న్యాయమూర్తులని చరిత్ర..ఎలా గుర్తు పెట్టుకుంటుంది?

న్యాయమూర్తులని చరిత్ర..ఎలా గుర్తు పెట్టుకుంటుంది?

ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్​ ఈ నెల 10న పదవీ విరమణ చేస్తున్నారు. 65 సంవత్సరాలు నిండిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రిటైర్​ కావాల్సిందే. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు.  అయితే, చంద్రచూడ్​ వారసత్వాన్ని కోరుకుంటున్నారు. తన గురించి చరిత్ర పేజీల్లో ఏం రాస్తారో అని ఆలోచిస్తున్నారంటున్నారు. ప్రధాన న్యాయమూర్తి  ఏం మాట్లాడినా అది వార్త అవుతుంది.  న్యాయమూర్తులు తమ తీర్పులు ద్వారా మాట్లాడుతారు.  కానీ, చంద్రచూడ్​ రోజూ  ఏదో ఒక మీడియాలో మాట్లాడుతూ కనిపించేవారు. ప్రతి మీడియా ఆయనను ఇంటర్వ్యూ చేయడానికి ఇష్టపడేది. ఆయన ఉదారంగా ఇంటర్వ్యూలను ఇచ్చేవాడు. 

ఏ మీడియా కూడా ప్రధాన న్యాయమూర్తి పాత్ర గురించి ఆయనను  ప్రశ్నించలేదు. ఆయనను  విమర్శనాత్మకంగా అంచనా వేయలేదు.  బెంగళూరు న్యాయసూత్రాలను ప్రధాన న్యాయమూర్తి  పూర్తిగా  విస్మరించినట్టు కనిపిస్తుంది.  బాబ్రీ మసీదు కేసును ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్​ పరిష్కరించింది. దీర్ఘకాలంగా ఉన్న వివాదానికి తుది తీర్పును వాళ్లు వెలువరించారు. ఆ తీర్పును ఎవరు రాశారో  తెలియదు. అందరూ సమష్టిగా రాసినారని అంటున్నారు.  బహుశా అలాంటి తీర్పు మొదటిది ఇదేనేమో. అయోధ్య తీర్పును ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్​ ప్రకటించినప్పటికీ అది ఎవరు 
రాశారన్నది తెలియలేదు. 

కేసుల పరిష్కారం కోసం దేవుళ్లని ప్రార్థించడం

ఈ మధ్య చంద్రచూడ్ మాటల ప్రకారం ఆ తీర్పుని ఆయనే రాశారేమో అనిపిస్తోంది. అలాంటి అవకాశం కల్పిస్తుంది. ఈ కేసు పరిష్కారం కోసం ఆయన  దేవుడిని ప్రార్థించా అని ఆయనే చెప్పారు. అయోధ్య తీర్పు ప్రాముఖ్యం ఉన్న తీర్పు.  అయితే,  న్యాయమూర్తులకు కాదు. రోజూ చెప్పే తీర్పులలో దాన్ని  ఒకటిగానే భావించాల్సి ఉంటుంది. ఈ తీర్పుని వెలువరించిన తరువాత ఆ ఐదుగురు న్యాయమూర్తులు వేడుక మాదిరిగా సంబరం చేసుకున్నారు. ఆవిధంగా చేసుకోవడం వల్ల ప్రజలకు ఎలాంటి సంకేతాలు అందుతాయి. సంబరం చేసుకోవడానికి ఏముంది అందులో?  ప్రతి తీర్పు 

న్యాయమూర్తికి  వేడుకలాంటిదే. 

బాబ్రీ మసీదు కేసు పరిష్కారం కోసం చంద్రచూడ్​ ఏ దేవుడిని ప్రార్థించాడు. ఏ దేవుడు ఆయనకు సాయం చేశాడు.  కేసుల పరిష్కారం కోసం దేవుళ్లని ప్రార్థించడమన్న విషయం ఒక నూతన ఆవిష్కరణ.  న్యాయమూర్తిగా  ప్రమాణం చేసేటప్పుడు రాజ్యాంగం ప్రకారం పనిచేస్తాను అని, తన విద్యుక్త ధర్మాలను నిర్వర్తిస్తానని చెబుతారు. ఇది ఆ ప్రమాణానికి భంగం చేసినట్టు కాదా. న్యాయదేవత కళ్లకి ఉన్న గంతలను తొలగించారు.

