ప్రార్థనా స్థలాల చట్టంపై ఇంకెన్ని పిటిషన్లు వేస్తరు? అదేపనిగా పిటిషన్లు వేయడంపై సుప్రీంకోర్టు అసహనం

ప్రార్థనా స్థలాల చట్టంపై ఇంకెన్ని పిటిషన్లు వేస్తరు? అదేపనిగా పిటిషన్లు వేయడంపై సుప్రీంకోర్టు అసహనం
  • ఇప్పటికే దాఖలు చేసిన వ్యాజ్యాలు చాలు
  • పెండింగ్  వ్యాజ్యాలను ఏప్రిల్​లో విచారిస్తామని వెల్లడి

న్యూఢిల్లీ: ప్రార్థనా స్థలాల చట్టం 1991లో పేర్కొన్న మార్గదర్శకాలను సవాలుచేస్తూ ఇంకెన్ని పిటిషన్లు వేస్తారంటూ పిటిషనర్లపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తంచేసింది. ఇప్పటికే వేసిన వ్యాజ్యాలు చాలని సూచించింది. పెండింగ్ లో ఉన్న అన్ని పిటిషన్లపైనా ఏప్రిల్ లో ముగ్గురు జడ్జిల బెంచ్ విచారణ జరుపుతుందని వెల్లడించింది. అయితే.. ఇటీవల పిటిషన్లు వేసి నోటీసులు అందుకోని సమాజ్ వాదీ పార్టీ నేత, కైరానా ఎంపీ ఇక్రా చౌధరి వంటి పిటిషనర్లకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. 

పెండింగ్ లో ఉన్న వ్యాజ్యాల్లో జోక్యం కోసం కొత్త కారణాలు చూపుతూ అలాంటి వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. నోటీసులు జారీచేయని తాజా పిటిషన్లను చీఫ్  జస్టిస్  సంజీవ్  ఖన్నా, జస్టిస్  సంజయ్ కుమార్ తో కూడిన బెంచ్  కొట్టివేసింది. రిట్ పిటిషనర్లు కొత్త కారణాలు చూపుతూ ఇంటర్ వెన్షన్  అప్లికేషన్  వేయవచ్చని తెలిపింది. ‘‘ప్రార్థనా స్థలాల చట్టంపై ఇప్పటికే భారీగా పిటిషన్లు వేశారు. పాతవి పెండింగ్ లో ఉండగానే.. కొత్త కారణాలు చూపుతూ ప్రజలు అలాగే వ్యాజ్యాలు వేస్తున్నారు. దీంతో వాటిని పరిశీలించడం మాకు కష్టంగా మారుతోంది. ఇప్పటివరకు దాఖలైన పిటిషన్లు అన్నింటినీ పరిశీలించాక రిట్ పిటిషనర్లు ఇంటర్ వెన్షన్  అప్లికేషన్  వేయవచ్చని ఆదేశాలు జారీచేస్తున్నాం. 

ప్రస్తుతానికి ఇంటెరిమ్  అప్లికేషన్లను (ఐఏ) మాత్రమే అనుమతిస్తాం. అందులోనూ కొత్త పాయింట్ ఉండాలి. లేదా పెండింగ్  పిటిషన్ లో లేవనెత్తని లీగల్  ఇష్యూ అయినా ఉండాలి” అని బెంచ్  స్పష్టం చేసింది. బెంచ్ అలా ఆదేశించడం సమంజసమే అని సీనియర్ అడ్వొకేట్ దుష్యంత్ దవే అన్నారు. ఇక ఈ విషయంపై కొత్త పిటిషన్లు వేయడానికి అనుమతివ్వకూడదని ఆయన అంగీకరించారు. అయితే.. పిటిషనర్ల తరపున మరో సీనియర్ అడ్వొకేట్ వికాస్  సింగ్  మాట్లాడుతూ.. ఇప్పటిదాకా దాఖలైన పిటిషన్లపై కేంద్రం స్పందించలేదని, కేంద్రానికి మరో అవకాశం ఇవ్వాలని కోరారు. 

వాదనలు విన్న బెంచ్.. పెండింగ్ పిటిషన్లపై ముగ్గురు జడ్జిలతో కూడిన బెంచ్ ఏప్రిల్ లో విచారణ జరుపుతుందని వెల్లడించింది. కాగా.. జ్ఞానవాపి మసీదు, షాహీ ఈద్గా, మథుర, షాహీ జామా, సంభాల్  మసీదులతో పాటు మరికొన్ని వివాదాస్పద మసీదులపై సర్వేకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వివిధ హిందూ సంఘాలు 18 పిటిషన్లు దాఖలు చేశాయి.