పోస్టులన్నీ ఖాళీగుంటే విద్యలో నాణ్యత ఎట్ల సాధ్యం?

రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల పర్యవేక్షణ అటకెక్కింది. దీంతో విద్యా ప్రమాణాలు బాగా దెబ్బతిన్నాయి. 8వ తరగతి విద్యార్థి 3వ తరగతి తెలుగు పాఠం చదవలేని దుస్థితి దాపురించింది. స్టూడెంట్స్​ కూడికలు, తీసివేతలు కూడా చేయలేని స్థితిలో విద్యా ప్రమాణాలు ఉన్నాయని అనేక సర్వేలు చెబుతున్నాయి. డీఈవో, డిప్యూటీ ఈవో, ఎంఈవో లాంటి పర్యవేక్షణ అధికారుల పోస్టులు ఖాళీగా ఉండటం, ట్రాన్స్​ఫర్లు, ప్రమోషన్లు సహా వివిధ సమస్యలతో టీచర్లు సతమతమవుతుండటం విద్యా ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రభుత్వం వెంటనే వాటిని పరిష్కరించి పాఠశాల విద్యా వ్యవస్థను పట్టిష్టం చేయాల్సిన అవసరం ఉంది. 

తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యా వ్యవస్థను పటిష్టం చేసే చర్యల్లో భాగంగా ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమం చేపట్టింది. ఇందుకు 9,123 పాఠశాలల్లో రూ. 7,239 కోట్లు ఖర్చు చేయడానికి12 అంశాలను రూపొందించింది. రాష్ట్రంలో 26,067 బడులు ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్​ల ఆధీనంలో ఉండగా, 976 గురుకులాలు సంక్షేమ శాఖల నిర్వహణలో ఉన్నాయి. వీటితోపాటు194 ఆదర్శ పాఠశాలలు, బాలికల కోసం 475 కేజీబీవీలను విద్యాశాఖ నిర్వహిస్తోంది. ఇవి కాకుండా గిరిజన సంక్షేమ శాఖ నిర్వహించే 1,774 స్కూళ్లు కూడా ఉన్నాయి. సుమారు 30 వేల పాఠశాలలు ప్రభుత్వ నిర్వహణలో ఉండగా కేవలం 9,123 బడులనే ఎంపిక చేయడం సరికాదు. వచ్చే అకడమిక్ ​ఇయర్​ నుంచి అన్ని పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంలో బోధన ప్రారంభిస్తున్న నేపథ్యంలో అందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. ప్రాథమిక స్థాయి నుంచి పరిపాలన, పర్యవేక్షణ, బోధనా ప్రక్రియ సక్రమంగా అమలు జరిగేలా పటిష్ట వ్యవస్థను రూపొందించే ఆలోచన, కార్యాచరణ జరగాలి. ప్రస్తుతం అన్ని జిల్లాలకు డీఈవో పోస్టులు లేవు. 10 జిల్లాలను 33 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించిన పరిస్థితుల్లో జిల్లాకో డీఈవో పోస్టు మంజూరు కావాలి. జోన్లు, మల్టీ జోన్లు పెరగడంతో సిబ్బంది పరిపాలనా వ్యవహారాల కోసం ప్రాంతీయ అధికారుల పోస్టులు మంజూరు చేయాల్సి ఉంది. 

ఎంఈవోలు ఏరి?

రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల పర్యవేక్షణ అటకెక్కింది. ప్రైమరీ స్కూళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, ఉపాధ్యాయులు తరగతి గదిలో బోధించే ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి, మూల్యాంకనం చేసే బాధ్యత మండల విద్యాధికారిది. కానీ అలాంటి కీలక పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. 590 మండలాలకుగానూ 528 ఎంఈవో పోస్టులు మంజూరు కాగా, ప్రస్తుతం 20 మంది మాత్రమే పని చేస్తున్నారు. అంటే 570 మండలాలకు పూర్తిస్థాయి ఎంఈవోలు  లేక పర్యవేక్షణ లోపించి ప్రాథమిక విద్యాపాలన గాడితప్పింది. ఈ 20 మంది ఎంఈవోలకు ఇంకో మూడు నాలుగు మండలాలు అదనపు బాధ్యతలతో రెగ్యులర్ కార్యక్రమాలు నిలిచిపోతున్నాయి. ప్రధానోపాధ్యాయుల పోస్టులు సగం ఖాళీలే.  570 మండలాలకు ఎంఈవో పోస్టులు ఖాళీగా ఉండటంతో హెచ్ఎంలకు అదనపు ఇన్​చార్జి బాధ్యతలివ్వడంతో అటు తన హైస్కూలు నిర్వహణ, ఇటు మండల విద్యాశాఖ బాధ్యతలు నిర్వర్తించలేక దేనికీ సరైన న్యాయం చేయలేకపోతున్నారు. ప్రతి డివిజన్ లో డిప్యూటి విద్యాధికారి ఉన్నత పాఠశాలల్లో బోధనను పర్యవేక్షిస్తారు. రాష్ట్రంలో 66 డివిజన్లకు గానూ 60 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. గతంలో డివిజన్ స్థాయిలో సుమారు 50 నుంచి100 వరకు ఉన్నత పాఠశాలలుండేవి. ఇప్పుడవి 200 వరకు పెరిగాయి. పెరిగిన బడులకు అనుగుణంగా150 విద్యా డివిజన్లు ఏర్పాటు చేసి డివిజనల్ విద్యాధికారిగా కొత్తగా పోస్టులను మంజూరు చేయాల్సి ఉంది. 

ప్రమోషన్లు ఇస్తే మేలు

ప్రస్తుత వ్యవస్థలో సెకండరీ గ్రేడు టీచర్​గా సర్వీసులో చేరితే రిటైరయ్యే వరకు అతి కష్టంగా స్కూలు అసిస్టెంట్ గా పదోన్నతి పొందే అవకాశం ఉంది. సర్వీసు నిబంధనలు రూపొందించి అవకాశాలు కల్పించి పాలనాధికారుల పోస్టుల వరకు పదోన్నతులు వచ్చే విధంగా విద్యా వ్యవస్థను మార్చాలి. అంతే కాకుండా ఉపాధ్యాయులకు గతంలో జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు ఇచ్చే విధంగా జీవో 302 ఉండేది. సుమారు 40 శాతం ఖాళీ పోస్టులకు ఉపాధ్యాయులకు పదోన్నతుల అర్హతలు ఉండేవి. విద్యాశాఖలో సర్వీసు రూల్స్ వివాదంతో ఆ విధానం ఆగిపోయింది. వందలాది జూనియర్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ల కొరతతో స్టూడెంట్లకు తీవ్ర నష్టం జరుగుతోంది. డైట్, బీఈడీ కాలేజీల్లో అధ్యాపకులుగా పదోన్నతులు ఇవ్వడం ద్వారా ఉపాధ్యాయ విద్యా శిక్షణా కాలేజీల్లో బోధనను పటిష్టం చేయాల్సి ఉంది. ప్రస్తుతం డైట్, బీఈడీ కాలేజీల్లో సుమారు 400 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శిక్షణ ఇచ్చే అధ్యాపకులే లేనప్పుడు సరైన టీచర్లు ఎలా బయటకు రాగలరు. విద్యాహక్కు చట్టం ప్రకారం రాష్ట్ర విద్యా శిక్షణ పరిశోధనా సంస్థ(ఎస్​సీఈఆర్టీ) అకడమిక్ అథారిటీగా రాష్ట్ర స్థాయిలో అకడమిక్ కార్యక్రమాలను రూపొందించి, అమలు చేయాలి. కానీ దాన్ని ఈ పదేండ్ల నుంచి పటిష్టం చేసే చర్యలు చేపట్టలేదు. ఎస్ సీఈఆర్ టీలో అంతా పదవీ విరమణ చెందిన అధికారులతో బండి నడుపుతున్నారు తప్ప ఒక లక్ష్య సాధనలో దాని నిర్వహణ లేదు. 

