వృద్ధురాలి హత్య.. నిందితులను పట్టించిన 'కింగ్ కోహ్లీ'

నగలు, డబ్బు కోసం ఆశపడ్డ కొందరు దుండగలు ఓ వృద్ద మహిళను హత్య చేశారు. ఈ ఘటనలో పోలీసులకు ఎటువంటి ఆధారాలు లభించకపోగా, నిందితులను పట్టుకోవడం వారికి ఓ సవాల్‌గా మారింది. ఆ సమయంలో వారికి 'కింగ్‌ కోహ్లీ' సహకరించాడు. అదెలా అన్నది ఇప్పుడు చూద్దాం... 

బెంగళూరులోని మహాలక్ష్మీపురంలో నివసించే కమలమ్మ (82) అనే వృద్ద మహిళను ముగ్గురు దుండగులు మే 27న హత్య చేశారు. ఆమె​ ఇంట్లో ఒంటిరిగా ఉండటాన్ని గమనించిన అంజనా మూర్తి, అశోక్‌, సిద్దరాజు  అనే మగ్గురు వ్యక్తులు ఓ నంబర్‌ ప్లేట్‌ లేని ఆటోలో వచ్చి ఆమెను హత్య చేశారు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న నగలు, ఇంట్లో ఉన్న కొంత నగదును ఎత్తుకెళ్లారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, అక్కడకి చేరుకొని ఇది దొంగల పనే అని నిర్ధారించారు. కానీ కేసు దర్యాప్తు చేద్దామంటే.. వారికి తొలుత ఎలాంటి ఆధారాలు లభించలేదు.

ఇక లాభం లేదనుకున్న పోలీసులు.. హత్య జరిగిన రోజు ఉదయం కమలమ్మ​ ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా 'కింగ్‌ కోహ్లి' పేరు రాసి ఉన్న ఓ ఆటో అనుమానాస్పదంగా సంచరించడం వారికి కనిపించింది. దీని ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు కమలమ్మ ఇంటి సమీపంలో అంజనా మూర్తి అనే వ్యక్తి కింగ్‌ కోహ్లి పేరు రాసి ఉన్న ఆటోకు నంబర్‌ ప్లేట్‌ తొలగిస్తూ కనిపించాడు. అదే నిందితులను పట్టించింది. అంజనా మూర్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తమదైన స్టయిల్‌లో విచారించగా నిజం ఒప్పుకున్నాడు. 

ఐపీఎల్‌ బెట్టింగే హత్యకు కారణం..

ఐపీఎల్ 2023లో బెట్టింగ్ కాసిన ఈ ముగ్గురు నిందితులు భారీగా అప్పుల పాలైనట్లు తెలుస్తోంది. ఆ లోటును పూడ్చుకోవడానికే, ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. ఈ రకంగా కింగ్‌ కోహ్లి పరోక్షంగా ఓ హత్య కేసును ఛేదించడంలో పోలీసులకు తోడ్పడ్డాడన్న మాట.