కాంగ్రెస్​కు కలిసొచ్చినవేమిటి?

1962లో క్యూబాపై దాడి చేసేందుకు ప్రయత్నించి అమెరికా ఓడిపోయినప్పుడు ఆ దేశ అధ్యక్షుడు జాన్​ కెన్నెడీ స్పందిస్తూ.. ‘విజయానికి తండ్రులెందరో.. అపజయం మాత్రం అనాథ’ అని అన్నారు. కర్నాటక అప్రతిహత విజయానికి తామే కారణమని చెప్పుకునే నాయకులు చాలా మంది ఉంటారు. కానీ కర్నాటక ఓటమిని సొంతం చేసుకునే వారు బీజేపీ వైపు ఎవరూ ఉండరిప్పుడు. రాజకీయ విజయానికి చాలా అనుకూల అంశాలు అవసరం. కర్నాటకలో కాంగ్రెస్‌‌కు చాలా అంశాలు అనుకూలించాయి. అదే సమయంలో బీజేపీ ఓటమికి ప్రతికూల అంశాలు బాగా పనిచేశాయి. కర్నాటకలో బీజేపీ కొత్త పార్టీ కానప్పటికీ.. స్వయంకృత తప్పుల కారణంగా ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయింది. 

కర్నాటకలో1985 నుంచి ఏ ప్రభుత్వమూ వరు సగా రెండోసారి అధికారం చేపట్టింది లేదు. ఆ సంప్రదాయాన్ని కన్నడ ప్రజలు ఈసారి కొనసాగించారు. బీజేపీకి రెండోసారి అధికారం ఇవ్వకూడదని బలంగా విశ్వసించినట్లు ఫలితాలను చూస్తే అర్థమవుతున్నది. సాధారణంగా కాంగ్రెస్​ పార్టీ అంటేనే వర్గాలు, గ్రూపులు, అంతర్గత కలహాలు అనే ప్రచారం ఎక్కువ.. కానీ కన్నడనాట కాంగ్రెస్​ నాయకులు ఐక్యంగా ఒక జట్టు స్ఫూర్తితో విజయం కోసం పనిచేశారు. పార్టీ గెలుపు లక్ష్యం కోసం పనిచేయడం మానేసి సీఎం అభ్యర్థి నేనే అని ఎవరూ కొట్టుకోలేదు. ఈ విషయంలో డీకే శివకుమార్, సిద్ధరామయ్యలు ముందు రాష్ట్రంలో పార్టీ గెలుపు.. ఆ తర్వాత సీఎం సీటు అన్నట్లుగా బీజేపీపై బలంగా పనిచేశారు. ఇది కాంగ్రెస్ ​విజయావకాశాలను పెంచింది. కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం పెద్దగా జోక్యం చేసుకోలేదు. నిర్ణయాలను రాష్ట్ర నేతలకే వదిలేసింది. ఇది మంచి అభ్యర్థులను ఎంపిక చేయడంలో దోహదపడింది. ఇతర పార్టీల నేతలను రిసీవ్ చేసుకునేందుకు కాంగ్రెస్ సిద్ధపడటం కూడా కలిసొచ్చింది. బీజేపీని వీడి కాంగ్రెస్‌‌లో చేరిన మాజీ సీఎం జగదీష్ షెట్టర్, ఉప ముఖ్యమంత్రి సవాడే చేరికలు అందులో భాగమే. ఇక బీజేపీకి వ్యతిరేకంగా14 % మైనారిటీ ఓట్లు ఉన్నాయి. ఈ ఓటు కాంగ్రెస్‌‌కు టోకుగా పడినట్లు కన్పిస్తున్నది. రాష్ట్ర కాంగ్రెస్ లీడర్ డీకే శివకుమార్ కాంగ్రెస్‌‌కు వొక్కలిగ ఓటు బ్యాంకును తీసుకురాలిగారు. సాధారణంగా, వొక్కలిగలు కుమారస్వామి పార్టీకి బలంగా ఓటు వేస్తారు. అయితే ఈసారి మాత్రం శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారని కాంగ్రెస్ వొక్కలిగాలను ఒప్పించింది. బీజేపీకి లింగాయత్ ముఖ్యమంత్రులు మాత్రమే ఉంటారని మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రస్తావిస్తూ.. బీసీలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అలా బీసీ ఓటు బ్యాంకు కూడా కాంగ్రెస్‌‌ వైపునకు మళ్లింది. బీజేపీ అవినీతికి పాల్పడుతోందని, అధ్వానంగా పాలన సాగిస్తోందని కాంగ్రెస్ తీవ్రంగా చేసిన ప్రచారం పనిచేసింది. బీజేపీ ఆ దాడులను తిప్పికొట్టలేకపోయింది. 

నరేంద్ర మోడీ ప్రచారం

కర్నాటకలో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ప్రచారం చేయకుంటే బీజేపీకి ఫలితం మరీ దారుణంగా ఉండేదని స్పష్టమవుతున్నది. మోడీ ప్రచారం ప్రారంభించిన తర్వాతనే బీజేపీ కార్యకర్తలు పని ప్రారంభించారు. ఆయన దాదాపు 26 కిలోమీటర్ల రోడ్​షో నిర్వహించారు. ఒక ప్రధాని ఈ స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల కోసం పాటుపడితే.. ఫలితం ఇలా రావడం దారుణం. మోడీ నాయకత్వాన్ని ఉపయోగించుకునే రాష్ట్ర స్థాయి బీజేపీ నేతలు లేకపోవడమే కర్నాటకలో అసలు సమస్య. ఎన్నికల ఏడాది కాబట్టే కేంద్ర ప్రభుత్వం కర్నాటక అప్పర్​భద్ర ప్రాజెక్టుకు దాదాపు రూ.5 వేల కోట్లు ఇచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. కానీ దాన్ని సానుకూలంగా మార్చుకోవడంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం విజయం సాధించలేకపోయింది. 

