భారతదేశంలోనే కాదు..
దీపావళి పండుగను భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో చేసుకుంటారు. ముఖ్యంగా మలేసియా, నేపాల్, శ్రీలంక, అమెరికా, ఇండోనేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ వంటి దేశాల్లోనూ దీపావళి సంబురాలు చేసుకుంటారు. నేపాల్‌లో దీపావళిని ‘తీహార్’గా జరుపుకుంటారు. ఐదు రోజులు చేసుకునే ఈ పండుగలో మొదటి రోజు గోమాతను పూజిస్తే, రెండో రోజు శునకాలను పూజిస్తారు. మూడో రోజు మిఠాయిలు తయారుచేస్తారు. నాలుగో రోజు యమధర్మరాజుని ఆరాధిస్తారు. ఐదో రోజు ‘భాయ్ దూజ్’ పండుగను జరుపుకుంటారు.
మలేసియాలో దీపావళి పండుగను ‘హరి దీపావళి’గా జరుపుకుంటారు. ఈ రోజున తెల్లవారుజామున స్నానం చేసి, పూజలు చేస్తారు. తర్వాత దీపావళి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఇంగ్లాండులో హిందువులు, జైనులు, సిక్కు సంఘాలు తమ ఇళ్లను అందంగా అలంకరించి వేడుకలు చేసుకుంటారు. దీపావళి సందర్భంగా ప్రధాన రహదారులపై టపాసులు పేలుస్తారు. థాయిల్యాండ్లో ‘క్రియోంద్’ పేరిట దీపావళి వేడుకలు జరుపుకుంటారు. అరటి ఆకులతో దీపాలు తయారు చేసి, రాత్రి పూట వెలిగిస్తారు. ఆ తర్వాత దీపాలను నీళ్లలో వదిలేస్తారు. అలాగే నాణేలను కూడా నీళ్లలో వేస్తారు. గత కొన్నేళ్లుగా అమెరికా వైట్ హౌస్‌లో కూడా దీపావళి వేడుకలను జరుపుకుంటున్నారు.
పురాణంలో..
సూర్యభగవానుడికి యమధర్మరాజు, యమున సంతానం. యమునకు అన్నంటే చాలా ప్రేమ. ఆమెకి పెండ్లయి అత్తవారింటికి వెళ్లినప్పటి నుంచి తన అన్నను ఇంటికి రమ్మని చాలాసార్లు కోరింది. కానీ, యమధర్మరాజుకు తీరిక లేక చెల్లెలి దగ్గరకు వెళ్లలేదు. ఒకనాడు వీలు చూసుకుని చెల్లెలి ఇంటికి వెళ్తాడు. ఆ రోజు కార్తీక శుద్ధ విదియ. చెల్లి ఇంట అడుగుపెట్టగానే సోదరుడికి ఇష్టమైన వంటలన్నీ వండి వడ్డించింది. భోజనం చేశాక తనకెంతో ప్రేమగా భోజనం పెట్టినందుకు ‘‘వరం కోరుకోమ’’ని అంటాడు యముడు.
అందుకు యమున.. ‘‘అన్నయ్యా.. లోక కల్యాణం కోసం ఒక వరమివ్వు. కార్తీక శుద్ధ విదియనాడు సోదరి ఇంటికి వెళ్లి ఏ సోదరులైతే భోజనం చేస్తారో వాళ్ల జోలికి నువ్వు వెళ్లొద్దు. అలాంటి సోదరులకు ఆయురారోగ్యాలు ప్రసాదించు. ఇది నా కోరిక’’ అని అంటుంది. ఆ కోరిక విని సంతోషించిన యముడు ‘తథాస్తు’ అని చెల్లెల్ని దీవించి వెళ్తాడు. అలా ఈ వరం సంప్రదాయంగా మారింది. కాబట్టి దీపావళి తర్వాత వచ్చే విదియనాడు సోదరులు, సోదరి ఇంటికి వెళ్లి, ఆమె చేతి వంట తిని, బహుమతులు ఇచ్చి దీవిస్తారు.