నూతన విద్యా సంవత్సరం మొదలుకాక ముందే ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ కాలేజీలు అడ్మిషన్ల పేరుతో విద్య వ్యాపారాన్ని ప్రారంభించేశాయి. కొన్ని కార్పొరేట్ స్కూల్స్ లో ఎల్కేజీలో పిల్లలను జాయిన్ చేయాలంటే కనీసం రూ. లక్ష చెల్లించాల్సి వస్తోంది. కొత్త అడ్మిషన్లకి డొనేషన్లు అదనం. ఇలా లక్షలలో ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వపరంగా నియంత్రించే దిక్కే లేదు. ఇక కార్పొరేట్ జూనియర్ కాలేజీలైతే ఒక విద్యా సంవత్సరానికి కనీసం రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ధోబీ ఫీజు, బుక్స్ కోసం అని మాట్లాడుకున్న ఫీజు కంటే యాభై వేల రూపాయిల వరకు అదనంగా వసూలు చేస్తున్నాయి. మొదటి సంవత్సరం చదివిన విద్యార్థులు రెండవ సంవత్సరం చదవాలంటే, గత సంవత్సరం ఫీజుపై యాభై వేల నుంచి లక్ష రూపాయిల వరకు అదనంగా ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. ఇక ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల దోపిడీ గురించి చెప్పనక్కరలేదు. తెలంగాణలో ఉన్నత విద్య పేదవారికి మిథ్యగానే మారిపోయింది.
విద్యార్థుల ఫీజుల నియంత్రణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం "తిరుపతిరావు కమిటీ" ని వేసినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ఫీజుల నియంత్రణపై గత విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి ఏమీ పట్టనట్లుగా వ్యవహరించారు. చాలా కార్పొరేట్ స్కూల్స్, కాలేజీలు, ఇంజినీరింగ్ కాలేజీల్లో రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులే యజమానులుగా ఉన్నారు. వీరు తమ ఎన్నికల్లో ఖర్చు కోసం విద్యని వ్యాపారంగా మార్చి వేస్తున్నారు. చాలావరకు కార్పొరేట్ స్కూళ్లలో, జూనియర్ కాలేజీలలో ఫైర్ సెఫ్టీ లేదు. ఆటస్థలాలు లేవు. ల్యాబ్లు, లైబ్రరీలు అసలే లేవు. తప్పనిసరి నిబంధనలు ఎన్ని ఉన్నా అవన్నీ కాగితాలకే పరిమితం. నిబంధనలు పాటించని విద్యా సంస్థలపై ఎలాంటి చర్యలు ప్రభుత్వ అధికారులు తీసుకోరు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంజినీరింగ్ కాలేజీల్లో, ఇతర కాలేజీలలో చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విధానం ఉండేది. ఫీజులని ప్రభుత్వమే కాలేజీలకు చెల్లించేది. దీనివల్ల కార్పొరేట్ విద్యాసంస్థలు తాము అనుకున్నంత ఫీజులని వసూలు చేయలేకపోతున్నాం అని భావించి భారీ ఎత్తున గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో లాబీయింగ్ చేసి ఈ విధానాన్ని నెమ్మదిగా ఆటకెక్కించాయి. దీనిపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తోంది.
కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం
నిజానికి ప్రభుత్వం మెరుగైన ఉచిత విద్య, వైద్యం అందిస్తే ఉచిత పథకాలు ఏమీ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ప్రతి కుటుంబం తమ పిల్లల విద్య కోసం తమ తాహతుకు మించి ఖర్చు చేస్తూ అప్పులు పాలవుతున్నారు. ఫీజుల దోపిడీ గురించి తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు ఫిర్యాదు చేసినా విద్యాశాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వ పెద్దలకు కూడా ప్రైవేట్విద్యాసంస్థల యాజమాన్యంలో భాగస్వామ్యం ఉండటమే దీనికి కారణం. ఇక ప్రభుత్వ స్కూళ్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్న చందంగా ఉంది. ఇరవై సంవత్సరాల క్రితం ప్రభుత్వ పాఠశాలలు విద్యా ప్రమాణాలతో అద్భుతంగా పనిచేసేవి. ఇప్పటి అధికారుల్లో తొంభై శాతం మంది అప్పట్లో ప్రభుత్వ స్కూళ్లలో చదివినవారే. అప్పట్లో టీచర్లు అంటే సమాజంలో గౌరవం ఉండేది. అయితే అదంతా గతం. ఇప్పుడు ప్రభుత్వమే కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలను, కళాశాలలను ఒక పద్ధతి ప్రకారం భూస్థాపితం చేస్తోంది. ప్రస్తుతం అనేక ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు లేవు, బాలికలకు టాయిలెట్లు లేవు, ఉన్నా నీటి వసతి లేదు, వాటిని రోజు శుభ్రం చేసేవారు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తారు?
