ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్ష ఇంకెన్నాళ్లు?

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు గడిచినా కుల వివక్ష అనేది ఇంకా ఏదో ఒకరకంగా దేశంలో కొనసాగుతూనే ఉంది. గ్రామీణ ప్రాంతాలు.. మారుమూల ఏజెన్సీ ఏరియాల్లో అంతగా చదువురాని వారు కుల వివక్షకు గురవుతున్నారను కుంటే పొరపాటే. ఎంతో చదువుకుని, పెద్ద సంస్థల్లో పనిచేస్తున్న వారికి కూడా కుల వివక్ష ఎదురవుతోంది. ఇది వెనుకబడిన వర్గాల పాలిట శాపంగా మారుతోంది.

కొద్దిరోజుల క్రితం ఐఐటీ మద్రాస్​లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న విపిన్ పి. వీటిల్‌ కులవివక్ష వల్ల కలత చెంది తన పదవికి రాజీనామా చేశారు. ప్రొఫెసర్ విపిన్ అమెరికాలోని జార్జ్ మాసన్ యూనివర్సిటీ నుంచి పీహెచ్​డీ పట్టా పొంది, యూనివర్సిటీ అఫ్ పారిస్ నుంచి పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ చేసి, ఐఐటీ మద్రాస్​లో అసిస్టెంట్ ప్రొఫెసర్​గా చేరారు. అంతర్జాతీయ స్థాయిలో 25 పరిశోధన పత్రాలు ప్రచురించారు. చిన్న వయసులో ఎకనమిక్స్​లో అంతర్జాతీయ కీర్తిని పొందిన విపిన్, బీసీ కులంలో పుట్టడమే ఇబ్బందులు తెచ్చిపెట్టింది. 

ప్రమాదకరమైన సిఫార్సులు చేసిన కమిటీ

మరోవైపు, కేంద్ర విద్యా శాఖ ఐఐటీల్లో రిజర్వేషన్ల అమలుపై ప్రొఫెసర్ రామ్‌గోపాల్ రావు కమిటీని నియమించింది. అయితే ఆ కమిటీ రిజర్వేషన్లు ఎంత ప్రభావవంతంగా అమలు చేయాలన్న అంశాన్ని పక్కన పెట్టి ఐఐటీలను కేంద్ర విద్యా సంస్థల(రిజర్వేషన్​ ఇన్​ టీచర్స్ కేడర్‌) 2019 చట్టం నుంచి మినహాయించాలని సిఫారసు చేసింది. ఎస్సీ , ఎస్టీ, ఓబీసీలకు అన్యాయం చేసే ఈ సిఫార్సు నివేదికను కేంద్ర విద్యా శాఖ ఇప్పటి వరకూ తిరస్కరించలేదు. ప్రొఫెసర్ రామ్‌గోపాల్ రావు కమిటీ నివేదిక మరో రెండు ప్రమాదకరమైన సిఫార్సులు కూడా చేసింది. అవి ఏంటంటే.. 1.  ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయిల్లో రిజర్వేషన్లు ఎత్తివేయడం. ఎస్సీ, ఎస్టీ, బీసీ టీచింగ్​ స్టాఫ్​లకు సరైన అభ్యర్థులు లేకపోయినా, అర్హత సాధించకపోయినా డి-–-రిజర్వ్​డ్​ చేసే అధికారం ఐఐటీలకు ఇవ్వడం. 2. పీహెచ్‌డీలో చేరడానికి ముందు రెండు సంవత్సరాల ప్రత్యేక సన్నాహక కోర్సును రిజర్వ్​డ్​ విద్యార్థులే చేయాలనే సిఫార్సు.

రిజర్వేషన్లను కచ్చితంగా అమలు చేయాలె

దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్షను అంతం చేయడానికి, ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఎస్‌ఈఆర్‌లు, ఐఐఎస్‌సీ, ఐఐఎంలు, సెంట్రల్​ యూనివర్సిటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో రిజర్వేషన్లను సరిగ్గా అమలు చేయడానికి అవసరమైన చర్యలను తీసుకోవడానికి ప్రధాని నరేంద్రమోడీ ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ చేసిన సిఫార్సులను యుద్ధప్రాతిపదికన అమలు చేయాలి. సామాజిక న్యాయం కోసం రాజ్యాంగం ఇచ్చిన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం గట్టిగా సమర్థించాలి. ప్రొఫెసర్​ రామ్​గోపాల్​రావు కమిటీ వివక్షతో చేసిన సిఫార్సులను వెంటనే తిరస్కరించాలి. సెంట్రల్ ఎడ్యుకేషన్ ఇన్​స్టిట్యూట్స్ చట్టం విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగ  నియామకాలకు సంబంధించి కల్పించిన రిజర్వేషన్లను, ఇతర చట్టాలను అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో ఖచ్చితంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలి. కేంద్ర విద్యా శాఖ స్థాయిలో ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీసెల్​ను ఏర్పాటు చేయాలి. కుల వివక్షపై కఠిన చర్యలు తీసుకోకపోయినా, ప్రొఫెసర్ రామ్‌గోపాల్ రావు కమిటీ సిఫార్సులను అమలు చేసినా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులు ఏకమై సామాజిక న్యాయం, భావితరాల భవిష్యత్తు కోసం ఉద్యమించాలి.

రిజర్వేషన్లు అమలు కావట్లేదు

దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్ష ఇంకా జటిల సమస్యగానే మిగిలిపోయింది. సెంట్రల్ ఎడ్యుకేషన్  ఇన్​స్టిట్యూషన్(రిజర్వేషన్ ఇన్ టీచర్స్ క్యాడర్) యాక్ట్ 2019 ప్రకారంగా అన్ని విద్యాసంస్థల్లో ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్లలో ఎస్సీలు 15 శాతం, ఎస్టీలు 7.5 శాతం, ఓబీసీలు 27 శాతం, ఈడబ్ల్యూఎస్ కు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్తోంది. కానీ ఐఐటీ మద్రాస్​లో టీచింగ్​ స్టాఫ్​లో 1 శాతం ఎస్టీలు, మూడు శాతం ఎస్సీలు , ఓబీసీలు పది శాతం మాత్రమే ఉన్నారు. మిగతా 86 శాతం ఉన్నత కులాల వారు ఉన్నారు. మొత్తం 23 ఐఐటీల్లో  6,067 టీచింగ్​ స్టాఫ్​లో 86.66 శాతం ఉన్నత కులాలవారు ఉంటే మిగతా 13.34 శాతం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఉన్నారు.

- జి.కిరణ్ కుమార్,
జాతీయ అధ్యక్షుడు, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్