న్యూఢిల్లీ: ఇండియన్ ఆర్మీకి చెందిన సైనికులు మోటార్ సైకిళ్లతో స్టంట్స్ చేసి మూడు గిన్నిస్ వరల్డ్ రికార్డులు నెలకొల్పారు. టోర్నడోలు అని పిలిచే ఆర్మీ సర్వీస్ కార్ప్స్ మోటార్ సైకిల్ డిస్ ప్లే టీమ్ (ఎఎస్ సీ) డిసెంబర్ 10న ఈ స్టంట్స్ చేసి అరుదైన రికార్డు సృష్టించింది. ఆర్మీ సర్వీస్ కార్ప్స్–264వ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైనికులుఈ విన్యాసాలు చేపట్టారు. సుబేదార్ ఎస్ ఎస్. ప్రదీప్ లాంగెస్ట్ బ్యాక్ వర్డ్ మోటార్ సైకిల్ రైడ్ పూర్తి చేసి చరిత్ర సృష్టించారు.
రైడ్లో భాగంగా 361.6 కిమీ దూరాన్ని ఆయన కవర్ చేశారు. గతంలో 306 కిమీ దూరాన్ని కవర్ చేసి స్వీడన్ కు చెందిన మాగ్నస్ కార్ల్ సన్ పేరిట ఉన్న రికార్డును ఆయన బద్దలుగొట్టారు. హవల్దార్ మనీశ్ 2.3కిమీ ప్రయాణించి లాంగెస్ట్ హ్యాండ్స్ ఫ్రీ మోటార్ సైకిల్ వీలీగా ప్రపంచ రికార్డు సాధించారు. సిపాయి సుమిత్ తోమర్1,715.4 మీటర్లు ప్రయాణించి లాంగెస్ట్ నో హ్యాండ్ వీలీగా కొత్త రికార్డు సృష్టించారు.