సంపన్న ఇమిగ్రెంట్లకు ట్రంప్ గోల్డ్ కార్డు

సంపన్న ఇమిగ్రెంట్లకు ట్రంప్ గోల్డ్ కార్డు
  • రూ. 44 కోట్లు పెట్టుబడి పెడితే అమెరికా సిటిజన్ షిప్ 
  • ప్రస్తుతం ఉన్న ఈబీ5 ఇన్వెస్టర్ వీసాలు రద్దు
  • రెండు వారాల్లోనే కొత్త గోల్డ్ కార్డ్  స్కీం అమలవుతుందన్న ట్రంప్

వాషింగ్టన్ డీసీ:అమెరికాలో సెటిల్ అవ్వాలనుకునే సంపన్నులకు యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ‘గోల్డెన్’ ఆఫర్ ప్రకటించారు. యూఎస్​లోని కంపెనీల్లో 5 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 44 కోట్లు) పెట్టుబడి పెడితే గోల్డ్ కార్డ్ వీసాలు జారీ చేస్తామని, వాటితో యూఎస్ సిటిజన్​షిప్ లభిస్తుందని వెల్లడించారు. మంగళవారం వైట్​హౌస్​లో ట్రంప్ ఈ కొత్త స్కీమ్​కు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్​పై సంతకం చేశారు. 

అనంతరం అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్​తో కలిసి మీడియాతో మాట్లాడారు.  విదేశీ పెట్టుబడిదారులకు అమెరికాలో 35 ఏండ్లుగా ఇస్తున్న ఈబీ–5 ఇన్వెస్టర్ వీసాల స్థానంలో కొత్త గోల్డ్ కార్డ్ స్కీంను తీసుకొచ్చామని, రెండు వారాల్లోనే ఇది అమలులోకి వస్తుందన్నారు. ‘‘గోల్డ్ కార్డ్ స్కీం కింద అమెరికాలో పెట్టుబడులు పెట్టేవారు మరింత సంపన్నులు అవుతారు. మరిన్ని విజయాలు సాధిస్తారు. 

వాళ్లు పెద్ద మొత్తంలో డబ్బును ఖర్చు చేస్తారు. భారీగా ట్యాక్స్ లు కడతారు. ఎంతో మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. ఈ స్కీం బాగా సక్సెస్ అవుతుందని మేం భావిస్తున్నాం” అని ట్రంప్ చెప్పారు. ఈ గోల్డ్ కార్డుల జారీకి కాంగ్రెస్ ఆమోదం కూడా అవసరం లేదన్నారు. 

35 ఏండ్ల నాటి ఈబీ–5 వీసాలు రద్దు.. 

అమెరికాలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు యూఎస్ కాంగ్రెస్ 1990లో ఈబీ–5 వీసా స్కీంను ప్రవేశపెట్టింది. అమెరికాలో కనీసం 10 మంది ఉద్యోగులు ఉన్న ఏదైనా ఒక కంపెనీలో10 లక్షల డాలర్లు (సుమారు రూ. 9 కోట్లు) పెట్టుబడి పెట్టే విదేశీయులకు ఈ వీసాలను జారీ చేస్తున్నారు. అయితే, ఈబీ–5 వీసా ప్రోగ్రాం అర్థంపర్థం లేని విధంగా ఉందని హోవార్డ్ లుట్నిక్ అన్నారు. 

ఈ స్కీంను వాడుకుని, అమెరికా పౌరసత్వం పొందడం కోసం మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. అతితక్కువ ఖర్చుతో యూఎస్ సిటిజన్ షిప్ పొందేందుకు ఇదొక సులభమైన మార్గంలా మారిందన్నారు. అందుకే తాము ఈ వీసాలను రద్దు చేసి, కొత్తగా గోల్డ్ కార్డ్ వీసాలను తెస్తున్నామన్నారు. కాగా, అమెరికాతోపాటు యూకే, స్పెయిన్, గ్రీస్, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ సహా సుమారు 100కు పైగా దేశాలు ఇన్వెస్టర్ వీసాలను ఇస్తున్నాయి.