లా పాయింట్ : రేప్​ బాధితుల యుద్ధం ఎంతకాలం?

లా పాయింట్ :  రేప్​ బాధితుల యుద్ధం ఎంతకాలం?

అయితే అప్పుడప్పుడు న్యాయస్థానం స్పందిస్తుంది. అందుకు తార్కాణం బిల్కిస్​బానో కేసులోని సుప్రీంకోర్టు ఉత్తర్వులు.  రేప్​ నేర బాధితులు తమ కేసులో ఎఫ్ఐఆర్​ నమోదు చేయించుకోవడానికి చాలా శ్రమించాల్సి వస్తుంది. కేసులో శిక్ష పడటానికి మరెంతో కష్టపడాల్సి ఉంటుంది. ఇక్కడితో అయిపోలేదు. పడిన శిక్ష నుంచి ముద్దాయిలు త్వరగా విడుదల కాకుండా చూడాల్సిన పరిస్థితి కూడా రేప్​ నేర బాధితుల మీద ఏర్పడటం మన నేర న్యాయవ్యవస్థ దుస్థితిని తెలియజేస్తోంది. అందుకు ఉదాహరణ బిల్కిస్​ బానో కేసు. న్యాయం అనేది రేప్​ బాధితులకు అరుదుగా లభిస్తోంది. దానికోసం వాళ్లు సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సి వస్తుంది. అది భన్వరీదేవి కేసు కావొచ్చు. లలితకుమారి కేసు కావొచ్చు. బిల్కిస్​ బానో కేసు కావొచ్చు. కేసు నమోదు చేయడానికే బాధితులు  మరీ కష్టపడాల్సిన పరిస్థితి మన దేశంలో నెలకొని ఉంది. కొత్త చట్టాలు కాదు. పాలకుల మానసిక స్థితి, నేర న్యాయవ్యవస్థలోని భాగస్వాముల వైఖరి మారాలి. 

2008వ సంవత్సరంలో జరిగిన లలితకుమారి కేసు కూడా ఇలాంటిదే. ప్రథమ సమాచార నివేదిక కేసు విషయంలో  ప్రముఖమైనది. లలితకుమారి మైనర్​ బాలిక. ఆమెను కిడ్నాప్​ చేశారు. ఆమె తండ్రి పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. కానీ, పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేయలేదు. ఆ తర్వాత ఎస్పీ దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లగా ఆయన జోక్యంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ముద్దాయిలను అరెస్టు చేయలేదు. ఆ అమ్మాయిని వెతికి పట్టుకోలేదు. చివరికి ఆమె తండ్రి సుప్రీంకోర్టులో హెబియస్​ కార్పస్​ పిటిషన్​ దాఖలు చేశాడు.

 హత్రాస్​ రేప్​ కేసు కూడా దేశ ప్రజలని దిగ్ర్భాంతికి గురిచేసింది. 29 సెప్టెంబర్​ 2020న 19 సంవత్సరాల దళిత యువతిపై అత్యాచారం చేశారు. పై కులానికి చెందిన నలుగురు యువకులు ఆమె మీద సామూహిక మానభంగం చేశారు. ఆ నలుగురు కూడా ఆమె ఇంటిదగ్గరలో ఉన్న యువకులే. ఆమెను రేప్​చేసి చెరకుతోటలో వదిలిపెట్టారు. అప్పడు ఆమె పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. నడుము ఎముక విరిగిపోయింది. నాలుక తెగి మాట్లాడలేని పరిస్థితి. ఆ నలుగురు యువకులు ఠాకూర్​ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. ఉత్తరప్రదేశ్​లోని చాలామంది పోలీసు అధికారులు, న్యాయమూర్తులు ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే. పోలీసులు ఎఫ్ ఐఆర్​ నమోదు చేయడానికి ఆలస్యం చేశారు. 

