సరితను కో ఆర్డినేటర్ గా ఎట్ల నియమిస్తారు?.. హైకమాండ్​కు సీనియర్ల కంప్లైంట్

సరితను కో ఆర్డినేటర్ గా ఎట్ల నియమిస్తారు?.. హైకమాండ్​కు సీనియర్ల కంప్లైంట్

గద్వాల, వెలుగు: జడ్పీ చైర్​పర్సన్​ సరితను ‘తరిమికొడదాం.. తిరగబడదాం’ కార్యక్రమానికి కో ఆర్డినేటర్ గా ఎట్లా నియమించారని గద్వాలకు చెందిన కాంగ్రెస్  సీనియర్లు ప్రశ్నించారు. శుక్రవారం గాంధీభవన్​లో కాంగ్రెస్  రాష్ట్ర ఇన్​చార్జి మాణిక్ రావు ఠాకూర్, పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్  మధుయాష్కి గౌడ్ తో పాటు ఇతర నేతలకు గద్వాల డీసీసీ అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి, విజయ్ కుమార్, రాజీవ్ రెడ్డి, వీరబాబు కంప్లైంట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్  టికెట్  కోసం కోట్లు ఖర్చు పెట్టామని, క్యాడర్​ను అయోమయానికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

డీసీసీ అధ్యక్షుడికి, జిల్లా కమిటీకి, క్యాడర్ కు తెలియకుండా సరితను కో ఆర్డినేటర్ గా ఎలా నియమించారని మండిపడ్డారు. పార్టీలో చేరక ముందు కాంగ్రెస్  పార్టీ లీడర్లను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేశారని పేర్కొన్నారు. కేసులతో వేధించిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్  పార్టీలో చేరిన కొత్తవారు ఏకపక్షంగా వ్యవహరిస్తూ, సీనియర్లను, క్యాడర్ ను దూరం పెడుతున్నారని తెలిపారు. ఇన్నాళ్లు కాంగ్రెస్  జెండా మోసిన వాళ్లకి ప్రాధాన్యత ఇవ్వకుండా, కొత్తగా వచ్చిన వారికి పోస్టులు ఇవ్వడంతో సీనియర్లకు ఇబ్బందికరంగా ఉందన్నారు. ఆమె నియామకాన్ని రద్దు చేసి, వేరేవారికి కో ఆర్డినేటర్​ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు.