దవాఖాన్ల సౌలతులు ఎట్లున్నయ్​?.. పేషెంట్లను అడిగి తెలుసుకున్న మంత్రి

జగిత్యాల, వెలుగు :  ‘‘అమ్మా.. అన్నం పెడుతుండ్లా.. ఎట్లున్నాయ్.. నర్సమ్మలు మంచిగా మాట్లాడుతుండ్లా..? సౌలతులెట్ల ఉన్నయి”అని హెల్త్ మినిస్టర్ హరీశ్​ రావు  పేషెంట్లను ఆరా తీశారు.   జగిత్యాల  జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ  ఎల్.రమణ తండ్రి ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని హరీశ్​ రావు శనివారం పరామర్శించారు.  తర్వాత ఎంసీహెచ్ లో సడెన్ విజిట్ చేశారు.  ప్రతీ వార్డు తిరిగి మందులు సక్రమంగా అందుతున్నాయా,  ట్రీట్​మెంట్​ బాగుంటున్నదా లేదా అనే వివరాలను పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు.   ప్రభుత్వమే అన్ని రకాల మందులతో పాటు టెస్టులను కూడా చేస్తుందని బయట ప్రైవేట్ లో చేయించుకోవద్దని సూచించారు. అనంతరం డాక్టర్ల అటెండెన్స్​ రిజిస్టర్​ తనిఖీ చేసి సూపరింటెండెంట్, డాక్టర్ల తో కలిసి రివ్యూ చేశారు. డ్యూటీ టైంలో లేని డాక్టర్లపై తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్, సూపరింటెండెంట్​ను ఆదేశించారు. 

సూపరింటెండెంట్ ​రాములుపై సీరియస్

ఎంసీహెచ్ చుట్టూ చెత్త చెదారం ఉండడంతో హెల్డ్ డిపార్ట్​మెంట్​ సిబ్బంది పై  మంత్రి హరీశ్​ రావు సీరియస్​అయ్యారు. డ్యూటీ టైంలో సూపరింటెండెంట్​రాములు స్థానికంగా లేకపోవడంతో ఆగ్రహించిన ఆయన వెంటనే రావాలని ఆదేశాలు జారీ చేశారు.  దీంతో గంటన్నరలో ఎంసీహెచ్​కు చేరుకున్నారు. డ్యూటీ చేయాలని లేకపోతే మానుకోవాలని సూచించారు. గతంలో జరిగిన బాలింతల మరణాలు, కడుపు క్లాత్ మరిచిన ఘటనపై ప్రశ్నించేందుకు ప్రయత్నించగా, సమస్యలన్నీ తమ దృష్టి లో ఉన్నాయని మాట్లాడకుండానే వెళ్లిపోయారు. 

​ సూపరింటెండెంట్​ , డాక్టర్లకు  నోటీసులు

జగిత్యాల జిల్లా హాస్పిటల్ ​సూపరింటెండెంట్ ​రాములుకు డీఎంఈ నోటీస్​ జారీ చేశారు.  శనివారం ఎంసీహెచ్ లో హెల్త్ మినిస్టర్ హరీశ్‌‌‌‌రావు తనిఖీ  చేసిన సందర్భంగా సూపరింటెండెంట్ ​రాములు ఉదయం దాదాపు 9.40 నిమిషాలకు డ్యూటీకి వచ్చినట్లు రికార్డుల్లో నమోదైందని, మినిస్టర్ వచ్చినప్పుడు లేకపోవడంతో ఆయనకు సంజాయిషీ ఇవ్వాలని నోటీస్‌‌‌‌లో పేర్కొన్నారు. అలాగే ప్రొఫెసర్​ఆఫ్ ఓబీజీ అరుణ శ్రీ లీవ్ పెట్టకుండా అందుబాటులో లేకపోవడం, ఆప్తాల్మజీ డాక్టర్ సుజాత, పీడీయాట్రిక్ ప్రొఫెసర్ స్నేహలత, డాక్టర్ ఆజాం అందుబాటులో లేకపోవడంపై డీఎంఈ నోటీసులు జారీ చేసి 18 లోపు సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు.