రేపు బీసీల రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా..
మనదేశంలో బీసీలు జీవితకాలమంతా.. రాజకీయ నాయకులకు ఓటువేసే యంత్రాలుగా బతకాల్సిందేనా? స్వాతంత్ర్యం వచ్చి ఏడున్నర దశాబ్దాలు గడిచినప్పటికీ బీసీల జనాభాను లెక్కించేందుకు పాలకవర్గాలు ఎందుకు జంకుతున్నాయి? పార్లమెంట్, అసెంబ్లీలో సగంవాటా కొల్పోతామనే భయంతోనే బీసీ కులగణన చేయటానికి పాలకులు ముందుకు రావడం లేదు.
కులగణన లేకుంటే వెనుకబడిన తరగతుల సామాజిక పరిస్థితులు, జనాభా దామాషా ప్రకారం అవకాశాలు లభిస్తున్నాయా లేదా అనేది ఎలా తెలుస్తుంది? కులాల వారీగా జనాభా లెక్కలు లేనందువల్ల రిజర్వేషన్లు ఎంతశాతం నిర్ణయించాలని అంశంపై మొదటి నుంచి కన్‌ఫ్యూజనే. 1931లో బ్రిటిష్ ప్రభుత్వం జరిపిన కులాలవారీ లెక్కలపై ఆధారపడి నిర్ణయాలు జరుగుతున్నాయి. ఈ లెక్కలు జాతీయస్థాయిలో ఒకేలా లేవు.
కులగణనతోనే బీసీల అభివృద్ధి
జనాభా అభివృద్ధి రేటు కూడా అన్ని కులాల్లో ఒకే రకంగా లేదు. అందుకే జనాభా లెక్కలను కులాల వారీగా చేపట్టాలని 1953లో కేంద్రం నియమించిన కాకా కాలేల్కర్ కమిషన్, 1978లో నియమించిన మండల్ కమిషన్లు కూడా కులాల వారీగా జనాభా లెక్కలు తీయాలన్న సిఫార్సులకు నేటికీ ఆచరణకు నోచుకోకపోవడం అన్యాయం. బీసీ కులగణన లేకపోవడం మూలంగా దేశంలో ప్రస్తుతం అమలవుతున్న బీసీ రిజర్వేషన్ల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. భారత రాజ్యాంగంలోని 15(4)(5), 16(4)(5) ప్రకారం వెనుకబడిన కులాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేయాలి.
ఆలాగే రాజ్యాంగంలోని 243 డి-(6), 243 టి -6 ప్రకారం స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని స్పష్టంగా ఉంది. కానీ, బీసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి సిఫార్సులు చేయాలంటే జనాభా లెక్కలు కావాలి. పైగా ప్రభుత్వ అభివృద్ధి పథకాలకు, రిజర్వేషన్లకు, పరిపాలనా సౌలభ్యం కోసం కులాలవారీగా లెక్కలు ఎంతగానో ఉపయోగపడతాయి.
కోర్టు తీర్పులను ఖాతరు చేయరా?
ఎన్నోసార్లు పెద్దకోర్టులు జోక్యం చేసుకుని రిజర్వేషన్లు ప్రవేశపెట్టినప్పుడు లేదా రిజర్వేషన్లు పెంచిన సందర్భాల్లో జనాభా లెక్కలు లేకుండా ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు పెడుతున్నారో లేదా పెంచుతున్నారో చెప్పాలని ప్రభుత్వాలను నిలదీస్తున్నాయి. అయితే, ప్రభుత్వాలు మాత్రం అసంబద్ధమైన కారణాలను సాకుగా చెప్పి తప్పించుకుంటున్నాయి, గతంలో మండల్ కమిషన్ కేసు సందర్భంగా బీసీ రిజర్వేషన్లు పెంచినప్పుడు, ఆలాగే 1986లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా మురళీధర్‌రావు కమిషన్ సిఫార్సు ప్రకారం ఎన్టీఆర్‌బీసీ రిజర్వేషన్లను 25 శాతం నుంచి 44 శాతానికి పెంచినప్పుడు కూడా..
కోర్టులు జనాభా లెక్కలు లేకుండా రిజర్వేషన్లు పెంపు సాధ్యం కాదని, పెంచిన రిజర్వేషన్లను కొట్టేసిన విషయం అందరికీ తెలిసిందే. 2010లో కృష్ణమూర్తి వర్సెస్ కర్నాటక ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు పెట్టినప్పుడు కూడా ఆ రిజర్వేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు కొట్టేసింది. జనాభా లెక్కలు శాస్త్రీయంగా ఉంటే ఆ మేరకు పెంచుకోవచ్చని స్పష్టమైన తీర్పులు వచ్చాయి.
నామమాత్రంగా బీసీ కమిషన్లు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కమిషన్లను ఏర్పాటు చేస్తున్నప్పటికీ వాటికి రాజ్యాంగబద్ధమైన అధికారాలు అనుకున్నస్థాయిలో లేకపోవడంతో నామమాత్రంగా మారిపోతున్నాయి. దాదాపు 9 దశాబ్దాల క్రితం 1931లో తీసిన జనాభా లెక్కలపై ఇప్పటికీ ఆధారపడి నిర్ణయాలు తీసుకోవడం బీసీ కులాలను మోసం చేయడమే కదా. అలాగే జనాభా అభివృద్ధి రేటు అన్ని కులాల్లో ఒకేలా లేదు. మత విశ్వాసాలు, సంప్రదాయాల కారణంగా కొన్నివర్గాలు కుటుంబ నియంత్రణ పాటించకపోవడంతో వృద్ధిరేటులో కూడా చాలా తేడాలున్నాయి.
గతంలో కేంద్రం నియమించిన కాకా కాలేల్కర్ కమిషన్ 1961లో, ఆలాగే 1978లో నియమించిన మండల్ కమిషన్ కూడా బీసీ జనాభా లెక్కలు తీయాలని సిఫార్సు చేసినప్పటికీ వాటిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇకనైనా కేంద్రం, రాష్ట్రాలు వెనుకబడ్డ తరగతులకు రాజ్యాంగబద్ధమైన కులగణనతోపాటు, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ప్రకటించేంతవరకు ఈ బీసీల పోరాటం ఆగదు.
- డాక్టర్.బి. కేశవులు నేత, చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం