ఖాళీ కుర్చీలతో ఎట్ల పనులైతయ్..?

రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా పని చేయాలంటే పటిష్టమైన యంత్రాంగం అవసరం. సమర్థులైన సిబ్బంది ఉన్నప్పుడే ఆశించిన లక్ష్యాలు నెరవేరుతాయి. అభివృద్ధి సక్రమంగా జరుగుతుంది. డైరెక్ట్ రిక్రూట్​మెంట్​తో యంగ్ ఆఫీసర్లు, నిజాయతీ పరులైన సిబ్బంది వస్తే వారంతా రాష్ట్రాభివృద్ధి కోసం కసిగా పని చేస్తారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలు పక్కాగా అమలవుతాయి. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆరేండ్లలో భారీ సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నా రిక్రూట్​మెంట్స్​ జరగలేదు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంటికో ఉద్యోగం ఇస్తామని పదే పదే చెప్పిన టీఆర్ఎస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటే మర్చిపోయింది. లక్షలాది పోస్టులు ఖాళీగా ఉన్నా వాటి భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన పాపాన పోలేదు. ఉద్యోగాల భర్తీ అనే అంశం కేవలం ఉపాధి కోణంలోనే చూడాల్సిన విషయం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను అమలు చేసే ఎగ్జిక్యూటివ్ విభాగంలో ప్రతి ఒక్క ఉద్యోగి కీలకమే. ప్రభుత్వ యంత్రాంగం సమర్థంగా పని చేసినప్పుడే అభివృద్ధి, సంక్షేమ పథకాలు అట్టడుగు ప్రజల వరకూ చేరుతాయి.

కానీ, ప్రభుత్వ శాఖల్లో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే పాలన దెబ్బతిని, ప్రజల అవసరాలు తీర్చలేని పరిస్థితి వస్తుంది. మరోవైపు తెలంగాణ ఉద్యమంలో మన నియామకాలు మనకే అన్న నినాదం చాలా కీలకంగా పని చేసింది. కానీ వందల మంది యువకుల ఆత్మబలిదానాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో ఆ పోరాటాల ఆశయం నెరవేరలేదు. రాష్ట్రం ఏర్పడి ఆరున్నరేండ్లయినా నేటికీ ఇంటికో ఉద్యోగం కాదు.. ఊరికో ఉద్యోగం కూడా టీఆర్ఎస్ సర్కారు ఇయ్యలేదు. ఉన్న ఉద్యోగాలు కూడా ఊడినయ్. రాష్ట్రంలో 7600 మంది గ్రామీణ ఉపాధి హామీ స్కీమ్ ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేశారు. కాంట్రాక్టు ఉద్యోగాలు చేస్తున్న వేల మందిని తొలగించారు. పైగా రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలను ప్రశ్నిస్తూ.. హక్కుల కోసం పోరాడితే అణచేస్తున్నారు.

పాలనా సౌలభ్యం.. ఉద్యోగులు లేకుండానా?

రాష్ట్రం ఏర్పడే సమయానికే పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి. దీనికి అదనంగా ఏటా వేల సంఖ్యలో ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. అటు ముందు నుంచి ఖాళీగా ఉన్న పోస్టుల్నీ భర్తీ చేయక.. కొత్తగా రిటైర్ అవుతున్న వారి స్థానంలోనూ రిక్రూట్మెంట్స్ లేక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆఫీసులు ఖాళీ కుర్చీలతో కనిపిస్తున్నాయి. ప్రజల పనులు జరగడం లేదు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో జాప్యం జరుగుతోంది. ఆఫీసుల్లో 10 మంది  సిబ్బంది ఉండాల్సిన చోట నలుగురితో పని సాగదీస్తున్నారు. సచివాలయం, జిల్లా ఆఫీసుల్లో ఏ శాఖకు వెళ్లినా గ్రూప్–1, గ్రూప్–2 అధికారులు లేక ఫైళ్లు  కుప్పలుపడిపోతున్నాయి. ప్రభుత్వ ఆఫీసుల్లో జూనియర్ అసిస్టెంట్స్, సీనియర్ అసిస్టెంట్స్ స్థాయి పోస్టులు కూడా వేలల్లో ఖాళీగా ఉన్నాయి.