బీజేపీ ఓటమికి కారణాలు

బీజేపీ సీనియర్​ నాయకుడు యడ్యూరప్ప ప్రజాదరణ పొందలేదనో లేదా అనారోగ్య సమస్యలను సాకుగా చూపో.. ఆయనను బీజేపీ కేంద్ర నాయకత్వం గద్దె దించింది. కానీ యడ్యూరప్ప తన స్థానంలో లింగాయత్‌‌ను తీసుకోవాలని పట్టుబట్టి బలహీన నేత అయిన బసవరాజ్ బొమ్మైని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయించారు. బొమ్మై ముఖ్యమంత్రిగా సరిగా నడపలేకపోయారు. ప్రభుత్వ పథకాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాల్లో అవినీతి, 40 శాతం కమీషన్ ​అంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను తిప్పికొట్టలేకపోయారు. ఇలా కర్నాటకలో బీజేపీ ఓటమి యడ్యూరప్ప ఇంటి వద్ద నుంచే మొదలై ఉండొచ్చు. కేవలం 300 లింగాయత్​ మఠాల మద్దతుపైనే ఆధారపడకుండా.. బీజేపీ అధిష్టానం కర్నాటకపై ఇంకొంత ఫోకస్​పెట్టి ఉండాల్సింది. రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించి ఉండాల్సింది. గ్యాస్ ​సిలిండర్​ ధరలు, ఇతర సరుకుల ధరల పెంపు తదితర అంశాలపై ప్రజలు ప్రతికూలంగా మారుతున్నారనే విషయాన్ని రాష్ట్ర బీజేపీ నాయకత్వం కూడా కేంద్ర పెద్దలకు తెలియజేయాల్సింది. నేషనల్​హైవేలు, ఎయిర్​పోర్టుల తదితర మౌలిక వసతులకు పెద్దపీట వేస్తున్న బీజేపీ ప్రభుత్వం.. బెంగళూరులో పదే పదే వరదలు ముంచెత్తడాన్ని నివారించకపోవడం బ్యాడ్​ ఇమేజ్ ను ఏర్పర్చింది. సుపరిపాలన ఇవ్వడమే సర్వోత్తమమైన అవసరం అని బీజేపీ అర్థం చేసుకోవాలి. రాజకీయాలు ఎలా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలనపై దృష్టి సారిస్తే ఎన్నికల్లో విజయం సాధించి ఉండేది. మధ్యప్రదేశ్‌‌లో శివరాజ్ సింగ్​చౌహాన్, అస్సాంలో హిమంత శర్మ, యూపీలో యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రలో ఉన్నట్లు బీజేపీకి బలమైన సీఎం వ్యక్తి కర్నాటకలో లేరు. అలాంటి రాష్ట్ర స్థాయి బలమైన బీజేపీ నేతలు తమ రాష్ట్రాలను మేనేజ్ చేస్తున్నారు. కర్నాటక బీజేపీకి నియోజకవర్గ స్థాయి నాయకులు మాత్రమే ఉన్నారు. ఈ అంశం కూడా బీజేపీని విజయానికి దూరం చేసింది.

కర్నాటకలో బీజేపీ భవిష్యత్తు

కర్నాటకలో బీజేపీకి సీట్లు తగ్గొచ్చు గానీ.. ఇది పూర్తి పతనం కాదు. 2018లో బీజేపీకి 36.4 శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఓట్​షేర్​36%కి పడిపోయింది. అంటే మొత్తంగా తగ్గినది. కేవలం 0.4 శాతం మాత్రమే. బీజేపీకి శాతంలో పెద్ద తేడా ఏమీ రానందున.. ఓటమితో కుంగిపోకుండా స్థానికంగా బలమైన నాయకులతో కూడిన టీమ్‌‌ను రూపొందించుకోవచ్చు.  2014లో పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినప్పుడు కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 2019లో మళ్లీ బీజేపీ జాతీయ ఎన్నికల్లో గెలుపొందడంతో అక్కడ దేవెగౌడ పార్టీ, కాంగ్రెస్‌‌ల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. అయితే, రెండు ఎన్నికల్లోనూ కర్నాటకలోని దాదాపు అన్ని ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే ఉన్న కర్నాటకలో గెలిచింది కాంగ్రెస్ పార్టీయేనని అర్థం చేసుకోవాలి. ఇది స్థానిక విజయం. ఇది గాంధీ కుటుంబానికి మద్దతుగా కాంగ్రెస్ భావించకూడదు. బీజేపీ తీవ్రంగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఓటమికి గల కారణాలను విస్మరించకూడదు. నరేంద్ర మోడీకి చాలా ప్రజాదరణ ఉంది. కానీ ఓట్లు దండుకోవాలంటే బీజేపీకి బలమైన రాష్ట్ర నాయకులు కావాలి. బీజేపీ ఓటమి బాధ్యతను స్వీకరించి బలహీనతలను సరిదిద్దుకోవడం ప్రారంభించాలి. పరిస్థితిని ఎంత త్వరగా చక్కదిద్దుకుంటే.. వచ్చే పార్లమెంట్ ​ఎన్నికల్లో ఆ మేరకు ఫలితాలు ఉండొచ్చు.
–డా. పెంటపాటి పుల్లారావు,పొలిటికల్​ ఎనలిస్ట్