ఆమె మరణ వాంగ్మూలంలో అత్యాచారం చేసిన నలుగురు పేర్లు చెప్పింది. బలహీనమైన చార్జ్​షీట్​ను పోలీసులు ఈ కేసులో దాఖలు చేశారు. ఆ కేసులో ముగ్గురు ముద్దాయిలు సులభంగానే బయటకు వచ్చారు. బాధిత యువతి మరణించింది. ఆమె మృతదేహాన్ని పోలీసులు ఆమె తల్లిదండ్రులకు ఇవ్వలేదు. అంతేకాదు వాళ్లను ఇంట్లోంచి బయటకు రాకుండా ఉంచి, ఆమె ఇంటికి దగ్గరలోనే పొలంలో దహనం చేశారు పోలీసులు. ఆమె దహనం తరువాత ఆమెపై రేప్​ జరగలేదన్న ఫోరెన్సిక్​నివేదికను పోలీసులు విడుదల చేశారు. ఈ విషయాన్ని ఆమెకు చికిత్స చేసిన సఫ్దర్​​జంగ్​ ఆసుపత్రి డాక్టర్లు ఖండించారు. 

బిల్కిస్​బానో కేసులో..సుప్రీంకోర్టు సంచలన తీర్పు

నేరస్థులు తేలికగా తప్పించుకుంటున్న పరిస్థితులు ఉన్న మనదేశంలో బిల్కిస్​బానో ముద్దాయిలకు శిక్షపడింది. ఈ కేసు గురించి బిల్కిస్​బానో 22 సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉంది. ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు అప్పడు ఆమె గర్భవతి కూడా. ఆమె కుటుంబంలో కొంతమందిని చంపేశారు. ఆమె కేసును మేజిస్ర్టేట్​ క్లోజ్​ చేశారు. అప్పడు ఆమె జాతీయ మానవ హక్కులు కమిషన్​ సహాయం తీసుకుని సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఆమె కేసును సీబీఐకి సుప్రీంకోర్టు బదిలీ చేసింది. గుజరాత్​ రాష్ర్టంలో ఆమెకు న్యాయం జరగకపోవచ్చని భావించిన సుప్రీంకోర్టు కేసును మహారాష్ట్రకి బదిలీ చేసింది. 2008వ సంవత్సరంలో 11మంది ముద్దాయిలకు సీబీఐ కోర్టు శిక్షను విధించింది.

ఆ తర్వాత తనను ముందుగా విడుదల చేయాలని రాధేశ్యామ్​ భగవాన్​దాస్​ దరఖాస్తు చేసుకున్నాడు. ఆ దరఖాస్తును పరిశీలించమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి అజమ్ రస్తోగి (ప్రస్తుతం పదవీ విరమణ చేశారు) నేతృత్వంలోని బెంచ్​ ఉత్తర్వులు జారీ చేసింది. అతనితోపాటు మిగతా ముద్దాయిలు కూడా రెమిషన్​కోసం దరఖాస్తు చేసుకున్నారు. గుజరాత్ ప్రభుత్వం 11మందికి రెమిషన్​ను 10 ఆగస్టు 2022న ఇచ్చింది. ఈ రెమిషన్​కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దరఖాస్తు దాఖలైంది. న్యాయమూర్తులు నాగరత్న, ఉజ్జల్ భుయాన్​లతో కూడిన సుప్రీంకోర్టు డివిజన్​ బెంచ్​ఈ రెమిషన్​ను తప్పపట్టింది.

ముద్దాయిలను సరెండర్​ కావాలని ఆదేశించింది. 