రాష్ట్రంలో పాత పది జిల్లాలను పరిపాలనా సౌలభ్యం పేరుతో 33 జిల్లాలుగా విభజించారు. దీంతో 23 కొత్త జిల్లాల్లోని 40 ప్రభుత్వ శాఖల ఆఫీసులు, 131 మండలాలు, 30 రెవెన్యూ డివిజన్లు, 76 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 4383 గ్రామ పంచాయితీలు, 103 కొత్త పొలీస్ స్టేషన్లు, 25 పొలీస్ డివిజన్లు, 31 పొలీస్ సర్కిల్స్, 7 పొలీస్ కమిషనరేట్స్ ఏర్పాటు వల్ల గ్రూప్-–1, గ్రూప్–-2 సర్వీస్ ఉద్యోగుల అవసరం పెరిగింది. అలాగే క్లర్కులు, సూపరింటెండెంట్లు తదితర 40 వేల కొత్త ఉద్యోగాలు ఏర్పడ్డాయి. వీటితో పాటు గతంలో ఖాళీగా ఉన్న పోస్టులు కలుపుకొంటే రాష్ట్రంలో మొత్తం 2 లక్షల 50 వేలకు పైగా పోస్టులు ఖాళీలు ఉన్నవి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన ఆరున్నరేండ్లలో 50 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. వీటిని భర్తీ చేయకుంటే ప్రభుత్వం నిర్దేశించుకున్న పనులు సక్రమంగా సాగేదెలా? ప్రజలకు పూర్తిస్థాయిలో సరైన టైమ్ లో అందాల్సిన ఫలితాలు చేరేదెలా? అరకొర సిబ్బందితో పరిపాలనా సౌలభ్యం, పాలనా వికేంద్రీకరణ అన్న లక్ష్యాలు ఎలా నెరవేరుతాయి. కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుతోనే పాలనా వికేంద్రీకరణ జరిగిపోయిందని ప్రభుత్వం భావిస్తే ఎలా?

అన్ని సేవలూ అరకొరగానే..

రెవెన్యూ ఆఫీసుల్లో సరిపడా సిబ్బంది లేక స్టూడెంట్స్ కి అవసరమైన సమయంలో క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికెట్లు ఇచ్చే దిక్కు లేదు. కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు జరిగినా ఉద్యోగాల భర్తీ జరగకపోవడంతో కంప్యూటర్ ఆపరేటర్లు, క్లర్కులు లేక పనులు జరగడం లేదు. సర్వే డిపార్ట్ మెంట్ లో సర్వేయర్ల కొరత వల్ల రైతులు, సామాన్యులు లేనిపోని భూ తగాదాలతో కోర్టులకు వెళ్లాల్సి వస్తోంది.  వైద్య ఆరోగ్య శాఖలోనూ ఏళ్ల తరబడి ఉద్యోగాల భర్తీ లేక కరోనా మహమ్మారి సమయంలో నానా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ప్రభుత్వ హాస్పిటల్స్ లో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది లేక రోగులు ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్తున్నారు. ఇక ఎస్సీ/ఎస్టీ/బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల కింద నడిచే హాస్టళ్లలో చాలా చోట్ల వార్డెన్లు, వర్కర్లు లేరు. చదువుకోనే పిల్లలే వంట మనుషులుగా మారుతున్నారు. ఇక గురుకుల పాఠశాలలు, ఇతర ప్రభుత్వ స్కూల్స్ లో టీచర్లు, పీఈటీ మాస్టర్లు, కంప్యూటర్ టీచర్లు, ఆర్ట్, డ్రాఫ్ట్ టీచర్స్ పోస్టులు వేలల్లో ఖాళీగా ఉన్నాయి.