ఈ వేసవిలోనే చేపట్టాలె..

మొత్తం పదోన్నతుల ప్రక్రియ వేసవి సెలవుల్లో జరిగే విధంగా ప్రభుత్వం క్యార్యాచరణ రూపొందించి అమలు చేయాలి. రాష్ట్రంలో 1,758 గిరిజన పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ద్వారా 1,15,000 మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగే విధంగా ప్రణాళికలు చేపడుతున్న ప్రభుత్వం వాటిల్లోని ఖాళీల భర్తీతోపాటు, అవసరమైన మేరకు కొత్తగా సబ్జెక్ట్ టీచరు పోస్టులను మంజూరు చేసి నియామకాలు చేపట్టాలి.  కేజీబీవీల్లో మెరుగైన ఫలితాలు వస్తున్నప్పటికీ వాటిల్లో పనిచేసే టీచర్లకు తక్కువ వేతనాలు ఇస్తున్నారు. ప్రిన్సిపాల్ గా విధులు నిర్వహించే వారికి కేవలం రూ. 32,500 నెల జీతంగా చెల్లిస్తున్నారు. గురుకులాల టీచర్ల లాగే వారి విధులుంటాయి. కానీ వేతనాల్లో మాత్రం తేడా ఉంది. బోధనేతర సిబ్బంది వేతనాలు కూడా నెలకు పదివేల కంటే తక్కువే. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుండా మెరుగైన బోధనను ఆశించగలమా? విద్యా ప్రమాణాలు ఎలా పెంచగలుగుతాం? అనేక సర్వేలు విద్యార్థుల ప్రమాణాల గురించి చెప్తుంటాయి. కానీ ఉపాధ్యాయ స్థితిగతులు, వారు పనిచేసే పరిస్థితులు, వేతనాలు, పదోన్నతుల గురించి ఏ సర్వేలు ఉండవు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, అవర్లీ టీచర్లనందరినీ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలి. పాఠశాల విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తూ మెరుగైన బోధనాభ్యసన వాతావరణాన్ని సృష్టించే విధంగా, ఉపాధ్యాయులు మానసిక ప్రశాంతతతో ఉత్సాహంగా బోధన జరిపే చర్యలు తీసుకోవాలి.

వివిధ కమిటీలు ఏం చెప్పాయి?

ఉపాధ్యాయులుగా సర్వీసులో చేరిన వారికి పదోన్నతి విధానాలు రూపొందించి, అమలు చేసినప్పుడే, ప్రతిభావంతులైన యువత ఉపాధ్యాయ వృత్తిలోకి వస్తుంది. అటువంటి వారి బోధనతో మెరికల్లాంటి విద్యార్థులు తయారవుతారు. వారే భావి తెలంగాణ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారు.1964-66లో కొఠారి కమిషన్ ఇదే విషయాన్ని చెప్పింది. విద్యారంగాన్ని కామన్ స్కూలు పద్ధతిలో నిర్వహిస్తూ, ఉపాధ్యాయులకు మంచి వేతన సదుపాయాలు, మెరుగైన పదోన్నతులు వచ్చేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని పేర్కొంది. 1992 లో సుందరేషన్ ఏకసభ్య కమిటీ కూడా రాష్ట్రంలో విద్యాపాలనాధికారుల్లో విద్యార్థులతో ప్రత్యక్షంగా సంబంధం ఉండే డీఈవో, డిప్యూటీ ఈవో, ఎంఈవో లాంటి పోస్టులకు ఉపాధ్యాయులనే అర్హులుగా చేసే విధంగా సర్వీసు రూల్స్ రూపొందించాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- కె. వేణుగోపాల్​, 
టీపీటీఎఫ్​ సీనియర్​ లీడర్​