భౌగోళికంగా అరణ్యాలు, కొండ, ఒంటరి ప్రాంతాల్లో నివసిస్తూ అటవీ ఉత్పత్తులు లేదా పోడు వ్యవసాయంపై ఆధారపడుతూ ప్రత్యేకమైన భాషా సంస్కృతులు, వేషధారణ, జీవన విధానాన్ని కలిగి ఉన్న వారినే గిరిజనులని పిలుస్తారు. గిరిజన జీవితంలోని మొత్తం సమాజంలో సంబంధాలు బంధుత్వంపై ఆధారపడి ఉంటాయి. బంధుత్వం కేవలం సామాజిక వ్యవస్థాపన సూత్రం మాత్రమే కాదు. ఇది ఆస్తి సంక్రమణ, శ్రమ విభజన, విశిష్టాధికారాల పంపిణీ సూత్రం, గిరిజన సమాజాలు చిన్నవిగా ఉండి ప్రత్యేక నైతిక విలువలు, ప్రత్యేక మతం, ప్రత్యేక ప్రాపంచిక దృష్టిని కలిగి ఉంటాయి. వీరిని సూచించేందుకు రాజ్యాంగంలో షెడ్యూల్డ్ ట్రైబ్ అనే పదాన్ని ఉపయోగించారు.
పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్
దేశవ్యాప్తంగా రాష్ట్రపతి గుర్తించిన 705 గిరిజన తెగల్లో 75 గిరిజన తెగలను అంతరించడానికి సిద్ధంగా ఉన్న గిరిజన తెగలు లేదా పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్‌గా పిలుస్తున్నారు. వీరు కాలక్రమంలో అంతరించిపోయే దశలో ఉన్నారు. 2013 వరకు వీరిని పర్టిక్యులర్ ట్రైబల్ గ్రూప్‌గా పిలిచేవారు. దేశవ్యాప్తంగా ఇలాంటి అంతరించడానికి దగ్గరగా ఉన్న 75 గిరిజన తెగలుండగా, అత్యధికంగా ఒడిశాలో 13 ఉన్నాయి. తెలంగాణలో నాలుగు గిరిజన తెగలు ఇలాంటి స్థితిలో ఉన్నాయి. అవి.. చెంచులు, కొండరెడ్లు, కోలములు, తోటిలు. వీరిలో మొదటగా పీవీటీజీగా గుర్తింపు చెంచులు పొందారు.
గిరిజనుల జనాభాపరమైన వివరాలు
- దేశవ్యాప్తంగా 2011 జనాభా లెక్కల ప్రకారం గిరిజనుల జనాభా 10.45 కోట్లు. దేశ జనాభాలో వీరి శాతం 8.6.
- 2001 నుంచి 2011 మధ్యకాలంలో గిరిజనుల జనాభా 23.7శాతం పెరిగింది.
- గిరిజనుల్లో లింగ నిష్పత్తి దేశవ్యాప్తంగా 990. 0–6 సంవత్సరాల వారిలో లింగ నిష్పత్తి 957.
- గిరిజనుల అక్షరాస్యత 58 శాతం. ఇందులో పురుష అక్షరాస్యత 68.5 శాతం. స్త్రీ అక్షరాస్యత 49.4 శాతం.
- అత్యధిక సంఖ్యలో గిరిజనులు మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఉన్నారు. అతి తక్కువ గిరిజన జనాభా కలిగిన రాష్ట్రం గోవా.
- లక్షద్వీప్‌లో 100 శాతం ఎస్టీ జనాభా ఉంది. రాష్ట్ర జనాభాలో అధిక శాతం గిరిజనులు కలిగిన రాష్ట్రం మిజోరాం (94.4శాతం).
- హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఢిల్లీ, పుదుచ్చేరిల్లో ఎస్టీలను అధికారికంగా గుర్తించలేదు.
- కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాద్రానగర్ హవేలిలో అత్యధికంగా ఏడు గిరిజన తెగలు ఉన్నాయి.
- దేశవ్యాప్తంగా అధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ భిల్లులు. వీరు ఉత్తర భారతదేశమంతా విస్తరించి ఉన్నారు. రెండో స్థానంలో గోండులు, మూడో స్థానంలో సంతాలులు ఉన్నారు.
- అరుణాల్‌ప్రదేశ్‌లో అత్యధికంగా 13 గిరిజన జిల్లాలను గుర్తించారు.
- దేశ వ్యాప్తంగా అత్యల్ప సంఖ్యలో ఉన్న గిరిజన తెగ సెంటినలిన్స్. వీరు అండమాన్ నికోబార్ దీవుల్లో జీవిస్తున్నారు.
తెలంగాణలో గిరిజనులు
- తెలంగాణలో 2011 జనాభా లెక్కల ప్రకారం 32.876 లక్షల గిరిజనులు ఉన్నారు. తెలంగాణ జనాభాలో వీరి శాతం 9.34. అక్షరాస్యత 49.51శాతం.
- జనాభాపరంగా అధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ బంజారాలు. రెండో స్థానంలో కోయలు, మూడో స్థానంలో గోండులు ఉన్నారు.
- రాష్ట్రంలో 32 గిరిజన తెగలు, 4 పీవీటీజీలు ఉన్నాయి. అవి.. కొండరెడ్లు, చెంచులు, కోలములు, తోటిలు.
- తెలంగాణలో బంజారాల నివాస స్థలాన్ని తండాలని, చెంచుల నివాస స్థలాలను పెంటలని, కోయల నివాస స్థలాన్ని గూడెంలు అని అంటారు.
రాజ్యాంగపరమైన గుర్తింపు
- రాజ్యాంగంలోని ఆర్టికల్ 366(25) అనేది గిరిజన తెగలను నిర్వచిస్తుంది.
- ఆర్టికల్ 343(2) ప్రకారం రాష్ట్రపతి గుర్తించిన గిరిజనుల జాబితాను పార్లమెంట్ చట్టం ద్వారా సవరించవచ్చు.
- ఎస్టీల వర్గీకరణ, గుర్తింపు విషయంలో రాష్ట్రాలకు, గవర్నర్‌కు ఎలాంటి అధికారం లేదు.
- ఆర్టికల్ 244 ప్రకారం గిరిజన ప్రాంతాల్లో వారి సంస్కృతికి, జీవన విధానానికి ఆటంకం కలగకుండా ప్రత్యేకమైన పాలన విధానం ఏర్పాటు చేశారు.
- ఆర్టికల్ 244 (1) ప్రకారం అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాలు మినహాయించి మిగతా రాష్ట్రాల్లో ఉన్న గిరిజన ప్రాంతాల్లో పరిపాలనకు సంబంధించి రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్లోని నిబంధనలను అనుసరించి పరిపాలన కొనసాగించాలి. రాష్ట్రపతి సంబంధిత రాష్ట్ర గవర్నర్‌ను సంప్రదించి ఐదో షెడ్యూల్ ప్రాంతాలను ప్రకటిస్తారు.
- ఆర్టికల్ 244 (2) ప్రకారం అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల్లో ఆరో షెడ్యూల్లో పొందుపరిచిన నిబంధనల ఆధారంగా పాలన కొనసాగించాలి. ఐదో షెడ్యూల్ ప్రకారం గిరిజన సలహా మండళ్లు ఉండాలి. ఆరో షెడ్యూల్ ప్రకారం స్వయం ప్రతిపత్తి కలిగిన గిరిజన జిల్లాలను ఏర్పాటు చేశారు.