- ప్రజావాణిలో దళితుల ఆవేదన
- కలెక్టరేట్‌లోకి అనుమతించని పోలీసులు
- ఆడిటోరియం ముందు బాధితుల నిరసన
కరీంనగర్, వెలుగు: తమకు దళితబంధు పథకాన్ని వెంటనే అమలుచేయాలని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన దళితులు డిమాండ్ చేశారు. సోమవారం మరోసారి ప్రజావాణికి భారీ సంఖ్య లో వచ్చారు. ఇటీవల కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో హుజూరాబాద్‌కు చెందిన బాధితులు పురుగుల మందు డబ్బాలు పట్టుకుని నిరసన తెలిపిన సంగతి తెలిసిందే!. దీంతో ఇలాంటి ఘటనలు జరగకుండా కలెక్టరేట్ లో మూడంచెల భద్రత ఏర్పాటు చేసి దళితబంధు లబ్ధిదారులను చెక్ చేసి పంపిస్తున్నారు. సోమవారం కొందరు నిరసన తెలుపుతుండగా మరికొంతమంది లోపలికి వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో బాధితులు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు వారిని బయటకు లాక్కెళ్లి తెచ్చుకున్న ఫ్లెక్సీని తీసుకున్నారు. కాగా ప్రజావాణిలో 147 దరఖాస్తులు వచ్చినట్లు అడిషనల్కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ తెలిపారు.
సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి
జగిత్యాల: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ జి. రవి అన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణికి 26 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు లత, అరుణ శ్రీ, ఆర్డీవోలు మాధురి, వినోద్ పాల్గొన్నారు.
సిరిసిల్ల టౌన్ : స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 47 ఫిర్యాదు వచ్చాయని అడిషనల్కలెక్టర్లు ఖీమ్యానాయక్, సత్యప్రసాద్ తెలిపారు. సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
నౌకర్లు ఉన్నోళ్లకు కూడా వచ్చినయ్
మాది వీణవంక మండలం పోతిరెడ్డి పల్లి. నాకు పెళ్లయి ఐదేండ్లు అయ్యింది. దళితబంధు కోసం ఏడాది నుంచి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న. అడిగితే రేషన్ కార్డు కావాలంటున్నరు. కొత్త కార్డులు రాలేదు. ఆర్నెల్ల క్రితం పెండ్లయిన వాళ్లకు కూడా దళిత బంధు ఇచ్చిండ్రు. గవర్నమెంట్ నౌకర్లు ఉన్నోళ్లకు కూడా వచ్చినయ్. వాళ్లకు ఎట్లా సాధ్యమైతంది. మాకు ఎందుకు అయితలేదు.
- గాజుల రమేశ్, పోతిరెడ్డి పల్లి, వీణవంక
వారంల మూడు దినాలు వస్తున్న
దళితబంధు కోసం కరీంనగర్ కు వారానికి మూడు రోజులు వస్తున్న. పైసలు వస్తయని కలెక్టర్ ఆఫీస్, ఈడీ ఆఫీసుకు తిరుగుడే తప్ప వచ్చింది లేదు. నా భర్త చనిపోయి 18 ఏండ్లు అయితుంది. ఇద్దరు పిల్లలు. వాళ్లను ఎట్లా సాదుకోవాలి. అన్ని తీర్ల ఉన్నోళ్లకు దళితబంధు ఇచ్చిండ్రు. లంచాలు ఇయ్యాలంటే మావల్ల ఏడయితది.
- ఉమ, కనగర్తి, ఇల్లందకుంట