ప్రభుత్వ టీచర్లు, లెక్చరర్లలో అత్యున్నత ప్రతిభ
నిజానికి ఇప్పటికీ ప్రభుత్వ విద్యాసంస్థల్లో పనిచేసే టీచర్లు, లెక్చరర్లు అత్యున్నత ప్రతిభ కలిగినవారే ఉన్నారు. వీరంతా తమ ప్రతిభతో రాష్ట్ర స్థాయి నియామక పరీక్షల్లో ఉత్తీర్ణులై ఎన్నికైనవారే. అయితే, ప్రభుత్వ విధానాలే ప్రభుత్వ విద్యాలయాల్లో బోధనను పడకేసేలా చేస్తున్నాయి. బోధనాభ్యసన విషయాల్లో విద్యాశాఖ అధికారుల అసంబద్ధ నిర్ణయాలవల్ల టీచర్లు స్వేచ్ఛగా చదువు చెప్పలేకపోతున్నారు. స్కూళ్లలో రికార్డ్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు లేనందువల్ల టీచర్లకు చదువుచెప్పే విధులకంటే రోజువారీ రిపోర్టులను సమర్పించే డ్యూటీలే ఎక్కువగా ఉంటున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఒక గెజిటెడ్ హెడ్మాస్టర్ సుమారు నాలుగు నుంచి ఐదు మండలాలకు ఇంచార్జిగా ఉంటున్నారు. దీనివల్ల వీరు అటు తాము పనిచేసే స్కూళ్లను చూసుకోలేక, ఇటు మండలంలోని ఇతర స్కూళ్లని పర్యవేక్షించలేకపోతున్నారు. దీంతో ప్రభుత్వ విద్యారంగం వెనుకబడుతోంది. ఇది కార్పొరేట్ స్కూళ్లకు వరంగా మారింది,
ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి
ప్రభుత్వానికి అటు సాధారణ ప్రభుత్వ పాఠశాలలతోపాటు గురుకులాలపై ఉన్నది కపట ప్రేమ మాత్రమే. ప్రజలచేతనే ప్రభుత్వ విద్యాసంస్థలు పనికిరావు అనే ముద్రవేయించి, వారిని పరోక్షంగా కార్పొరేట్ విద్యాసంస్థల వైపు మళ్లించడమే ప్రభుత్వ ధ్యేయంగా కనిపిస్తోంది. అందుకే కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలను చూసీ చూడనట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. . ఇది అత్యంత ప్రమాదకరం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళుతెరిచి ప్రైవేట్ విద్యాసంస్థల ఆగడాలను అరికట్టాలి. అధిక ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వమే ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలి. ఫిన్లాండ్ వంటి దేశాల్లోలాగా ప్రభుత్వమే ప్రజలందరికీ ఉచిత విద్యనందించే దిశగా తక్షణమే చర్యలు చేపట్టాలి. ప్రజలు కూడా ఉచితాల కోసం ఎగబడకుండా తమ పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్యకోసం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. ప్రస్తుత ప్రభుత్వమైనా ప్రభుత్వ విద్యపై సీరియస్గా దృష్టి పెట్టాలి.
- నారగోని ప్రవీణ్ కుమార్.
అధ్యక్షుడు, ఉచిత విద్య,
వైద్య సాధన సమితి