పదేండ్లలో అదానీ ఆస్తి ఎట్ల పెరిగింది? : బీవీ రాఘవులు

పదేండ్లలో అదానీ ఆస్తి ఎట్ల పెరిగింది? :  బీవీ రాఘవులు

హైదరాబాద్, వెలుగు: పదేండ్లలో అదానీ ఆస్తులు రూ.60 వేల కోట్ల నుంచి రూ.16 లక్షల కోట్లకు ఎలా పెరిగాయని కేంద్రాన్ని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ప్రశ్నించారు. ఇదంతా ప్రజలను కొల్లగొట్టి సంపాదించిన ఆస్తి కాదా? అని నిలదీశారు. మోదీ ప్రధాని అయినప్పుడు దేశంలో వెయ్యి కోట్ల రూపాయల ఆస్తి ఉన్నోళ్లు 221 మంది ఉంటే.. వారి సంఖ్య ఇప్పుడు 2,500కు పెరిగిందన్నారు. బుధవారం హైదరాబాద్​లోని ఎంబీ భవన్​లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎస్.వీరయ్య అధ్యక్షతన మే డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీవీ రాఘవులు పార్టీ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. కార్మికులు, ప్రజల ఆస్తిని కేంద్రం సంపన్నులకు కట్టబెట్టిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని, ఫెడరలిజాన్ని, సామాజిక న్యాయాన్ని ధ్వంసం చేసేందుకు బీజేపీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. మోదీ సర్కార్ విధానాలపై అలుపెరగని పోరాటాలు చేసి నల్ల చట్టాలను అడ్డుకోవడంలో రైతులు విజయం సాధించారన్నారు. దేశంలో దోపిడీ తీవ్రత పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు నాగయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు సారంపల్లి మల్లారెడ్డి, వెంకట్, తదితరులు పాల్గొన్నారు.

మత రాజకీయాలు దేశానికి ప్రమాదకరం

ముషీరాబాద్: సీఏఏ పేరుతో మైనార్టీలకు పౌరసత్వ హక్కులను నిరాకరించేందుకు కేంద్రంలోని బీజేపీ కుట్ర చేస్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. మత రాజకీయాలు దేశానికి ప్రమాదకరమన్నారు. దేశంలోని 28 సెక్యులర్ పార్టీలు ఒకే వేదిక మీదికి వచ్చి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయని, బీజేపీని ఓడించి.. కూటమికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్​కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ ను గెలిపించాలని కోరుతూ బుధవారం గోల్కొండ చౌరస్తాలోని సీపీఎం సిటీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ స్థాయికి తగ్గట్లు వ్యవరించట్లేదన్నారు. దశాబ్దాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్​మహిళల మంగళ సూత్రాలు లాగేసుకుందా అని ప్రశ్నించారు. మంగళసూత్రంపై మోదీకి ఏమైనా అవగాహన ఉందా అని ఎద్దేవా చేశారు. దానం నాగేందర్ ను గెలిపించేందుకు సీపీఎం కృషి చేస్తుందన్నారు. సమావేశంలో దానం నాగేందర్, ఎం.శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ఎం.అరవింద్ కుమార్, దశరథ్, పీఎస్ఎన్ మూర్తి, డీజీ నరసింహరావు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.