సరిగా పరిశీలించకుండా ముద్దాయిలకు రెమిషన్​ను మంజూరు చేశారని సుప్రీంకోర్టు పేర్కొంది. మహారాష్ర్ట ప్రభుత్వానికి ఉన్న  రెమిషన్​ అధికారాన్ని గుజరాత్​ ప్రభుత్వం లాక్కున్నదని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. సుప్రీంకోర్టు ఉత్తర్వు ప్రకారం 11మంది శిక్షపడిన ముద్దాయిలు రెండువారాల్లోగా జైళ్లకి వెళ్లాలి. కానీ, ఆవిధంగా వెళతారా, సుప్రీంకోర్టు పేర్కొన్నట్లురెమిషన్​ చేసే అధికారం ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం దగ్గర దరఖాస్తు చేసుకుంటారా వేచి చూడాల్సిన అంశం. మహారాష్ర్ట ప్రభుత్వం ఏం చేస్తుంది?. ఇది మిలియన్​ డాలర్ల ప్రశ్న. ఏమైనా రేప్​ బాధితులు, వారి కుటుంబ సభ్యులు నేర న్యాయవ్యవస్థలో యుద్ధం చేయాల్సి ఉంటుంది. చాలా కేసుల్లో రేప్​నేరస్థులు హాయిగా విడుదల అవుతారు. శిక్ష పడిన వ్యక్తులకి కూడా తగిన కారణాలు లేకుండానే రెమిషన్​ లభిస్తోంది. రేప్​ బాధితులు ఎంతకాలం యుద్ధం చేయాల్సి ఉంటుందనేది దేవుడే సమాధానం చెప్పాలి.

రేప్ బాధితులపై వివక్ష

రేప్​ నేర బాధితులు కేసు నమోదు కావడానికి చాలా శ్రమించాల్సి ఉంటుంది. భన్వారీ దేవి భటేరీ గ్రామానికి చెందిన మహిళ. దళిత యువతి. జైపూర్​కు 30మైళ్ల దూరంలో భటేరీ గ్రామం ఉంటుంది. బాల్య వివాహాలు జరగకుండా ఆమె గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ పనిచేసేది. తొమ్మిది నెలల పాప వివాహం జరగకుండా ఆమె గుజ్జర్​ కుటుంబ సభ్యులను ఒప్పించింది. గుజ్జర్లు అనే కులం పైవర్గానికి చెందినది. వివాహం ఆపిన విషయం తెలిసిన గుజ్జర్​ కులానికి చెందిన ఐదుగురు వ్యక్తులు భన్వరీ దేవి, ఆమె భర్తపై దాడి చేశారు. ఆమెను రేప్​ చేశారు. ఈ సంఘటన 22 సెప్టెంబర్​ 1992లో జరిగింది. ఆమె ఫిర్యాదును పోలీసులు తీసుకోవడానికి నిరాకరించారు. 52 గంటల తర్వాత ఆమెను వైద్య పరీక్షలకు పంపించారు. ఆమె శరీరం మీద ఉన్న గాయాలను కూడా సరిగ్గా రికార్డుల్లో రాయలేదు. సరైన సాక్ష్యాలు లేవన్న కారణంగా సెషన్స్ కోర్టు కేసుని కొట్టివేసింది. హైకోర్టు కూడా ఆ తీర్పును ధ్రువీకరించింది. పై కులానికి చెందిన వ్యక్తులు నిమ్న కులానికి చెందిన వ్యక్తిని తాకి అపవిత్రం కారని హైకోర్టు వ్యాఖ్యానం. కేసు నమోదు చేయడానికి నిరాకరించిన పోలీస్​ అధికారి, తీర్పును ప్రకటించిన హైకోర్టు న్యాయమూర్తి కూడా పై కులానికి చెందిన వ్యక్తులు కావడం ఇందులో గమనించాల్సిన అంశం. పక్షపాత ధోరణి ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. 

అక్కడ ఆ బోనులో ఆమె మళ్లీ బహిరంగంగా రేప్​కి గురువుతుంది. ఏ కృష్ణ పరమాత్ముడు ఆమెను రక్షించడానికి రాడు. అక్కడ న్యాయస్థానం ధర్మరాజై పోయింది. ధృతరాష్ట్రుడై పోయింది. భీష్ముడై పోయింది. ఇవి 1994వ సంవత్సరంలో నేను రాసిన ఓ కవితలోని చరణాలు.

- మంగారి రాజేందర్ జిల్లా జడ్జి (రిటైర్డ్​)