సానిటేషన్ కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తం : మినిస్టర్ ​గంగుల

సానిటేషన్ కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తం : మినిస్టర్ ​గంగుల

రూ.1.64 కోట్లతో స్వీపింగ్ మెషీన్స్ ప్రారంభం

కరీంనగర్ టౌన్, వెలుగు: డిసెంబర్ 31లోగా కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేసి, జనవరి 1వ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇందుకోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన బ్రిడ్జి పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, ప్రస్తుతం రిటెయినింగ్ వాల్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అనంతరం స్థానిక జడ్పీ ఆవరణలో వినియోగించేందుకు రూ.1.64 కోట్లతో కొన్న 2 స్వీపింగ్ యంత్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కరీంనగర్ లో సానిటేషన్ కోసం ఎన్ని కోట్ల రూపాయలైనా ఖర్చు చేస్తామన్నారు. డెంగీ, విషజ్వరాలు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, కరీంనగర్ కార్పొరేషన్ లో 5 స్వీపింగ్ వెహికల్స్ కొని పారిశుధ్య పనులు చేపడుతున్నమన్నారు. అనంతరం కలెక్టరేట్​లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ కోసం చేపట్టాల్సిన పనుల గురించి చర్చించారు. జిల్లాలోని గ్రామీణ నీటి సరఫరా, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, ధాన్యం కొనుగోలు, మన ఊరు మనబడి, ఎలక్ట్రిసిటీ తదితర అభివృద్ది  పనుల పురోగతిపై అధికారులతో మాట్లాడారు.

అభివృద్ధిలో ఫస్ట్ ప్లేస్..

కరీంనగర్​అభివృద్ధి పనుల కోసం సీఎం కేసీఆర్ మొదట జీఓ నంబర్ 4 ను అమలు చేశారని, పనులు వేగంగా పూర్తిచేసి రాష్ట్రంలో జిల్లాను  ప్రథమ స్థానంలో నిలబెట్టాలని పిలుపునిచ్చారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యంలో కోతలు విధించొద్దని, తరుగు పేరుతో రైతులకు ఇబ్బందులు కలుగజేసే రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో కలెక్టర్ కర్ణన్, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సీఈఓ ప్రియాంక, సుడా చైర్మన్ రామకృష్ణారావు, మేయర్ సునీల్ రావు, సేవా ఇస్లావత్, కనుమళ్ల విజయ తదితరులు పాల్గొన్నారు.