న్యాయదేవత రూపురేఖలను మార్చారు. అది మనువాద అవశేషమని మార్చారు. చేతిలో ఉండే ఖడ్గాన్ని తొలగించారు. ఇప్పుడు న్యాయదేవత చేతిలో రాజ్యాంగాన్ని ఉంచారు. దీనివల్ల పారదర్శకత, జవాబుదారీతనాన్ని,  రాజ్యాంగ విలువలకి  ప్రతీకగా కనిపిస్తుంది.  కానీ, కేసు పరిష్కారం కోసం దేవుడిని తాను  ప్రార్థించాను  అన్న మాటలతో ఆ స్ఫూర్తి దెబ్బతినే అవకాశం ఏర్పడింది. 

చట్టం ముందు అందరూ సమానులే

న్యాయపాలన అనేది మన రాజ్యాంగంలోని మౌలిక స్వరూపం. చట్టం ముందు అందరూ సమానులే. అందరికీ సమన్యాయం అందాలి. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా ఉండాలి. అదేవిధంగా కనిపించాలి. కానీ, పూజ కోసం ప్రధానమంత్రిని ఇంటికి చంద్రచూడ్​ ఆహ్వానించడం వల్ల ఆ భావనకి భంగం కలిగినట్టు అనిపిస్తున్నది.  న్యాయం జరగడమే కాదు. జరిగినట్టు అనిపించాలి. న్యాయపాలన జరగాలంటే ప్రజలకు సత్వర న్యాయం అందాలి. ఆ దిశగా ప్రయత్నాలు జరగాలి. ఆ విధంగా ప్రయత్నాలు జరిగినట్టుగా అనిపించడం లేదు.

నేషనల్​ జ్యుడీషియల్​ డేటా ప్రకారం అక్టోబర్​, నవంబర్​ 2022 నాడు దేశవ్యాప్తంగా పెండింగ్​లో ఉన్న కేసుల సంఖ్య 4,50, 36,071 అంటే చంద్రచూడ్​ ప్రధాన న్యాయమూర్తి పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి సంగతి. ఇప్పుడు ఆయన పదవీ విరమణ చేసేనాటికి 51మిలియన్​ కేసులు. ఇందులో1,80,000 కేసులు  30 సంవత్సరాలకి మించి పెండింగ్​లో ఉన్న కేసులు. అవి దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో పెండింగ్​లో ఉన్న కేసులు. సుప్రీంకోర్టు విషయానికి వస్తే చంద్రచూడ్​ ప్రమాణ  స్వీకారం చేసేనాటికి సుప్రీంకోర్టులో పెండింగ్​ ఉన్న కేసులు 69,647. ఇప్పుడు వాటి సంఖ్య 82, 989. ఈ  కేసుల భారానికి కారణాలు అనేకం. కేసుల సత్వర పరిష్కారానికి జరగాల్సిన కృషి జరగలేదని అనిపిస్తోంది.

చంద్రచూడ్​ వెలువరించిన తీర్పుల జోలికి నేను పోదల్చుకోలేదు. ‘కోర్టులు ఎవరికోసం ఉన్నాయి అన్న ప్రశ్న ఇంకా ప్రశ్న మాదిరిగానే ఉండిపోయింది. ‘నేను..నా నల్లకోటు’ కథల పుస్తకంలోని ‘ఎవరికోసం’ అన్న కథలో ఓ యూనివర్సిటీ విద్యార్థిని  మేజిస్ట్రేట్​గా అడిగిన ప్రశ్న, ఆ మేజిస్ట్రేట్​  ఇచ్చిన జవాబు  ఆలోచింపజేస్తాయి. 

రాత్రిపూట మేజిస్ట్రేట్​ని బెయిల్​ అడుగుతాడు. సెలవు రోజుల్లో ఆర్నాబ్​ గోస్వామికి సుప్రీంకోర్టు  బెయిల్​  మంజూరు చేయగాలేనిది  మాకు బెయిల్ఇస్తే తప్పేంటి .. మేం హత్యలాంటి ఘోరమై న నేరం చేయలేదు.  ధర్నా చేశాం. అంతే అని అంటాడు. అయినా మేజిస్ట్రేట్​ బెయిల్​ మంజూరు చేయడు. మీరేమీ అర్నాబ్​ గోస్వాములు  కాదని ఆ మేజిస్ట్రేట్​ అనుకుంటాడు. ఆర్నాబ్​ గోస్వామికి సెలవురోజుల్లో బెయిల్​ మంజూరు చేసింది చంద్రచూడే. అయితే, ఆ స్ఫూర్తి జిల్లాస్థాయి కోర్టుల వరకు చేరలేదు. అందరూ ‘ప్లే సేఫ్’​ ఆట ఆడుతున్నారు.  

