ప్రైవేట్ సంస్థల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విద్యార్థులు, నిరుద్యోగులు ప్రైవేట్ కొలువులు పొందేలా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్) యాప్ ను తీసుకొచ్చింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలి జెన్స్ (ఏఐ) ఆధారంగా పని చేస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులను ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలతో లింక్ చేసేలా అధికారులు యాప్ ను అభివృద్ధి చేశారు. దీన్ని పల్లెలోని నిరుద్యోగులు, విద్యార్థులు కూడా వాడుకునేలా అవగాహన కల్పిస్తున్నారు.
అంతా ఆన్లైన్లోనే...
డీట్ యాప్ లో కంపెనీలు కూడా ఎన్రోల్ చేసుకుని, తమకు ఎలాంటి స్కిల్స్ ఉన్నోళ్లు కావాలో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా రిజిస్టర్ అయిన కంపెనీ లతో విద్యార్థులు/నిరుద్యోగులను మ్యాచ్ చేసేలా ఓ ప్రత్యేకమైన ఏఐ అల్గారిథంను యాప్ లో వాడుతున్నా రు. ఈ ఏఐ అల్గారిథం విద్యార్థుల స్కిల్స్ ఆధారంగా ఆయా సంస్థలకు వారి వివరాలను పంపిస్తుంది. కంపెనీలను తనుకు కావాల్సిన అర్హతలున్న విద్యార్థులు/ నిరుద్యోగులతో ఏఐ 'మ్యాచ్' చేస్తుంది.
విద్యార్థి/ నిరుద్యోగి, సంస్థ మ్యాచ్ అయ్యాక.. సదరు అభ్యర్థుల తో సంస్థ చాట్ బాక్స్ లో చర్చిస్తుంది. తర్వాత కంపెనీ ఆన్ లైన్ లోనే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తుంది. ఒకవేళ సంస్థ విద్యార్థి/ నిరుద్యోగిని కావాలనుకుంటే, ఆఫర్ లెటర్ ఇస్తుంది. అయితే, ఆఫరు యాక్సెప్ట్ చేయాలా? వద్దా? అన్నది పూర్తిగా అభ్యర్థి ఇష్టానికే వదిలేస్తారు.
జాబ్ వచ్చేదాకా ప్రాసెస్ అంతా ఆన్ లైన్ లోనే జరగడం విశేషం. ఎప్పటికప్పుడు జాబ్ నోటిఫికేషన్స్, జాబ్ మేళాల వివరాలు వచ్చేలా యాప్ ను డెవలప్ చేశారు. విద్యార్థులు/ కంపెనీల డేటా సేఫ్ గా ఉండేలా స్టేట్ డేటా సెంటర్ ఆధ్వర్యంలోని డేటాబేస్ లో భద్రపరుస్తున్నారు.