ఏళ్లుగా పాఠశాలలో టీచర్ పోస్టుల భర్తీ జరగక పిల్లల చదువులు అటకెక్కాయి. విద్యాప్రమాణాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, మున్సిపల్ శాఖల్లో వేలాది ఇంజనీరింగ్ పోస్టులు ఖాళీగా ఉండడంతో ప్రభుత్వ పనుల్లో నాణ్యత పరిశీలన కొరవడుతోంది. దీంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా మారి ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. ప్రభుత్వమంటే రాజకీయ నాయకులే కాదు.. వాళ్లు పూర్తి స్థాయిలో అన్ని పదవులూ ఎప్పటికప్పుడు భర్తీ చేసుకుంటే సరిపోదు.. సమర్థవంతమైన ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఉంటేనే పాలన సక్రమంగా జరుగుతుంది. దీని కోసం నోటిఫికేషన్లు ఇచ్చి రిక్రూట్మెంట్లు చేపట్టాలి. అలా చేస్తేనే ప్రజలకు అన్ని సేవలు అందుతాయని పాలకులు గుర్తించాలి.

42 ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు, యూనివర్సిటీలు, వివిధ కమిషన్లలో కలిపి రాష్ట్రంలో మొత్తం మూడు లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని పటిష్టం చేయాలనే స్పృహ పాలకులకు లేకపోతే ఎలా? నిరుద్యోగుల బతుకులను పట్టించుకోకపోతే దుబ్బాకలో వచ్చిన రిజల్టే మళ్లీ రిపీట్ అవుతుంది.

బాధ్యత ప్రభుత్వానిదే

నిరుద్యోగ సమస్య పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత. వేల కోట్ల పన్నులు వసూలు చేస్తూ, లక్షల కోట్ల రుణాలు తెస్తూ కూడా డబ్బులు లేవనే సాకుతో రిటైర్డ్ సిబ్బంది స్థానంలో -ఖాళీలు భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడటం సరికాదు. రాష్ట్రంలో ఆరేండ్లలో దాదాపు 40 వేల మందికి పైగా రిటైర్ అయ్యారు. కానీ ఖాళీలు భర్తీ చేయడం లేదు. పైగా దాదాపు 2 వేల మంది రిటైర్ అయిన వారి సర్వీస్ పొడిగించారు. కొందరు జాయింట్ కలెక్టర్లకు, చీఫ్ ఇంజనీర్లకు కూడా రాజ్యాంగ విరుద్దంగా సర్వీస్ పొడిగిస్తున్నారు. రిటైర్ అయిన వారి సర్వీస్ పొడిగిస్తే ప్రభుత్వ శాఖల్లో అవినీతి పెరిగిపోతుంది. రాజకీయ నాయకులు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకాలు పెడతారు. రిటైర్​ అయిన వాళ్ల స్థానంలో పోస్టుల భర్తీకి కొత్తగా ప్రభుత్వానికి ఖర్చు పెరిగేదేం ఉండదు. ఒకవైపు ఉద్యోగాలు లేక యువత చస్తుంటే రిటైర్ అయిన వారికి ఏళ్ల తరబడి సర్వీస్  పొడిగిస్తే నిరుద్యోగుల బతుకులు ఏం కావాలి? – ఆర్.కృష్ణయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు

for more News….

గ్రేటర్ ఫలితం తేల్చేది.. ముంపు బాధితులే

సోషల్ మీడియాలో ప్రచారానికి స్పెషల్​ ఏజెంట్లు

కరోనా టీకా ట్రాన్స్ పోర్ట్ కు విమానాలు రెడీ

V6 న్యూస్ ఛానెల్ పై దుష్ప్రచారం.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు 

మనోళ్లపై ‘స్పుత్నిక్-V’ ట్రయల్స్.. మూడ్రోజుల్లో స్టార్ట్

ఆక్స్‌‌ఫర్డ్‌‌ వ్యాక్సిన్​ కోసం పేద దేశాలు వెయిటింగ్​