుకు ఒక సమితి ఏర్పడింది.
ఆ కమిటీలో క్వారీ, మైన్స్ యజమానులు ఉన్నారు. వాళ్లంతా కలిసి రామ మందిరం నిర్మాణానికి పనికొచ్చే రాళ్లను తమ క్వారీలు, మైన్స్ నుంచి పంపించారు. అలా దాదాపు 50,000 క్యూబిక్ ఫీట్ స్టోన్స్ అయోధ్యలో రామ మందిరం నిర్మించే ప్రదేశానికి పంపారు. అయితే ఆ తరువాత సేకరించిన నిధులు అయిపోవడం మొదలైంది. దాంతో పాటు పనులు కూడా నెమ్మదించాయి.
2014లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక అయోధ్య కేసులో కదలిక వచ్చింది. 2019లో సుప్రీంకోర్టు దేవాలయ నిర్మాణానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దాంతో దేవాలయ నిర్మాణం జరుగుతుందన్న ఆశ వచ్చింది మా కుటుంబంలో. ఆ తీర్పు వచ్చిన రోజు వీహెచ్‌పి సభ్యులు చాలా మంది మమ్మల్ని కలిసి అభినందించారు” అని అప్పటి విషయాలను వరసగా గుర్తు చేసుకున్నాడు నిఖిల్.