ఎంత తింటున్నాం అన్నది కాదు.. ఏం తింటున్నాం అన్నదే ముఖ్యం. అది సరే కానీ, అసలు తినాలంటే పళ్లు సహకరించాలిగా..అవి హెల్దీగా లేకపోతే అసలుకే ఎసరొస్తుంది. అందుకే డెంటల్ కేర్ తప్పనిసరి అంటోంది సెలబ్రిటి కాస్మొటిక్ డెంటిస్ట్ రిద్ధి కటారా. డెంటల్ హెల్త్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని కూడా చెప్తున్నారామె. నీళ్లు చర్మాన్నే కాదు పళ్లని కూడా హెల్దీగా ఉంచుతాయి. అదెలాగంటే.. ఫుడ్ పార్టికల్స్ పళ్లలో ఇరుక్కుపోవడం వల్ల పళ్ల ఎనామిల్ దెబ్బతింటుంది. అలా కాకూడదంటే గంట గంటన్నరకోసారి నీళ్లు తాగాలి. దాంతో పళ్ల మధ్య ఇరుక్కున ఆ పార్టికల్స్ అన్నీ పోతాయి. ఫుడ్ ద్వారా పళ్లపై పేరుకుపోయిన షుగర్, యాసిడ్స్ కూడా పోతాయి. దానివల్ల చెడు బ్యాక్టీరియా చిగుళ్ల దరిచేరదు.
డైరీ ప్రొడక్ట్స్‌లో హైడ్రాక్సీఎపటైట్ అనే మినరల్ ఉంటుంది. ఇది పళ్ల ఎనామిల్‌ని స్ట్రాంగ్‌గా ఉంచుతుంది. పాలలోని క్యాల్షియం కూడా దంతాలకి బలాన్నిస్తుంది. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండే బచ్చలి కూర, పాలకూర, రాకెట్ లీవ్స్ (అరుగుల, రుకోలా) పళ్ల ఎనామిల్‌ని ప్రొటెక్ట్ చేస్తాయి. షుగర్ ఫ్రీ గమ్స్ తింటే సెలైవా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల పళ్లు ఆటోమెటిక్‌గా శుభ్రం అవుతాయి. దంతాలపై పాచి పేరుకుపోతుంటే.. ఏం తిన్నా, తాగినా యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది. దాంతో పళ్ల ఎనామిల్ దెబ్బతింటుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే క్రాన్బెర్రీ జ్యూస్ తాగాలి. ఇది 95 శాతం పాచిని పోగొడుతుంది.