ప్రమాణపత్రాన్ని మించిన పత్రం మరొకటి లేదు

న్యాయమూర్తి ఎలా ఉండాలి. అన్న ప్రశ్నకి మన రాజ్యాంగంలోని  ప్రమాణ పత్రాన్ని మించిన పత్రం మరొకటి లేదు. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పదవీ స్వీకారం చేసేముందు ఈ విధంగా ప్రమాణం చేస్తారు.. భగవంతుడి మీదగానీ, అంత
రాత్మ సాక్షిగా గానీ వాళ్లు  ప్రమాణం చేస్తారు. అందులో  ఈ అంశాలు ఉంటాయి. ‘....అనే నేను భారత రాజ్యాంగం ఎడల నిజమైన విశ్వాసాన్ని, భక్తిని కలిగి ఉంటానని,  దేశ సార్వభౌమత్వాన్ని, సమైక్యతను కాపాడతాను అని , నిజంగా విధేయంగా ఎటువంటి భయంగానీ, పక్షపాతం గానీ, స్వార్థ చింతన లేకుండా అత్యంత విశ్వాసపాత్రంగా,  న్యాయంగా  తన విధులు నిర్వర్తిస్తాను అని, రాజ్యాంగాన్ని , చట్టాన్ని పరిరక్షి స్తాను’ అని ఉంటుంది ప్రమాణం. 

రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించాలి

ప్రమాణంలో న్యాయమూర్తుల నడవడికకు సంబంధించిన అంశాలు అన్నీ ఉన్నాయి. రాజ్యాంగ స్ఫూర్తిని, రాజ్యంగ విలువలని చాలా జాగరూకతతో పరిరక్షించాల్సిన బాధ్యత న్యాయమూర్తి మీద ఉంటుంది. న్యాయవ్యవస్థకి స్వతంత్రత అనే భావన చాలా ఉత్తమమైనది. ప్రజాస్వామ్య రాజకీయాలకు  అది పునాది వంటిది.  న్యాయపాలన అన్న సూత్రం ప్రకారం పాలన జరగాలని రాజ్యాంగం నిర్దేశిస్తుంది.  ఆ బాధ్యతని  ఈ ప్రమాణం  ద్వారా  న్యాయమూర్తులపై  రాజ్యాంగం ఏర్పరిచింది.  

న్యాయసమీక్ష     కూడా   అందులోని  ఓ అంశం. ‘రాజ్యం’ దాని అధికారులు చేసే ఉల్లంఘన  నుంచి,  అధికార దుర్వినియోగం గురించి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన  బాధ్యత   న్యాయవ్యవస్థపై  ఉంది.(ఎస్​పీ గుప్తా వర్సెస్​ యూనియన్​ ఆఫ్​ ఇండియా) 
న్యాయమూర్తి తీసుకునే ప్రమాణంలోని ప్రతి పదం,   ప్రతి అభివ్యక్తిలో ఓ బలమైన సందేశం ఉంది.  మామూలు కళ్లను దాటి చూస్తే అందులోని నిగూఢమైన అర్థాలు కనిపిస్తాయని జస్టిస్​ లహోటీ అన్నారు.

స్థానాన్ని చరిత్ర ఇస్తుంది 

భగవంతునిపైగానీ, మనస్సాక్షిపైగానీ న్యాయమూర్తి ప్రమాణం చేయవచ్చని అనడంలో లౌకిక స్వభావం ఉన్నది. న్యాయ మూర్తికి రాజ్యాంగం పట్ల మామూలు విశ్వాసం, భక్తి కాదు.  అది నిజమైన విశ్వాసం, భక్తి కలిగి ఉండాలి. రాజ్యాంగ సూత్రాలకి, విలువలకి, న్యాయమూర్తి పూర్తిగా బద్ధుడై ఉండాలని ప్రమాణం కోరుతుంది.

న్యాయమూర్తి విధులు పవిత్రమైనవి, అందుకే వాటి ప్రమాణంలో చెప్పినట్టు అత్యంత విశ్వాసపాత్రంగా, శక్తిమేరకు న్యాయంగా తన విధులను  న్యాయమూర్తి నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్​ని చరిత్ర ఈ రాజ్యాంగ ప్రమాణ పత్రం కోణంలో చూస్తుంది. ఆయన  స్వతంత్రంగా వ్యవహరిస్తే తప్పక తగు స్థానాన్ని చరిత్ర  ఇస్తుంది.

- డా. మంగారి రాజేందర్ జిల్లా జడ్జి (రిటైర్డ్​)-