
- పుణెలోని సినిమా హాల్లో వ్యక్తి మృతి
- సీబీఐ ఎంక్వైరీ ఎదుర్కొన్న రాజ్ ఠాక్రే
- 2005లో శివసేన నుంచి బయటికి.. 2006లో ఎంఎన్ఎస్ ఏర్పాటు
ముంబై: మహారాష్ట్రలో 1990 కాలంలో బాల్‌ఠాక్రే నేతృత్వంలో శివసేన తిరుగులేని పార్టీగా ఎదిగింది. బాల్ ఠాక్రే కొడుకు ఉద్ధవ్ ఠాక్రే, తమ్ముడి కొడుకు రాజ్ ఠాక్రే కలిసి పార్టీకి భారీ విజయాలు తెచ్చిపెట్టారు. ఎంతో పటిష్టంగా ఉన్న శివసేన.. పుణెలోని సినిమా హాల్లో ఓ వ్యక్తి సూసైడ్ చేసుకోవడంతో రెండుగా చీలిపోయింది.
సదరు వ్యక్తి చనిపోవడానికి రాజ్‌ఠాక్రే కారణమనే ఆరోపణలు.. అతన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుకు దూరం చేసింది. దీంతో కలత చెందిన రాజ్ ఠాక్రే.. శివసేన నుంచి బయటికొచ్చి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్)ను స్థాపించారు. ఇదంతా సుమారు 20 ఏండ్ల కింద జరిగింది. ఇప్పుడు మళ్లీ ఉద్ధవ్, రాజ్ ఠాక్రే ఏకం అవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
సినిమా హాల్ మిస్టరీ డెత్తో మనస్పర్థలు
1996, జులై 23న దాదర్‌కు చెందిన రమేశ్ కినీ.. పుణెలోని ఓ సినిమా హాల్లో చనిపోయి కనిపించాడు. రమేశ్ భార్య షీలా సంచలన ఆరోపణలు చేసింది. లక్ష్మిచంద్ షా, సుమన్ షా శివసేన లీడర్లని, తన భర్త మృతి వెనుక రాజ్ ఠాక్రే హస్తం ఉందని ఫైర్ అయింది. దీంతో ఈ కేసు సీఐడీ నుంచి సీబీఐకి బదిలీ అయింది. రాజ్‌ఠాక్రేను సీబీఐ ప్రశ్నించింది. తర్వాత క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ.. అప్పటికే రాజ్ ఠాక్రేకు జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. అదే టైమ్‌లో ఉద్ధవ్ ఠాక్రేకు పార్టీలో మద్దతు పెరిగింది.
ఒక్క ప్రకటనతో రాజ్ ఠాక్రే బయటికి..
2003లో మహాబలేశ్వర్‌లో శివసేన సభ జరిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉద్ధవ్ ఠాక్రేను ఎన్నుకున్నారు. బాల్‌ఠాక్రే తన కొడుకు ఉద్ధవ్‌కు అనుకూలంగా ఈ నిర్ణయం తీసుకున్నారని కొందరు విమర్శించారు. రమేశ్ కినీ మృతి ఆరోపణలే పదవిని దూరం చేశాయనే పుకార్లు వినిపించాయి. అదే టైమ్‌లో నార్త్ ఇండియన్ వలసదారులకు వ్యతిరేకంగా రాజ్‌ఠాక్రే ‘మీ ముంబైకర్’ క్యాంపెయిన్ ప్రారంభించారు. దీనికి బాల్ ఠాక్రే మద్దతు ఇవ్వలేదు.
దీంతో 2005 నవంబర్ 27న శివసేన నుంచి బయటికొస్తున్నట్లు రాజ్‌ఠాక్రే ప్రకటించాడు. తాను గౌరవం అడిగితే.. అవమానాలు దక్కాయంటూ రాజ్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. బాల్ ఠాక్రే దేవుడిలాంటి వారని, తనపై కొందరు లేనిపోని మాటలు చెప్పారని ఉద్ధవ్ ను ఉద్దేశిస్తూ కామెంట్లు చేశారు. చివరికి 2006లో మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) పేరుతో పార్టీ స్థాపించారు. 2012, నవంబర్‌లో బాల్ ఠాక్రే చనిపోయాక కూడా ఉద్దవ్, రాజ్ ఏకం కాలేదు.
రాజ్ బయటికొచ్చాక ఉద్ధవ్ ఏమన్నడు?
శివసేన నుంచి బయటికెళ్తానన్న రాజ్‌ఠాక్రే ప్రకటన తీవ్రంగా బాధించిందని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. 2005, నవంబర్ 27న రాజ్‌ఠాక్రే పార్టీపై తిరుగుబావుట ఎగురేశారని విమర్శించారు. విభేదాలు సామరస్యపూర్వకంగానే పరిష్కారం అవుతాయని తెలిపారు.
బీఎంసీ ఎన్నికల్లో కలిసి పోటీ!
మహారాష్ట్ర సంస్కృతి, భాష, సంప్రదాయాలను కాపాడటమే ఉద్ధవ్, రాజ్ ఠాక్రే ఎజెండాగా ఉన్నాయి. ముంబై స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరూ కలిసి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.