వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్ అనగానే ఆస్ట్రేలియాకు ఎక్కడ లేని పూనకం వస్తుంది. ద్వైపాక్షిక సిరీస్ లు ఎలా ఆడినా వరల్డ్ లో తమలోని మరో కోణాన్ని చూపిస్తారు. ఐసీసీ ట్రోఫీలంటే ఈజీగా గెలిచే ఆస్ట్రేలియా మరో ట్రోఫీపై కన్నేసింది. ఇందులో భాగంగా టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ చేరడానికి సోమవారం (జూన్ 24) భారత్ తో కీలక మ్యాచ్ కు సిద్ధమైంది. గ్రాస్ ఐలెట్ లోని డారెన్ సామీ నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.ఈ మ్యాచ్ ఆస్ట్రేలియాకు కీలకంగా మారింది.
సెమీస్ కు వెళ్లాలంటే ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఖచ్చితంగా గెలిచి తీరాలి. అయితే భారత్ పై జరగనున్న ఈ మ్యాచ్ లో ఆసీస్ ఓడిపోవాలని నాలుగు జట్లు కోరుకుంటున్నాయి. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఇదే గ్రూప్ లో ఉన్నాయి. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓడిపోతేనే ఈ రెండు జట్లకు ఛాన్స్ ఉంటుంది. లేకపోతే సెమీస్ రేస్ నుంచి నిష్క్రమిస్తాయి. ఆస్ట్రేలియా గెలిస్తే బంగ్లాదేశ్ అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ కు ఛాన్స్ ఉన్నా భారీ తేడాతో తమ చివరి మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను ఓడించాల్సి ఉంటుంది. అదే ఈ రోజు ఆస్ట్రేలియా ఓడిపోతే ఈ రెండు జట్ల సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.
ఇప్పటికే సెమీస్ కు చేరిన సౌతాఫ్రికా తమ ప్రత్యర్థి కోసం ఎదురు చూస్తూ ఉంది. భారత్, ఇంగ్లాండ్ ఒక సెమీ ఫైనల్ దాదాపు ఖరారైంది. మరో సెమీ ఫైనల్ కోసం సౌతాఫ్రికా బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా లలో ఒక జట్టుతో ఆడాల్సి ఉంది. వీటిలో ఆస్ట్రేలియా బలమైన జట్టు కాబట్టి ఆసీస్ సెమీస్ కు రాకుండా ఉండాలంటే ఈ మ్యాచ్ లో భారత్ గెలవాలని కోరుకుంటుంది. ఆసీస్ ఓడిపోవాలని కోరుకునే జట్లలో మరో జట్టు ఇంగ్లాండ్. భారత్ పై సెమీ ఫైనల్ గెలిస్తే ఫైనల్లో ఆస్ట్రేలియా లాంటి అగ్రశ్రేణి జట్టును ఓడించాలంటే కష్టం. ఈ కారణంగానే ఇంగ్లాండ్ ఫ్యాన్స్, ఆ దేశ క్రికెట్ ఆస్ట్రేలియాపై భారత్ గెలవాలని సపోర్ట్ చేస్తున్నారు.