సుదీర్ఘ విచారణలు ఎంతకాలం? : జిల్లా జడ్జి(రిటైర్డ్) డా. మంగారి రాజేందర్

తెలంగాణలో 2019 నవంబర్​18న ఓ అమ్మాయి దారుణ హత్యకు గురైంది. ఆ తర్వాత సైబరాబాద్​ పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్​ చేశారు. ఆ తర్వాత ఆ నలుగురు ఎదురు కాల్పుల్లో చనిపోయారని పోలీసులు ప్రకటించారు. అది బూటకపు(దిశ) ఎన్​కౌంటర్ అంటూ ​సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది. సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన వీఎస్​ సిర్పూర్కర్​ నేతృత్వంలో సుప్రీంకోర్టు ఓ జ్యుడీషియల్ ​ప్యానెల్​ని ఏర్పాటు చేసింది. ఆ కమిషన్​ సుదీర్ఘంగా విచారించి తన నివేదికను 2022 జనవరి 28న సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఆ ప్యానెల్​ సిఫారసు ప్రకారం ఆ ఎన్​కౌంటర్​లో పాల్గొన్న పోలీసు అధికారుల మీద క్రిమినల్​ ప్రొసీడింగ్స్​ ప్రారంభించాలని, రాష్ట్ర ప్రభుత్వం అలాంటి చర్యలను చేపట్టలేదని సుప్రీంకోర్టు న్యాయవాది వ్రిందా గ్రోవర్​ తెలంగాణ హైకోర్టు ముందు వాదనలు చేశారన్న వార్తలు రెండు రోజుల క్రితం పత్రికల్లో కనిపించాయి.

1991 నాటి కేసు.. 2016లో తీర్పు

అప్పట్లో ఇలాంటిదే ఓ వార్త చాలా మంది దృష్టిని ఆకర్షించింది. అది1991లో జరిగిన పిలిభిత్​ఎన్​కౌంటర్​ కేసు. ఆ కేసులో దాఖలైన అప్పీలును అలహాబాద్​ హైకోర్టు కొట్టివేసి 43 మంది పోలీసు సిబ్బందిని భారతీయ శిక్షా స్మృతిలోని 304 పార్ట్1 ప్రకారం దోషులుగా నిర్ధారించింది. మొదలు 43 మంది పోలీసు అధికారులకు లక్నో సీబీఐ స్పెషల్​కోర్టు 2016 ఏప్రిల్ నెలలో భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్​120 బీ, 302, 364, 365, 218, 117ల ప్రకారం శిక్షను విధించింది. ఈ శిక్షలకు వ్యతిరేకంగా వాళ్లు అలహాబాద్​ హైకోర్టులో అప్పీలు దాఖలు చేసుకున్నారు. ఆ అప్పీలుపై అలహాబాద్​ హైకోర్టు న్యాయమూర్తులు రమేశ్​ సిన్హా, సరోజ్​యాదవ్​ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘నిందితుడు భయంకరమైన నేరస్తుడన్న  కారణంగా అతన్ని చంపడం పోలీసుల విధికాదు. నిందితులను అరెస్ట్​ చేసి విచారణకు తీసుకు రావడం, వాళ్లు కోర్టు విచారణని ఎదుర్కొనేలా చూడటం పోలీసుల బాధ్యత. ఇందులో ఎలాంటి సందేహం లేదు”అని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్​లోని పిలిభిత్​ జిల్లాలో1991 జులై 12న తమకు వచ్చిన రహస్య సమాచారం ఆధారంగా ఖలిస్థాన్ ​లిబరేషన్​కు చెందిన కొందరు హార్డ్​కోర్​ టెర్రరిస్టులు ఉన్నారని నమ్మి పోలీసులు బస్సుల్లో తీర్థ యాత్రలకు వెళ్తున్న ప్రయాణికులను ఆపారు. ఆ బస్సుల్లో ఉన్న10 మంది సిక్కు యువకులను తీసుకువెళ్లారు. ఆ తర్వాత వాళ్లు 3 వేర్వేరు ప్రదేశాల్లో చంపబడ్డారు. 1991 నాటి ఈ కేసు విచారణను ట్రయల్​ కోర్టు 2016 ఏప్రిల్​లో ముగించింది. పోలీసులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని, అమాయక సిక్కు యువకులను ఎత్తుకెళ్లి బూటకపు ఎన్​కౌంటర్​లో హతమార్చారని ట్రయల్​ కోర్టు నిర్ధారించింది. ఆ హత్యలు బూటకపు ఎన్​కౌంటర్​ కాదని చెప్పడానికి ఎన్నో పత్రాలు సృష్టించగా, కోర్టు ఆ విషయాలను నమ్మలేదు. అది బూటకపు ఎన్ కౌంటర్ గా నిర్ధారించి వారికి శిక్షలను ఖరారు చేసింది.

ఆ కేసులో హైకోర్టు పరిశీలనలు

ఆ సిక్కు యువకులను చంపింది వాస్తవమే కానీ వారిని తమ ఆత్మ రక్షణార్థం చంపామన్నది పోలీసుల వాదన. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్​ 300లో 3వ మినహాయింపు ప్రకారం పోలీసు అధికారులు తమకు ఇచ్చిన అధికారాలను అధిగమించారు. చట్టం ద్వారా సంక్రమించిన అధికారాలను వారు సదుద్దేశంతో అధిగమించారు. వారి చర్యల ద్వారా ఆ వ్యక్తులు మరణించారని కోర్టు పేర్కొంది. ఈ చర్యలు విధి నిర్వహణకు చట్టబద్ధమైనవిగా, అవసరమైనవిగా వారు విశ్వసించారు. ఆ నిబంధనలోని మినహాయింపు ప్రకారం నేరస్థుడు పబ్లిక్​ సర్వెంట్​గా పనిచేస్తూ, లేదా పబ్లిక్​సర్వెంట్​కి సాయం చేస్తూ ఎవరైనా తమ అధికారాలను మించి చేసిన చర్యల ద్వారా మరణానికి కారణమైతే అది నేరపూరిత హత్య కాదు. ఈ కేసులో ఈ పది మంది సిక్కు యువకులను పోలీసులు తమ ఆత్మ రక్షణార్థం చంపారని కోర్టు ముందు వాదనలు చేశారు. అడవి ప్రాంతంలో వాళ్లు కనిపించి తమపై అకస్మాత్తుగా ఫైరింగ్​మొదలు పెట్టారని, తమని తాము రక్షించుకోవడం కోసం కాల్పులు జరిపితే వాళ్లు చనిపోయారనేది పోలీసుల వాదన. పోలీసుల ఆత్మరక్షణ వాదనను మెడికల్​సాక్ష్యం బలపరచలేదు. ముద్దాయిల(పోలీసు అధికారుల)ను క్రిమినల్​ ప్రొసీజర్​ కోడ్​లోని సెక్షన్​313 ప్రకారం ప్రశ్నలు వేసినప్పుడు వాళ్లని చంపేసినట్టు చెప్పారు. వాళ్లు పిలిభిత్​జిల్లాలో ఖలిస్థాన్ ​ఉద్యమం చేస్తున్నందున చంపామని చెప్పారు. అయితే ఆశ్చర్యకరంగా ఆ చనిపోయిన వ్యక్తుల్లో కొందరి మీదే క్రిమినల్​ రికార్డ్స్​ఉన్నాయని పోలీసులు కేసు విచారణ దశలో చెప్పారు. అయితే కోర్టు ఈ వాదనతో ఏకీభవించలేదు. మిగతా ఆరుగురిని చంపడంలో ఔచిత్యం లేదని, ఆ నలుగురు నేరస్తులు అయినంత మాత్రాన చంపడం న్యాయబద్ధం కాదని పేర్కొంది. ఆ పదిమంది సిక్కు యువకులను పోలీసులు కిడ్నాప్​ చేశారన్న విషయాన్ని ప్రాసిక్యూషన్​ పోలీసులపై నిరూపించలేకపోయింది. చనిపోయిన వ్యక్తులకు, పోలీసుల మధ్య ఎలాంటి దురుద్దేశం లేదని, న్యాయాన్ని అభివృద్ధి చేయడమే పోలీసుల లక్ష్యం అన్న నిర్ధారణకు కోర్టు వచ్చింది. అయితే పోలీసులు తమ అధికార పరిధిని అతిక్రమించారని కోర్టు అభిప్రాయపడింది. అందుకుని వారు శిక్షార్హులే అని కోర్టు అభిప్రాయపడింది. ఈ కారణాల వల్ల హత్యానేరం కింద కాకుండా, అది నేరపూరిత హత్య కాదని కోర్టు భావించి 304(1) ప్రకారం వాళ్లకి హైకోర్టు శిక్షను ఖరారు చేసింది. నేరం చేసిన పోలీసులకు శిక్ష పడటానికి దాదాపు 25 ఏండ్ల కాలం పట్టింది. అది హైకోర్టులో ఖరారు కావడానికి దాదాపు 31 ఏండ్ల కాలం పట్టింది. ఈ కేసు ఇక్కడితో అయిపోతుందని అనుకోలేం. సుప్రీం కోర్టుకు కూడా చేరొచ్చు. అక్కడ ఎంత కాలం పడుతుందో చెప్పలేం. ఏది ఏమైనా అన్యాయంగా చంపిన పోలీసులకు శిక్షపడిందని కొందరు అనుకుంటే జీవిత ఖైదు శిక్షను తగ్గించడం చాలా మందిని అసంతృప్తికి గురి చేసింది. 

సుప్రీంకోర్టుకూ వెళ్లే యోచన

ఎన్​కౌంటర్​లో చనిపోయిన వ్యక్తుల కుటుంబ సభ్యులు అలహాబాద్​ హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేస్తామని అంటున్నారు. ఆత్మరక్షణార్థం వాళ్లను చంపామన్న పోలీసుల వాదనని మెడికల్​సాక్ష్యం బలపరచడం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. అలా అంటూనే ఈ నేరం 304(1) కిందకు వస్తుందని కోర్టు తీర్పు చెప్పడంలోని ఔచిత్యాన్ని సుప్రీంకోర్టులో ప్రశ్నిస్తామని బాధిత కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ తుది తీర్పు ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో చెప్పలేం. ఇక దిశ ఎన్​కౌంటర్​కేసు సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుకు వచ్చింది.  దీనికి సంబంధించి దర్యాప్తు ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు తుది తీర్పు వస్తుందో చెప్పలేం. ఏది ఏమైనా సుదీర్ఘకాలం దర్యాప్తులు, విచారణలకు ముగింపు పలికితే తప్ప ఈ ఎన్​కౌంటర్లు అంతం కావు.

- డా. మంగారి రాజేందర్,

జిల్లా జడ్జి(రిటైర్డ్)